వారంలో ఐఆర్! | interim allowance very soon! | Sakshi
Sakshi News home page

వారంలో ఐఆర్!

Published Sun, Dec 15 2013 1:31 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

వారంలో ఐఆర్! - Sakshi

వారంలో ఐఆర్!

25 శాతం లేదా 26 శాతం ఇచ్చే అవకాశం?
 
 సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులకు మధ్యంతర భృతి(ఐఆర్)ని వారం రోజుల్లోగా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈనెల 21వ తేదీలోగా ఇచ్చేలా చర్యలు చేపడతామని పేర్కొంది. శనివారం సచివాలయంలో వివిధ ఉద్యోగ సంఘాలతో మంత్రుల బృందం సమావేశమై ఐఆర్‌పై చర్చించింది. సమావేశంలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కొండ్రు మురళి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నాన్‌గెజిటెడ్ అధికారుల సంఘం, తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం, ఉపాధ్యాయ సంఘాలు, సచివాలయ ఉద్యోగుల, ఇతర సంఘాలను చర్చలకు ఆహ్వానించారు.
 
 అయితే తెలంగాణ, సచివాలయ, ఉపాధ్యాయ సంఘాలు ముందుగానే రాగా.. ఏపీఎన్‌జీవోస్ మరికొన్ని కొన్ని సంఘాలు తరువాత వచ్చాయి. ముందుగా వచ్చిన సంఘాలతోనే హాల్ నిండిపోవడంతో ఏపీఎన్‌జీవోస్, ఇతర సంఘాల నేతలు అశోక్‌బాబు, చంద్రశేఖర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి తదితరులు వేచి ఉండాల్సి వచ్చింది. టీఎన్‌జీవోస్‌తోపాటు తెలంగాణకు చెందిన ఇతర సంఘాలు, పీఆర్‌టీయూ తదితర సంఘాలతో చర్చల అనంతరం ఏపీఎన్‌జీవోస్, ఎస్టీయూ, యూటీఎఫ్, ఏపీటీఎఫ్ తదితర సంఘాలతో మంత్రుల బృందం చర్చలు జరిపింది. ఏయే సంఘం ఎంత ఐఆర్ ఇవ్వాలని కోరుతోంది..? దానికి ప్రాతిపదిక ఏమిటనే అంశాలపై వివరాలను సేకరించింది.
 
 ఏపీఎన్‌జీవోస్ నేత అశోక్‌బాబుతోపాటు ఉపాధ్యాయ సంఘాలైన పీఆర్‌టీయూ, ఎస్టీయూ, యూటీఎఫ్, ఏపీటీఎఫ్ నేతలు పి.వెంకట్‌రెడ్డి, కత్తి నర్సింహారెడ్డి, వెంకటేశ్వర్‌రావు, రఘురామిరెడ్డి తదితర సంఘాల నేతలు నిత్యావసర ధరలను విపరీతంగా పెరిగినందున 50 శాతం ఐఆర్ ఇవ్వాలని కోరారు. టీఎన్‌జీఓస్ అధ్యక్షుడు దేవీ ప్రసాద్, సచివాలయ తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగ సంఘాల నేతలు నరేందర్‌రావు, మురళీకృష్ణ తదితరులు 45 శాతం అడిగారు. టీ జీవోస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ తదితరులు 47 శాతం ఐఆర్ ఇవ్వాలని కోరారు. మొత్తానికి అన్ని సంఘాలు 45 శాతం నుంచి 50 శాతం వరకు ఐఆర్ ఇవ్వాలని కోరాయి. ప్రభుత్వం మాత్రం 25 శాతం ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
 
 సంఘాలు మరీ పట్టుపడితే.. 26 శాతం ఇచ్చే అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో 18 శాతం ఐఆర్ ఇవ్వగా ఐదేళ్ల కిందట 22 శాతం ఐఆర్ ఇచ్చింది. ఐదేళ్ల కిందట ఇచ్చినపుడు ఒక్క శాతానికి రూ. 124 కోట్లు కాగా, ఇపుడు రూ. 284 కోట్లు వెచ్చించాల్సివస్తోంది. ఈ పరిస్థితుల్లో ఎక్కువ మొత్తం ఇవ్వడం ప్రభుత్వానికి ఆర్థిక భారం అవుతుందని ఆలోచనలు చేస్తోంది. గతంలో కంటే ఎక్కువ ఇచ్చామని చెప్పుకునేందుకు వీలుగా  25 శాతం లేదా 26 శాతం ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనిపై వారం రోజుల్లో (ఈనెల 21వ తేదీలోగా) ముఖ్యమంత్రి వద్ద మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకొని ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది.
 
 సంఘాలను వేర్వేరుగా పిలవాల్సిందే!
 
 మంత్రుల బృందంతో చర్చల అనంతరం సంఘాల నేతలు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగ సంఘాలను వేర్వేరుగానే చర్చలకు పిలవాలని టీఎన్‌జీవోస అధ్యక్షుడు దేవీ ప్రసాద్ డిమాండ్ చేశారు. జీఏడీ రూపొందించిన జాబితా ప్రకారం చర్చలు జరిపి జాప్యం చేయకుండా ఐఆర్ ఇవ్వాలని కోరారు. సమావేశం నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని ఏపీఎన్‌జీవోస్ అధ్యక్షుడు అశోక్‌బాబు విమర్శించారు. సమావేశ మందిరంలోకి అందరినీ అనుమతించకుండా.. సంఘానికి ఇద్దరు చొప్పున అనుమతించాల్సిందన్నారు. హెల్త్ కార్డుల ఉత్తర్వులను నిలిపివేయాలని, సవరించిన తరువాత జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం వేర్వేరుగా చర్చలు జరపాలని పీఆర్‌టీయూ అధ్యక్షుడు వె ంకట్‌రెడ్డి పేర్కొన్నారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని సంఘాల ప్రకారం 4.5 లక్షల మంది ఉన్న టీచర్ల సంఘాలను వేరుగా పిలిచి మాట్లాడాలన్నారు.
 
 వారంలోగా సీఎంతో చర్చించి నిర్ణయం: ఆనం
 
 ఉద్యోగులకు మధ్యంతర భృతిపై వారం రోజుల్లోగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆర్థికశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. సీఎం ఆదేశాల మేరకు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపామని, విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement