సాక్షి, హైదరాబాద్: ఇటీవలే ఉద్యోగులకు మధ్యంతర భృతి (ఐఆర్) మంజూరు చేసిన ప్రభుత్వం, తాజాగా పెన్షనర్లకు 27 శాతం ఐఆర్ మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పెన్షనర్లకు కూడా ఈ ఏడాది జనవరి 1 నుంచి తాజా ఐఆర్ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అయితే, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు, విశ్వవిద్యాలయాల్లోని బోధనేతర సిబ్బందికి ఐఆర్ వర్తించదంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పీఎస్‌యూ ఉద్యోగులకు ఐఆర్ వర్తించదంటూ ఉత్తర్వులు ఇవ్వడంపై ‘సాక్షి’ కథనానికి స్పందించిన ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, జీవోను సవరించేందుకు వీలుగా ఐఆర్ ఫైల్‌ను సర్క్యులేట్ చేయాలని అధికారులను ఆదేశించారు.