న్యూఢిల్లీ: తమ క్రీడా విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ప్రభుత్వ అవార్డులను గెలుచుకున్న ఆటగాళ్లకు శుభవార్త. త్వరలోనే వీరికి పెన్షన్ సౌలభ్యం కల్పించనున్నారు. దివంగత మాజీ అథ్లెట్ మఖన్ సింగ్ కుటుంబం దుర్భర పరిస్థితి గురించి శనివారం లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ వివరించారు. పూట గడవడం కోసం మఖన్ సింగ్ భార్య తన భర్త పతకాలను అమ్మకానికి పెట్టిన వైనంపై ఆమె సభకు తెలిపారు. సుష్మా వాదనకు ప్రభుత్వం నుంచి సమాధానం కావాలని సహచర ఎంపీ హరేన్ పాథక్ కోరగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్ నాథ్ మాట్లాడారు. ఈ విషయంలో ప్రభుత్వం ఓ పాలసీని రూపొందించేందుకు చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. అలాగే మఖన్ సింగ్ కుటుంబాన్ని ఆదుకునేందుకు ఆయిల్ పీఎస్‌యూల క్రీడా సమాఖ్య నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు ద్వారా మఖన్ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు.