pension plans
-
కనీస రాబడులతో వినూత్న పెన్షన్ పథకం
ముంబై: వినూత్నమైన పెన్షన్ ప్లాన్లను తీసుకురావడం దిశగా పనిచేస్తున్నట్టు పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ (పీఎఫ్ఆర్డీఏ) ప్రకటించింది. ఇందులో కనీస రాబడుల హామీతో ఒక పథకం ఉంటుందని పీఎఫ్ఆర్డీఏ చైర్మన్ సుప్రతిమ్ బంధోపాధ్యాయ అన్నారు. పీఎఫ్ఆర్డీఏ నియంత్రణలో ప్రస్తుతం ఎన్పీఎస్, అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పథకాలు కొనసాగుతుండగా.. మరింత మంది చందాదారులను ఆకర్షించేందుకు వినూత్నమైన పెన్షన్ ఉత్పత్తులను తీసుకురావడంపై దృష్టి పెట్టామని బంధోపాధ్యాయ చెప్పారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ యాక్చుయరీస్ ఆఫ్ ఇండియా నిర్వహించిన వర్చువల్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. నూతన పెన్షన్ ఉత్పత్తి తీసుకువచ్చే విషయంలో యాక్చుయరీలు సాయమందించాలని బంధోపాధ్యాయ కోరారు. యాక్చుయరీల నుంచి వచ్చే సూచనలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఎన్పీఎస్ నుంచి వైదొలిగే సమయంలో సభ్యులకు అధిక రేట్లతో కూడిన పెన్షన్ లేదా యాన్యుటీ ప్లాన్‌ను అందించే అంశంపై దృష్టి సారించినట్టు చెప్పారు. మార్కెట్ ఆధారిత బెంచ్‌మార్క్ రేట్లకు అనుగుణంగా ఉండే భిన్నమైన యాన్యుటీ ఉత్పత్తుల అవసరం ఉందన్నారు. క్రమానుగతంగా కావాల్సినంత వెనక్కి తీసుకునే ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ) మాదిరి యాన్యుటీ ప్లాన్లు కావాలన్నారు. పెన్షన్ ఎంత రావచ్చన్న అంచనాలను ప్రస్తుత, నూతన చందాదారులకు అందుబాటులోకి తీసుకురావడంపై పనిచేస్తున్నట్టు బంధోపాధ్యాయ చెప్పారు. -
ఠీవీగా రిటైర్మెంట్..!
వేతన జీవులు అందరూ తాము రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత నిశ్చింతగా జీవించేందుకు ముందుగానే ప్రణాళికా బద్ధంగా సన్నద్ధం కావాల్సి ఉంటుంది. ఈ విషయమై ఇటీవలి సంవత్సరాల్లో అవగాహన విస్తృతం అవుతోంది. విశ్రాంత జీవితానికి క్రమం తప్పని పెట్టుబడులు ఎంతో కీలకం. ఇందుకోసం బాగా ప్రాచుర్యంలో ఉన్న సాధనాల్లో మ్యూచువల్ ఫండ్స్, యూనిట్ లింక్డ్ పెన్షన్ ప్లాన్లు, నేషనల్ పెన్షన్ సిస్టమ్, ఈపీఎఫ్, పీపీఎఫ్, వీపీఎఫ్ ఉన్నాయి. వీటిలోని లాభ, నష్టాలు తెలుసుకున్న తర్వాత తమ రిస్క్ ప్రొఫైల్‌కు అనుగుణంగా భిన్న సాధనాల మధ్య ఎంత పెట్టుబడుల కేటాయించాల్సిన మొత్తాలపై ప్రణాళిక వేసుకోవాలి. ఆ తర్వాత క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయడంతోపాటు, నిర్ణీత కాలానికి ఆ పెట్టుబడుల మొత్తాన్ని పెంచుకుంటూ వెళ్లాలి. ఇందుకు సంబంధించిన పెట్టుబడి సాధనాల వివరాలను తెలియజేసే కథనమే ఇది. మ్యూచువల్ ఫండ్స్, రిటైర్మెంట్ పథకాలు రిటైర్మెంట్ జీవనానికి నిధి సమకూర్చుకునేందుకు మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి డైవర్సిఫైడ్ ఈక్విటీ పథకాలు సరైన ఎంపిక అవుతుంది. లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, మల్టీక్యాప్, స్మాల్‌క్యాప్, ఈఎల్ఎస్ఎస్ ఇలా ఎన్నో రకాల పథకాలు ఉన్నాయి. గడిచిన పదేళ్ల కాలంలో మార్కెట్లలో ఎన్నో ఎత్తు పల్లాలు ఉన్నప్పటికీ ఈ విభాగాల్లోని పథకాలు వార్షికంగా 16–21 శాతం మధ్య రాబడులను ఇచ్చాయి. ఇదే కాలంలో సెన్సెక్స్ టీఆర్ఐ (టోటల్ రిటర్న్ ఇండెక్స్) రాబడులు 17.8 శాతంగా ఉన్నాయి. 25 ఏళ్ల కాలంలో చూసుకుంటే సెన్సెక్స్ వార్షిక రాబడులు 11 శాతంగా ఉన్నాయి. ఇదే కాలంలో టాప్ లార్జ్‌క్యాప్ ఫండ్స్ వార్షికంగా 19 శాతం ప్రతిఫలాన్ని ఇచ్చాయి. కాకపోతే సెబీ ఇటీవలి కాలంలో పథకాల పునర్వ్యస్థీకరణకు చేసిన మార్పులు, గత ఏడాది కాలంలో మార్కెట్ల పనితీరు నత్తనడకనే ఉండడం వంటి అంశాలతో లార్జ్‌క్యాప్ పథకాల పనితీరు బెంచ్‌మార్క్‌కు అనుగుణంగా లేదు. కనుక మిడ్, స్మాల్‌క్యాప్ విభాగంలో యాక్టివ్ పథకాలు దీర్ఘకాలంలో మంచి పనితీరు చూపించగలవు. దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లడం, నిర్ణీత కాలానికోసారి పోర్ట్‌ఫోలియో రీబ్యాలన్స్ చేసుకోవడం, పనితీరు ఆశించిన మేర లేని పథకాల నుంచి వైదొలగి, వాటి స్థానంలో వేరే వాటిని ఎంచుకోవడం చేస్తుండాలి. నిర్ణీత లక్ష్యానికి సమయం దగ్గర పడుతుంటే ఈక్విటీల నుంచి వైదొలిగి సురక్షిత సాధనాల్లోకి పెట్టుబడులు మళ్లించుకోవాలి. ఇందుకోసం అధిక నాణ్యత కలిగిన డెట్ ఫండ్స్, బ్యాంకు ఎఫ్డీలు పనికొస్తాయి. సాధారణ ఈక్విటీ పథకాలకు అదనంగా ప్రత్యేకించి రిటైర్మెంట్ అవసరాల కోసం రిటైర్మెంట్ ప్లాన్లు ఉన్నాయి. ఫ్రాంక్లిన్ ఇండియా పెన్షన్, యూటీఐ రిటైర్మెంట్ బెనిఫిట్ పెన్షన్ ఈ విభాగంలోనివే. వీటిల్లో పెట్టుబడులకు సెక్షన్ 80సీ కింద ఆదాయపన్ను మినహాయింపు ప్రయోజనం ఉంది. ఇక టాటా, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, ఆది త్య బిర్లా సన్‌లైఫ్ కూడా పథకాలను ప్రవేశపెట్టాయి. ఇందులో టాటా రిటైర్మెంట్ పథకానికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. ప్రొగ్రెసివ్, మోడరేట్ పేరుతో నడిచే రెండు ఈక్విటీ పథకాల్లోనూ ఐదేళ్ల కాలంలో రాబడులు 18 శాతం స్థాయిలో ఉన్నాయి. బెంచ్‌మార్క్ కంటే ఈ పథకం ఎక్కవే రాబడులు తెచ్చిపెట్టింది. యూటీఐ రిటైర్మెంట్, ఫ్రాంక్లిన్ పెన్షన్ అన్నవి డెట్‌తో కూడిన బ్యాలన్స్డ్ ఫండ్స్. డెట్‌కు, ఈక్విటీలకు 40:60 నిష్పత్తిలో పెట్టుబడులను కేటాయిస్తాయి. ఈ రెండు పథకాలు గత ఐదేళ్ల కాలంలో వార్షికంగా 10–11 శాతం రాబడులను ఇచ్చాయి. ఈ పథకాలన్నీ కూడా నెలవారీగా తమ పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో వివరాలను ఇన్వెస్టర్లకు వెల్లడిస్తుంటాయి. ఇండెక్స్ ఫండ్స్ 1–1.5 శాతం స్థాయిలో చార్జ్ చేస్తుంటే, ఈటీఎఫ్‌ల్లో ఎక్స్పెన్స్ రేషియో 0.5 శాతంగా ఉంటోంది. యాక్టివ్‌గా నడిచే ఈక్విటీ ఫండ్స్ మాత్రం 1.6–2.7 శాతం మధ్య చార్జీలను రాబడుతున్నాయి. రిటైర్మెంట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఎక్స్పెన్స్ రేషియో 2.3–2.8 శాతం మధ్య ఉంది. ఇక డైరెక్ట్ ప్లాన్ల ద్వారా ఇన్వెస్ట్ చేసుకుంటే అర శాతం వరకు ఎక్స్పెన్స్ రేషియో భారం తగ్గుతుంది. పన్ను వివరాలు ఫ్రాంక్లిన్ ఇండియా పెన్షన్, యూటీఐ రిటైర్మెంట్ బెనిఫిట్ పెన్షన్ ప్లాన్లు రెండింటిలోనూ పెట్టుబడులకు ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. అయితే ఈ ఫండ్స్‌లో తొలుత పెట్టుబడి చేసేటప్పుడు మినహాయింపు లభిస్తుంది కానీ...వాటిపై వచ్చే రాబడులపై పన్ను వుంటుంది. ఈ రెండూ డెట్‌తో కూడిన హైబ్రిడ్ ఫండ్స్. మూడేళ్లకు మించి పెట్టుబడులు కొనసాగిస్తే రాబడులపై 20 శాతం పన్ను రేటు చెల్లించాల్సి ఉంటుంది. కాకపోతే ఈ రాబడులకు ఇండెక్సేషన్ (ద్రవ్యోల్బణం మినహాయింపు) ప్రయోజనం ఉంటుంది. మూడేళ్లలోపు వైదొలిగితే ఆ మొత్తాన్ని వార్షిక ఆదాయానికి కలిపి చూపించుకోవాలి. అదే ఈక్విటీ పథకాలు అయితే ఏడాది దాటిన తర్వాత రాబడులపై 10 శాతం క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉంటుంది. ఏడాదిలోపు అయితే 15 శాతం పన్ను పడుతుంది. రిటైర్మెంట్ తర్వాత సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ ఎంచుకోవడం ద్వారా ప్రతీ నెలా తమ అవసరాలకు సరిపడా వెనక్కి తీసుకోవచ్చు. దీంతో పన్ను భారం అంతగా ఉండదు. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) విశ్రాంత జీవనానికి అందుబాటులో ఉన్న పెట్టుబడి సాధనాల్లో అత్యంత ముఖ్యమైనది ఎన్పీఎస్. ఈక్విటీ, ప్రభుత్వ సెక్యూరిటీలు, కార్పొరేట్ బాండ్ల సమతూకంతో పలు రకాల పెట్టుబడి ఆప్షన్లు ఎన్‌పీఎస్‌లో ఉన్నాయి. ఎనిమిది ఫండ్ మేనేజర్లలో ఇన్వెస్టర్లు తమకు నచ్చిన సంస్థను ఎంచుకోవచ్చు. వీటిల్లో హెచ్డీఎఫ్సీ ఏఎంసీ, యూటీఐ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, కోటక్ మెరుగ్గా ఉన్నాయి. బిర్లా సన్‌లైఫ్ మినహా మిగిలిన ఫండ్ సంస్థలు ఎన్‌పీఎస్‌లు ఏ మేరకు రాబడులను ఇచ్చాయన్నదానిపై ఐదేళ్ల ట్రాక్ రికార్డు అందుబాటులో ఉంది. ఆ వివరాలను పరిశీలించి అనువైన దానిని ఎంచుకోవచ్చు. వార్షికంగా కనీసం రూ.1,000ను ఇన్వెస్ట్ చేయాలి. గరిష్ట పెట్టుబడికి పరిమితి లేదు. ఈక్విటీలకు గరిష్టంగా 75 శాతాన్నే యాక్టివ్ చాయిస్ కింద ఎంచుకోవచ్చు. మిగిలిన 25 శాతాన్ని తప్పనిసరిగా కార్పొరేట్ బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ సాధనాలకు కేటాయించుకోవాల్సి ఉంటుంది. 50 ఏళ్ల వయసు దాటితే యాక్టివ్ చాయిస్ చందాదారులు ఈక్విటీలకు కేటాయింపులను క్రమంగా 50 శాతానికి తగ్గించుకోవాల్సి ఉంటుంది. అదే ఆటో చాయిస్లో అయితే ఎన్పీఎస్ చందాదారుని వయసు ఆధారంగా ఈక్విటీలకు పెట్టుబడుల రేషియో మారుతూ ఉంటుంది. ఉదాహరణకు 40 ఏళ్ల వ్యక్తి అయితే, 100 సంవత్సరాల కాలంలో 40 ఏళ్లను తీసివేయగా, మిగులు 60 శాతం ఉంటుంది కనుక ఈ విధానం ప్రాతిపదికన ఆటో చాయిస్లో ఈక్విటీలకు 60 శాతం డెట్సాధనాలకు 40 శాతం ఫండ్ మేనేజర్లే కేటాయింపులు చేస్తారు. ఈక్విటీల్లోనూ ఇండెక్స్ ఫండ్స్, సెన్సెక్స్, నిఫ్టీ 50, నిఫ్టీ 100 స్టాక్స్‌లోనే ఫండ్స్ సంస్థలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది తప్పనిసరి. గడిచిన ఐదేళ్ల కాలంలో ఈక్విటీతో కూడిన పెట్టుబడి ఆప్షన్ కింద ఫండ్స్ మేనేజింగ్ సంస్థలు వార్షికంగా 11–13 శాతం మధ్య రాబడులను ఇచ్చాయి. ఇందులో హెచ్డీఎఫ్సీ ఏఎంసీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, కోటక్, యూటీఐ 12 శాతానికి పైబడి రాబడులను ఇచ్చాయి. గిల్ట్ విభాగంలో పెట్టుబడులపై ఇవి గత ఐదేళ్ల కాలంలో వార్షికంగా 10–11 శాతం మేర రాబడులు తెచ్చి పెట్టాయి. కార్పొరేట్ బాండ్స్ విభాగంలో రాబడులు 9–10 శాతం మధ్య ఉన్నాయి. పాక్షిక ఉపసంహరణలకు అనుమతి కొన్ని రకాల అనారోగ్యాలతో ఆస్పత్రి పాలైతే, పిల్లల విద్యావసరాలు, ఇంటి కొనుగోలు సమయాల్లో పాక్షిక ఉపసంహరణలకు ఎన్పీఎస్ పథకంలో అనుమతి ఉంది. ఎన్పీఎస్ ఫండ్ మేనేజర్లు నెలవారీగా, కొన్ని సందర్భాల్లో అర్ధ సంవత్సరానికోసారి పోర్ట్‌ఫోలియో వివరాలను వెల్లడిస్తుంటాయి. ఆన్లైన్, ఆఫ్లైన్లోనూ ఎన్పీఎస్ను ప్రారంభించుకోవచ్చు. ఖాతా ప్రారంభ చార్జీ కింద రూ. 40 చెల్లించాల్సి ఉంటుంది. వార్షిక నిర్వహణ ఫీజు కింద ఎన్ఎస్డీఎల్కు రూ. 95 చెల్లించాలి. వీటికి అదనంగా ప్రతీ లావాదేవీపై రూ.3.75 చార్జీ ఉంటుంది. కార్వీ సంస్థ తక్కువ చార్జీలను వసూలు చేస్తోంది. ఇంకా పాయింట్ ఆప్ ప్రెజెన్స్ (డిస్ట్రిబ్యూటర్‌కు చెల్లించేది) చార్జీ పేరుతో ప్రారంభంలో రూ.200 చార్జీ చెల్లించుకోవాలి. అంతేకాదు, ఇక ఆ తర్వాత చేసే అన్ని పెట్టుబడులపై 0.25 శాతం కమీషన్ కూడా డిస్ట్రిబ్యూటర్‌కు వెళుతుంది. ఈఎన్పీఎస్ ద్వారా పెట్టుబడి పెడితే అప్పుడు పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్‌కు కేవలం 0.1 శాతమే కమీషన్ వెళుతుంది. కనుక ఆన్లైన్లో నేరుగా ఎన్పీఎస్ సైట్ ద్వారా చందాలు చేసుకోవడం ద్వారా ఆదా చేసుకోవచ్చు. అలాగే, ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ ఫీజు కూడా వార్షికంగా 0.01 శాతమే పడుతుంది. ఆదాయపన్ను ప్రయోజనాలు ఎన్పీఎస్కు అదనంగా ఉన్నాయి. సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల పెట్టుబడుల తర్వాత కూడా మరో రూ.50,000 మొత్తంపై పన్ను మినహాయింపును సెక్షన్ 80సీసీడీ కింద ఎన్‌పీఎస్‌లో పెట్టుబడుల ద్వారా పొందే అవకాశం ఉంది. ఎన్‌పీఎస్‌లో రూ.2 లక్షలు ఇన్వెస్ట్ చేసినా మొత్తం సెక్షన్ 80సీ, సీసీడీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. 60 ఏళ్ల తర్వాత మొత్తం నిధిలో 60 శాతాన్ని పన్ను లేకుండా వెనక్కి తీసుకోవచ్చు. మిగిలిన 40 శాతాన్ని పెన్షన్ యాన్యుటీ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయాలి. యూనిట్లింక్డ్ ప్లాన్లు ఈక్విటీ ఆధారిత పెన్షన్ ప్లాన్లు కూడా ఉన్నాయి. వీటిని బీమా సంస్థలు ఆఫర్ చేస్తుంటాయి. బజాజ్ అలియాంజ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, ఎస్బీఐ లైఫ్ పెన్షన్లను ప్లాన్లను అందిస్తున్నాయి. బీమా సంస్థలు తాము నిర్వహించే ఈక్విటీ, డెట్ లేదా హైబ్రిడ్ పథకాల్లో పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది. రాబడులకు హామీ ఉండదు. మార్కెట్ పనితీరు ఆధారంగానే ఉంటాయి. గడిచిన మూడేళ్ల కాలంలో వార్షిక రాబడులు ఎంచుకున్న పథకాలను బట్టి 6.5–14.1 శాతం మధ్య ఉన్నాయి. ఐదేళ్ల కాలంలో వార్షిక రాబడులు 7.3–12.6 శాతంగా ఉన్నాయి. ఎటువంటి చార్జీలను మినహాయించకముందు రాబడుల వివరాలు ఇవి. రాబడులు ఆశించిన విధంగా లేకపోతే భిన్న ఆప్షన్ల మధ్య పెట్టుబడులను మార్చుకునే అవకాశాన్ని బీమా సంస్థలు ఈ పథకాల్లో అనుమతిస్తున్నాయి. రిటైర్మెంట్ ప్లాన్ గడువు ముగిసిన తర్వాత సమకూరిన నిధిలో మూడింట రెండొతులను పెన్షన్ యాన్యుటీ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయడం తప్పనిసరి. ఒక వంతును వెనక్కి తీసుకోవడానికి అనుమతి ఉంటుంది. యూనిట్ లింక్డ్ పెన్షన్ ప్లాన్లు ప్రతీ నెలా పోర్ట్‌ఫోలియో వివరాలను వెల్లడిస్తుంటాయి. కాకపోతే ఈ పాలసీల్లో బీమా కూడా ఉంటుంది కనుక అదనపు చార్జీల భారాన్ని మోయాల్సి వస్తుంది. యూనిట్ లింక్డ్ప్లాన్ ఎందులో అయినా పెట్టుబడులు, బీమా కలగలసి ఉంటాయి. దీంతో మోర్టాలిటీ చార్జీలు, పాలసీ అడ్మినిస్ట్రేషన్ చార్జీలు, ఫండ్ మేనేజ్మెంట్ చార్జీలు, ప్రీమియం అలోకేషన్ చార్జీలు ఇలా రకరకాల రూపంలో చార్జీల భారం ఉంటుంది. ఫండ్ మేనేజ్మెంట్ చార్జీ 1–1.35 శాతం వరకు ఉంటుంది. పాలసీ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ 0.3–0.4గా ఉంటుంది. వార్షిక ప్రీమియానికి బీమా మొత్తం కనీసం 10 రెట్లు ఉంటే, పన్ను మినహాయింపు లభిస్తుంది. సెక్షన్ 80సీ కింద ప్రీమియానికి పన్ను మినహాయింపు ఉంటుంది. అలాగే, ఉపసంహరణ సమయంలో ఒక వంతుకు పన్ను ఉండదు. మిగిలిన రెండొంతులను యాన్యుటీ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ దీర్ఘకాలిక లక్ష్యాల కోసం అందుబాటులో ఉన్న సురక్షిత పెట్టుబడి సాధనాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ఒకటి. ఇందులో పెట్టుబడులకు హామీ ఉంటుంది. ప్రస్తుత వడ్డీ రేటు 8 శాతం. ప్రతీ త్రైమాసికానికి వడ్డీ రేట్లను కేంద్రం సవరిస్తుంటుంది. దీనికి అదనంగా పన్ను మినహాయింపులు (పెట్టుబడులపై, రాబడులు, ఉపసంహరణలపైనా) ఉన్నందున ఇది ప్రతి ఒక్కరి పోర్ట్‌ఫోలియోలో ఉండాల్సిన సాధనం. ఇది డెట్ సాధనం. వ్యవధి 15 ఏళ్లు. ఆ తర్వాత కావాలంటే వ్యవధిని ఐదేళ్లు పెంచుకోవచ్చు. కనుక దీర్ఘకాలిక అవసరాల కోసం తగిన ఎంపిక అవుతుంది. ఏడాదిలో కనీసం 500 ఇన్వెస్ట్ చేసినా సరిపోతుంది. గరిష్టంగా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల పెట్టుబడులకే పన్ను మినహాయింపు లభిస్తుంది. మొదటి ఇన్స్టాల్మెంట్ చెల్లించిన ఆర్థిక సంవత్సరం చివరి నుంచి 15 ఏళ్ల కాల వ్యవధి అమల్లోకి వస్తుంది. ఉదాహరణకు 2018 అక్టోబర్‌లో మొదటి వాయిదా కట్టారనుకోండి. అప్పుడు 2019 ఏప్రిల్ 1 నుంచి 2034 ఏప్రిల్1 వరకు కాల వ్యవధి అమలవుతుంది. మూడు నుంచి ఆరో ఏట వరకు రుణం తీసుకోవచ్చు. రుణం తీసుకోవడానికి రెండేళ్ల ముందు నాటికి ఉన్న బ్యాలన్స్‌లో 25 శాతాన్ని రుణంగా ఇస్తారు. తిరిగి మూడేళ్ల కాలంలో రుణాన్ని తీర్చివేయాలి. ఏడో ఏట నుంచి పాక్షిక ఉపసంహరణలకు అనుమతి ఉంటుంది. పీపీఎఫ్‌లో పెట్టుబడులు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ1.5 లక్షలపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంది. అలాగే, పెట్టుబడులపై వడ్డీ, చివర్లో ఉపసంహరణల మొత్తం మీదా పన్ను ఉండదు. దీంతో 30% పన్ను పరిధిలో ఉన్న వారికి వాస్తవంగా గిట్టుబాటయ్యే వడ్డీ 11.9 శాతంగా అంచనా వేసుకోవచ్చు. అధిక పన్ను శ్లాబుల్లోని వారికి పీపీఎఫ్ ఎంతో ఆకర్షణీయమైన సాధనం అవుతుంది. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) అన్ని రకాల డెట్ సాధనాల్లో అధిక రాబడులను ఇస్తున్న సాధనం ఇది. పదేళ్ల ప్రభుత్వ సెక్యూరిటీల ఈల్డ్స్ కంటే ఎక్కువగానే ఈపీఎఫ్ చందాలపై వడ్డీ రేటును నిర్ణయించడం జరుగుతోంది. ఇందులో పెట్టుబడులు, రాబడులకు ప్రభుత్వ హామీ ఉంటుంది. ఇటీవలే 2018–19 ఆర్థిక సంవత్సరానికి 8.65 శాతం వడ్డీ రేటును నిర్ణయించిన విషయం తెలిసిందే. ఉద్యోగి వేతనం (బేసిక్, డీఏ కలిపిన మొత్తం)లో 12 శాతాన్ని మినహాయించి ఈపీఎఫ్, ఈపీఎస్‌కు జమ చేయడం జరుగుతుంది. అలాగే, ఇంతే మొత్తాన్ని ఉద్యోగి తరఫున సంస్థ కూడా చెల్లిస్తుంది. పనిచేసే సంస్థను మారిపోయి, మరో ఉద్యోగంలో చేరినా ఈపీఎఫ్‌ను కొనసాగించుకోవచ్చు. దీనికి అదనంగా ఉద్యోగి తన బేసిక్, డీఏ మొత్తంలో 100 శాతాన్ని వీపీఎఫ్ (వాలెంటరీ ప్రావిడెంట్ ఫండ్) రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీనికి కూడా ఈపీఎఫ్ వడ్డీ రేటే అమలవుతుంది. పన్ను ప్రయోజనాలు ఈపీఎఫ్, వీపీఎఫ్‌కు సమానంగా వర్తిస్తాయి. పెట్టుబడులపై సెక్షన్ 80సీ కింద మినహాయింపులు పొందొచ్చు. రాబడులు, ఉపసంహరణలకూ పన్ను లేదు. -
ఒక పెట్టుబడి.. రెండు ప్రయోజనాలు
శివరామ్ ఉద్యోగంలో చేరిన కొత్తలో... పదేళ్ల క్రితం సంప్రదాయ జీవిత బీమా పాలసీ తీసుకున్నాడు. ఏటా ప్రీమియం రూపంలో రూ.40,000 వరకు చెల్లిస్తున్నాడు. ఇటీవల గృహ రుణం తీసుకోవడంతో... జీవిత బీమా పాలసీ ప్రీమియం చెల్లించడం కష్టంగా మారింది. శ్రీరామమూర్తి ఏడాది క్రితం ఎన్‌పీఎస్‌లో చేరాడు. సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ప్రయోజనంలో భాగంగా ఎన్‌పీఎస్‌లో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. దీనికి అదనంగా ఇన్వెస్ట్ చేయాలని ఉంది. కానీ, పన్ను మినహాయింపు ఉంటుందా? అన్నది సందేహం. పన్ను ఆదా సాధనాల విషయంలో వేతన జీవులకు పక్కా ప్రణాళిక ఉండాలి. శివరామ్ పన్ను ఆదా కోసం ఎండోమెంట్ పాలసీ తీసుకుని పొరపాటు చేశానని అనుకుంటున్నాడు. ఎందుకంటే కవరేజీ తక్కువ, రాబడులు కూడా స్వల్పమే. పైగా ప్రీమియం ఎక్కువ. దీనివల్ల ఇతర పెట్టుబడుల ప్రణాళిక దెబ్బతింటుంది. ఏటా మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరానికి పన్ను పడకుండా ఉండేందుకు ఎక్కువ మంది చివరి మూడు నెలల్లోనే పెట్టుబడుల గురించి ఆలోచిస్తుంటారు. ఆ తరహా వారికి అందుబాటులో ఉన్న పన్ను ఆదా సాధనాలు, వాటి∙ప్రయోజనాలు వివరించేదే ఈ కథనం. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) పథకాలు పన్ను ఆదా విభాగంలో మెరుగైన స్థానంలో ఉన్నాయి. ఈక్విటీ ఫండ్స్‌పై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆదాయ పన్ను ఆదా కోసం దీన్ని మెరుగైన సాధనంగానే చూడొచ్చన్నది నిపుణుల అభిప్రాయం. ఒక ఆర్థిక సంవత్సరంలో మూలధన లాభాల పన్ను రూ.లక్ష మించినప్పుడే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 2018లో స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులు ఉండగా... ఈ ఏడాది కూడా అలాంటి పరిస్థితులే ఉండొచ్చు. అయితే, దీర్ఘకాలం కోసం క్రమానుగతంగా ఇన్వెస్ట్ చేసే వారు వీటి గురించి ఆందోళన చెందనక్కర్లేదు. అయితే, మొదటిసారి ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తే అంతా ఒకేసారి ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయకుండా జనవరి నుంచి మార్చి వరకు మూడు సమాన వాయిదాల్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదని ఇన్వెస్ట్రోగ్రఫీ సీఈవో శ్వేతా జైన్ సూచించారు. ఫండ్స్ పేరు 3 ఏళ్ల రాబడులు మిరే అస్సెట్ ట్యాక్స్ సేవర్ 19.06 ఇన్వెస్కో ట్యాక్స్ ప్లాన్ 12.67 ఆదిత్య బిర్లా ట్యాక్స్ రిలీఫ్96 12.48 ప్రిన్సిపల్ ట్యాక్స్ సేవింగ్ 12.59 యాక్సిల్ లాంగ్‌టర్మ్ ఈక్విటీ 12.38 డీఎస్పీ ట్యాక్స్‌సేవర్ 12.13 ఎన్పీఎస్ జాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్)లో గత ఐదేళ్ల కాలంలో సగటు వార్షిక రాబడులు 10.84 శాతంగా ఉన్నాయి. రిటైర్మెంట్ సమయంలో వెనక్కి తీసుకునే 60 శాతం మొత్తంపైనా పన్నును రద్దు చేస్తూ ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం... ఈక్విటీల్లో యాక్టివ్ చాయిస్ కింద 75 శాతం వరకూ ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం కల్పిస్తూ పీఎఫ్ఆర్డీఏ తీసుకున్న నిర్ణయాలతో ఎన్పీఎస్ ఆకర్షణీయంగా మారిపోయింది. ఇప్పటి వరకు ఎన్‌పీఎస్‌లో 60 ఏళ్ల సమయంలో ఉపసంహరించుకునే 60 శాతంలో 20 శాతం పైన పన్ను చెల్లించాలన్న నిబంధన ఉంది. దీన్ని తొలగించడం పెద్ద ముందడుగుగా క్లియర్ ట్యాక్స్ సీఈవో అర్చిత్గుప్తా పేర్కొన్నారు. 70 ఏళ్ల వరకు ఇన్వెస్ట్ చేసుకునే అవకాశాన్ని కూడా పీఎఫ్ఆర్డీఏ కల్పించింది. వీటిల్లో ఫండ్స్ పనితీరును గమనిస్తే... ఈక్విటీలో 50 శాతం ఇన్వెస్ట్ చేసే విభాగం ఫండ్ మేనేజర్ ఏడాది రాబడి మూడేళ్లు రాబడి ఐదేళ్లు రాబడి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ పెన్షన్ 3.37 9.56 11.31 ఎస్బీఐ పెన్షన్ ఫండ్ 4.12 9.98 11.45 యూటీఐ రిటైర్మెంట్ సొల్యూషన్స్ 3.19 9.85 11.41 కోటక్ పెన్షన్ ఫండ్ 1.37 9.58 11.22 హెచ్డీఎఫ్సీ పెన్షన్ ఫండ్ 3.71 10.22 – పెన్షన్ ప్లాన్లు పెన్షన్ ప్లాన్లు కూడా సెక్షన్ 80సీ కింద పెట్టుబడి ప్రయోజనం అందించేవే. అయితే, ఎన్పీఎస్, యులిప్‌లతో పోలిస్తే ఇవి అంత ఆకర్షణీయం కావు. ప్రస్తుతం ఎన్‌పీఎస్‌లో సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షలకు అదనంగా రూ.50,000 ఇన్వెస్ట్‌మెంట్‌కు పన్ను మినహాయింపు ఉంది. పని చేస్తున్న కంపెనీ ఉద్యోగి పెన్షన్ కోటా కింద జమ చేస్తే అదనపు పన్ను మినహాయింపు కూడా ఉంది. కానీ బీమా కంపెనీలు అందించే పెన్షన్ ప్లాన్లకు ఈ ప్రయోజనాలు లేవు. కొత్త యులిప్ పాలసీల్లో చార్జీలు చాలా వరకు దిగొచ్చాయి. బీమా కంపెనీల పెన్షన్ ప్లాన్లలో మాత్రం చార్జీలు ఇప్పటికీ ఎక్కువగానే ఉన్నాయి. యులిప్‌ల మాదిరే బీమా పెన్షన్ ప్లాన్లలోనూ చార్జీల విషయమై పారదర్శకత తక్కువ. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ జాతీయ పొదుపు పత్రా ల్లో పెట్టుబడులకూ సెక్షన్ 80సీ పన్ను మినహాయింపు ఉంది. దీనిలో ప్రస్తుత వడ్డీ రేటు 8%. ఈక్విటీల గురించి అర్థం చేసుకునే ఓపిక, తీరిక లేని వారు, పెట్టుబడి పెట్టి నిశ్చితంగా ఉండాలనుకునే వారు దీన్ని పరిశీలించొచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే మెరుగైనది. దీనిలో వచ్చే వడ్డీ ఆదాయం తదుపరి ఆర్థిక సంవత్సరంలో సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపునకు వీలుంటుంది. ఉదాహరణకు 2019 జనవరిలో ఎన్ఎస్సీలో రూ.50,000 ఇన్వెస్ట్ చేశారనుకుంటే, 2020 జనవరి నాటికి రూ.4,000 వడ్డీ ఆదాయం లభిస్తుంది. దీంతో 2019–20 ఆర్థిక సంవత్సరంలో దీనిపై మినహాయింపు పొందొచ్చు. 60 ఏళ్లు దాటిన వారికీ ఇది అనువైనదే. బ్యాంకుల్లో వీటిని పొందొచ్చు. బ్యాంకు ఎఫ్డీలు బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లపై (ఎఫ్డీలు) వడ్డీ 7.5–8.25% మధ్య ఉంది. సెక్షన్ 80 సీ పన్ను ఆదా కోసమయితే, ఐదేళ్ల ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీ చేయాల్సి ఉంటుంది. ఐదేళ్ల పాటు తిరిగి ఈ డిపాజిట్‌ను రద్దు చేసుకోవడానికి ఉండదు. నెట్ బ్యాంకింగ్ ఉన్న వారు ఆన్లైన్లోనే కొన్ని క్లిక్‌లతో ఈ డిపాజిట్ చేసుకోవచ్చు. డిపాజిట్‌పై వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుందని మర్చిపోవద్దు. ఏ బ్యాంకులో ఎంత వడ్డీ ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీ వడ్డీ రేటు ఐడీఎఫ్సీ బ్యాంకు 8.25 ఏయూస్మాల్ ఫైనాన్స్ 8.00 లక్ష్మీ విలాస్ బ్యాంకు 7.75 డీసీబీ బ్యాంకు 7.75 ఆర్బీఎల్ బ్యాంకు 7.60 బీమా పాలసీలు ఆర్జించే వ్యక్తికి మరణ ప్రమాదం ఎదురైతే, అతడు లేదా అతనిపై ఆధారపడిన వారికి ఆర్థిక ఇక్కట్లు ఎదురవుతాయి. అందుకే తమపై ఆధారపడిన వారి సంక్షేమానికి ప్రతి ఒక్కరూ బీమా పాలసీ తీసుకోవాలి. కానీ, అది టర్మ్ ప్లాన్ రూపంలో ఉంటే మంచిది. సంప్రదాయ ఎండోమెంట్ పాలసీలు ఓ వ్యక్తి కుటుంబానికి సరిపడా బీమా రక్షణ అందించలేవు. ఎందుకంటే వార్షికంగా రూ.5 లక్షల ఆదాయం కలిగిన 30 ఏళ్ల వ్యక్తికి వార్షికంగా కనీసం రూ.40–50 లక్షల కవరేజీ అవసరం. ఎండోమెంట్ పాలసీ అయితే ఇంత కవరేజీ కోసం రూ.ఏడాదికి రూ.4–5 లక్షల ప్రీమియం చెల్లించాలి. కానీ రూ.5,000లోపు ప్రీమియంతోనే 30 ఏళ్ల ఆరోగ్యవంతుడైన వ్యక్తి రూ.50 లక్షల టర్మ్ పాలసీని పొందొచ్చు. టర్మ్ ప్లాన్‌కు చెల్లించే ప్రీమియానికి కూడా సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనం లభిస్తుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్...(పీపీఎఫ్) 2019 జనవరి–మార్చి నెలకు వడ్డీ 8 శాతంగా ఉంది. వడ్డీ రేట్లు ఇటీవలి కాలంలో కాస్త తగ్గినప్పటికీ... పీపీఎఫ్ సాధనం ఇప్పటికీ మంచి సాధనంగా ఆర్థిక సలహాదారుల అభిప్రాయం. రాబడి పూర్తిగా పన్ను రహితం. దీంతో ఫిక్స్డ్ డిపాజిట్లతో పోలిస్తే మెరుగైన సాధనం అవుతుంది. ఎందుకంటే ఎఫ్డీలపై వచ్చే వడ్డీ ఆదాయం పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుందని తెలిసిందే. అయితే, ఇప్పటికే ప్రావిడెండ్ ఫండ్‌కు కొంత కేటాయించే వారు పన్ను ఆదా కోసం మరింతగా అదే బాస్కెట్లో ఇన్వెస్ట్ చేయడం వివేకం అనిపించుకోదు. దీనికి బదులు ఇక్కడి ప్రత్యామ్నాయ సాధనాల్లో మీకు అనువైనది ఎంచుకోవచ్చు. పీపీఎఫ్ పథకంలో పెట్టుబడులు, రాబడులకు హామీదారు కేంద్ర ప్రభుత్వం. కాబట్టి పూర్తి భద్రత ఉంటుంది. ఏ పోస్టాఫీసు శాఖ లేదా బ్యాంకు శాఖలో అయినా పీపీఎఫ్ ప్రారంభించుకోవచ్చు. ఆన్లైన్ సదుపాయం కలిగిన బ్యాంకులో ఎంచుకుంటే సౌలభ్యంగా ఉంటుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ వడ్డీ రేటు ప్రస్తుతం 8.7 శాతంగా ఉంది. 60 ఏళ్లు పైబడిన వారికి పన్ను ఆదా సాధనంగా ఇది ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుత్వం వృద్ధులకు వార్షికంగా రూ.50,000 వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు కల్పిస్తూ గతేడాది నిర్ణయం తీసుకుంది. దీంతో సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీం మరింత ఆకర్షణీయత సంతరించుకుంది. దీంతో 60 ఏళ్లు దాటిన వారికి వార్షికంగా రూ.3.5 లక్షలకు పన్ను లేనట్టు అవుతుంది. 80 ఏళ్లు దాటిన వారికి రూ.5.5 లక్షలకు పన్ను ఉండదు. చిన్న మొత్తాల పొదుపు పథకాలు అన్నింటిలోకీ అధిక వడ్డీ రేటు ఉన్నది ఈ పథకంలోనే. ఈ పథకం కాల వ్యవధి ఐదేళ్లు. ఆ తర్వాత మూడేళ్లు పొడిగించుకోవచ్చు. ఒకరు గరిష్టంగా రూ.15 లక్షల వరకే ఇన్వెస్ట్ చేసుకోగలరు. స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని, మరో ఉద్యోగంలో చేరని వారు 58 ఏళ్లకే ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకునేందుకు అవకాశం ఉంది. సుకన్య సమృద్ధి యోజన కుమార్తెల పేరిట పొదుపు చేసుకుని పన్ను ఆదా పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇందులో ప్రస్తుత వడ్డీ రేటు 8.5 శాతం. వడ్డీ రేటును ప్రభుత్వ బాండ్ ఈల్డ్‌తో ముడిపెట్టినందున ప్రతీ క్వార్టర్‌కు మారుతుంటుంది. పీపీఎఫ్ పథకంలో కంటే అధిక వడ్డీ రేటు ఇందులో లభిస్తోంది. పీపీఎఫ్‌లో మాదిరే గరిష్ట పెట్టుబడి పరిమితి రూ.1.5 లక్షల వరకు ఉంది. పెట్టుబడి, రాబడి, ఉపసంహరణపైనా పన్ను మినహాయింపు లభిస్తుంది. కనీసం రూ.250 పెట్టుబడితో పోస్టాఫీసు లేదా ఎంపిక చేసిన బ్యాంకుల్లో దీన్ని ఆరంభించొచ్చు. తల్లిదండ్రులు తమ ఇద్దరు కుమార్తెల పేరిటే పెట్టుబడికి అవకాశం ఉంటుంది. ఇద్దరు కుమార్తెల పేరిట రెండు ఖాతాలు ప్రారంభించిన వారు రెండింటిలోనూ కలిపి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకే ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. పిల్లల వివాహాలు, ఉన్నత విద్య అవసరాలకు ఉపయోగపడే పథకం. యులిప్‌లు యూనిట్ లింక్డ్ బీమా పథకాలను ‘యులిప్’లుగా పిలుస్తారు. ఈక్విటీల్లో పెట్టుబడులపై దీర్ఘకాలంలో లాభాలు గడించే వారు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే, యులిప్‌లు బీమాతో కూడిన పెట్టుబడి పథకాలు కావడంతో వీటికి మినహాయింపు ఉంది. యులిప్‌ల్లో కేవలం ఈక్విటీలే కాకుండా డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. యులిప్ పాలసీల్లో ఈక్విటీ నుంచి డెట్ ఫండ్స్‌కు మారినా పన్ను వర్తించదు. ఫండ్స్‌లో మాదిరిగా కాకుండా, యులిప్ పాలసీల్లో డెట్ అయినా ఈక్విటీ ఫండ్స్‌లో అయినా ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా ఆర్జించే మొత్తంపైనా పన్ను ఉండదు. కాగా ఐదేళ్ల పాటు లాకిన్. గడువు లోపు ముందుగానే తప్పుకుంటే సరెండ్ చార్జీల వంటివి ఉంటాయి. యులిప్ల్లోనే చైల్డ్ ప్లాన్లు కూడా ఉన్నాయి. పిల్లల పేరిట తీసుకుంటే, పాలసీ గడువు లోపు సంరక్షణ చూసే తల్లి లేదా తండ్రి అకాల మరణం చెందితే, పిల్లల పేరిట పెట్టుబడి ఆగకుండా కొనసాగుతుంది. -
కనీస పెన్షన్ రూ.1000
న్యూఢిల్లీ: అర్హులైన పెన్షన్‌దారులకు నెలవారీ కనీస పెన్షన్‌గా రూ.1,000 ఇవ్వాలని ఉద్యోగ భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) నిర్ణయించింది. ఈపీఎఫ్ఓలోని అత్యున్నత నిర్ణయ విభాగమైన ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్(సీబీటీ)’ బుధవారం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ ఆమోదించాల్సి ఉంది. అనంతరం సీబీటీ భేటీకి అధ్యక్షత వహించిన కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ కింది వివరాలను వెల్లడించారు. ఉద్యోగస్తుల పెన్షన్ పథకం(ఈపీఎస్-95) కింద కనీసం రూ. 1000 పెన్షన్‌గా ఇవ్వడం ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీనివల్ల 5 లక్షల మంది భర్తను కోల్పోయిన మహిళలు సహా దాదాపు 28 లక్షల పెన్షన్‌దారులు తక్షణం లబ్ధి పొందుతారు. ఈపీఎస్ కింద ఉన్న మొత్తం పెన్షన్‌దారుల సంఖ్య 44 లక్షలు. ఇందుకోసం ప్రభుత్వం రూ.1,217 కోట్లను అదనంగా సమకూర్చాల్సి ఉంది. ఈపీఎఫ్ఓ చందాదారులు.. వయస్సు 58 ఏళ్లు దాటగానే పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. పెన్షన్‌కు అర్హమైన వేతనాన్ని గణించే పద్ధతిని కూడా మార్చారు. గతంలో 12 నెలల సగటు వేతనం ఆధారంగా గణించగా, ఇకనుంచి 60 నెలల సగటు వేతనం ఆధారంగా లెక్కిస్తారు. ఉద్యోగ భవిష్య నిధి(ఈపీఎఫ్) పథకం కింద వేతన పరిమితినిరూ.6,500(మూలవేతనం, డీఏ కలిపి) నుంచి రూ.15 వేలకు పెంచాలని కూడా సీబీటీ నిర్ణయించింది. దీంతో మరో 50 లక్షల మంది ఈపీఎఫ్ఓ సామాజిక భద్రత పథకాల్లో చేరేందుకు అర్హులవుతారు. దీన్ని సీబీటీలోని కార్మిక సంఘాల ప్రతినిధులు వ్యతిరేకించారు. డీఏతో కూడిన మూల వేతనంపై 1.1 శాతం ఉన్న అడ్మినిస్ట్రేటివ్ చార్జీలను 0.85కి తగ్గించా రు. ఈ చార్జీలను యాజమాన్యం చెల్లించాలి. కేంద్రం నిధులను సమకూర్చాల్సి ఉన్నందున కార్మిక మంత్రిత్వ శాఖ త్వరలో ఈ ప్రతిపాదనను కేబినెట్ ముందు ఉంచుతారని ఈపీఎఫ్ఓ అధికారులు తెలిపారు. -
పెన్షనర్లకు 27 శాతం ఐఆర్... జీవో జారీ
సాక్షి, హైదరాబాద్: ఇటీవలే ఉద్యోగులకు మధ్యంతర భృతి (ఐఆర్) మంజూరు చేసిన ప్రభుత్వం, తాజాగా పెన్షనర్లకు 27 శాతం ఐఆర్ మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పెన్షనర్లకు కూడా ఈ ఏడాది జనవరి 1 నుంచి తాజా ఐఆర్ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అయితే, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు, విశ్వవిద్యాలయాల్లోని బోధనేతర సిబ్బందికి ఐఆర్ వర్తించదంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పీఎస్‌యూ ఉద్యోగులకు ఐఆర్ వర్తించదంటూ ఉత్తర్వులు ఇవ్వడంపై ‘సాక్షి’ కథనానికి స్పందించిన ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, జీవోను సవరించేందుకు వీలుగా ఐఆర్ ఫైల్‌ను సర్క్యులేట్ చేయాలని అధికారులను ఆదేశించారు. -
అవార్డీలకు పెన్షన్ సౌకర్యం! లోక్‌సభలో సుష్మా డిమాండ్
న్యూఢిల్లీ: తమ క్రీడా విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ప్రభుత్వ అవార్డులను గెలుచుకున్న ఆటగాళ్లకు శుభవార్త. త్వరలోనే వీరికి పెన్షన్ సౌలభ్యం కల్పించనున్నారు. దివంగత మాజీ అథ్లెట్ మఖన్ సింగ్ కుటుంబం దుర్భర పరిస్థితి గురించి శనివారం లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ వివరించారు. పూట గడవడం కోసం మఖన్ సింగ్ భార్య తన భర్త పతకాలను అమ్మకానికి పెట్టిన వైనంపై ఆమె సభకు తెలిపారు. సుష్మా వాదనకు ప్రభుత్వం నుంచి సమాధానం కావాలని సహచర ఎంపీ హరేన్ పాథక్ కోరగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్ నాథ్ మాట్లాడారు. ఈ విషయంలో ప్రభుత్వం ఓ పాలసీని రూపొందించేందుకు చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. అలాగే మఖన్ సింగ్ కుటుంబాన్ని ఆదుకునేందుకు ఆయిల్ పీఎస్‌యూల క్రీడా సమాఖ్య నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు ద్వారా మఖన్ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు.