ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో జీపీఎస్ ట్రాకింగ్.. 'గమ్యం' యాప్ తో..
వరంగల్: టీఎస్ ఆర్టీసీ.. ప్రయాణికుల ముంగిటకు మరో సాంకేతిక సహకారాన్ని తీసుకొచ్చింది. ఆర్టీసీ బస్సులకు సంబంధించిన సంపూర్ణ సహకారం అందించే ‘గమ్యం వెహికిల్ ట్రాకింగ్’ యాప్‌ను తీసుకొచ్చింది. ఈ యాప్‌ను శనివారం హైదరాబాద్ బస్ భవన్ నుంచి ఆర్టీసీ ఎండీ వి.సి.సజ్జనార్ ప్రారంభించారు. ప్రారంభోత్సవాన్ని ప్రయాణికులు వీక్షించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్ స్టేషన్లో డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులో జీపీఎస్ పరికరాలు బిగించారు.
ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్ ఆపై బస్సుల్లో మాత్రమే జీపీఎస్ సమాచారం అందుబాటులోకి వచ్చింది. త్వరలో పల్లె వెలుగు బస్సులకు కూడా ఈ సౌకర్యం విస్తరించేందుకు యాజమాన్యం ఏర్పాటు చేస్తోంది. ‘గమ్యం వెహికిల్ ట్రాకింగ్ యాప్’ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి స్మార్ట్ ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ ద్వారా బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు. ఈ యాప్‌తో బస్సుల సమయం, ఏఏ బస్సులు ఏ సమయంలో అందుబాటులో ఉన్నాయో, బస్సు ఎక్కడికి వరకు వచ్చింది. బస్ స్టేషన్లు, బస్ స్టేజీల సమాచారం తెలుసుకోవచ్చు. ఈ యాప్ ప్రయాణికులకు ఎంతో దోహదపడుతుందని ఆర్టీసీ అధికారులు చెప్పారు.
మహిళల రక్షణకు ప్రాధాన్యం..
మహిళల రక్షణకు యాప్‌లో ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. ప్రధానంగా హైదరాబాద్, సికింద్రాబాద్‌లో బస్ స్టేషన్లు, రూట్లు తెలియక చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి వారి కోసం గమ్యం యాప్‌లో ‘ఫ్లాగే బస్సు’ ఆనే ఆప్షన్ కూడా చేర్చారు. యాప్‌లోకి వెళ్లి ఫ్లాగే బస్ అనే చోట నొక్కితే (టచ్ చేస్తే) స్మార్ట్ ఫోన్లో ప్రత్యేక కలర్ వస్తుంది. ఈ కలర్‌తో ఉన్న స్మార్ట్ ఫోన్‌ను బస్సు ఎదుటగా చూపిస్తే డ్రైవర్ చూసి బస్సును నిలిపి మహిళలను ఎక్కించుకుంటారు. సమీపంలో ఉన్న బస్ స్టేజీలో దింపుతారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.