ఐఆర్‌కోసం ఆర్టీసీ కార్మికుల దీక్ష
హైదరాబాద్, న్యూస్‌లైన్: కార్మికులకు తక్షణమే మధ్యంతర భృతిని చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ), ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఐక్య కూటమి ఆధ్వర్యంలో సోమవారం ఇందిరాపార్కు ధర్నా చౌక్‌వద్ద రెండు రోజుల దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా టీఎంయూ ప్రధాన కార్యదర్శి ఇ. అశ్వథ్థామరెడ్డి, ఈయూ అదనపు ప్రధాన కార్యదర్శి వీఎస్ రావులు మాట్లాడుతూ జనవరి 26న జరిగిన ఒప్పందం మేరకు ఫిబ్రవరి వేతనంతో పాటు ఐఆర్ చెల్లిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
మధ్యంతర భృతి రాక ఆర్టీసీలో లక్షా 25 వేల మంది ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ఈ నెల 12 లోగా ఐఆర్ చెల్లిస్తున్నట్లు ఆర్టీసీ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోతే 12వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 217 డిపోల్లో నిరవధిక సమ్మె ప్రారంభమవుతుందని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో కార్మిక శాఖ కమిషనర్ చర్చలకు ఆహ్వానించారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు చర్చలు జరగనున్నాయి.