సత్తెనపల్లి: గల్లీ, గ్రామీణ క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం జగనన్న స్పోర్ట్స్ క్లబ్ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. దీనికోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. దీనిని క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 19న పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ ఆవిష్కరించారు. ఈ నెల 31వ తేదీ వరకు యాప్‌లో క్రీడాకారుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపట్టనున్నారు. పల్నాడు జిల్లాలో 28 మండలాలు, 366 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లోని పాఠశాలల్లో ఇప్పటికే క్రీడాపోటీలు నిర్వహించి ప్రతిభావంతులను ఎంపిక చేస్తున్నారు. దీంతో ఎంతోమంది మెరికల్లా తయారవుతున్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించేందుకు జగనన్న స్పోర్ట్స్ క్లబ్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. దీనిలో వెటరన్ క్రీడాకారులనూ భాగస్వాములను చేసేందుకు చర్యలు చేపడుతోంది.
ఇదీ ప్రణాళిక
జగనన్న స్పోర్ట్స్ క్లబ్‌ల ఏర్పాటుకు రెండు నెలల క్రితమే ఉత్తర్వులొచ్చాయి. అప్పటి నుంచి పూర్తి మార్గదర్గకాలు రూపొందించేందుకు వివిధ రంగాల్లో నిపుణులైన క్రీడాకారుల సలహాలు, సూచనలు తీసుకున్నారు. తాజాగా దీనిపై ఒక ప్రణాళిక రూపొందించారు. గ్రామ/వార్డు సచివాలయాల నుంచే క్రీడాకారుల ఎంపిక, తర్ఫీదు, పోటీల నిర్వహణ చేపట్టనున్నారు. క్షేత్ర స్థాయిలో గ్రామ పంచాయతీ, కార్పొరేషన్, మున్సిపాలిటీల్లోని సచివాలయ అడ్మిన్లకు ఈ బాధ్యతలు అప్పగించారు.
గ్రామస్థాయి నుంచి ప్రత్యేక కమిటీలు
స్పోర్ట్స్ క్లబ్‌ల నిర్వహణకు గ్రామస్థాయి నుంచి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. పంచాయతీ పరిధిలో క్రీడాప్రాధికార సంస్థ కమిటీ చైర్మన్‌గా సర్పంచ్ వ్యవహరిస్తారు. క్రీడలను ప్రోత్సహించే దాతలనూ ఇందులో భాగస్వాములను చేయనున్నారు. రూ.50 వేలు, ఆపైన విరాళంగా అందించే దాతలు, అదే గ్రామం నుంచి జిల్లా, రాష్ట్ర, జాతీయ జట్లకు ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు, పీఈటీలు సభ్యులుగా వ్యవహరిస్తారు. మండల స్థాయిలో మండల పరిషత్ చైర్మన్ ఎక్స్ అఫీషియో సభ్యుడిగా, తహసీల్దార్, ఎంఈవో, మండల ఇంజినీర్, ఎంపీడీవో, ఎస్సై, క్రీడాకారుడు, క్రీడాకారిణి, దాత.. ఇలా 11 మంది సభ్యులుగా ఉంటారు.
స్పోర్ట్స్ క్లబ్‌లో రిజిస్ట్రేషన్ ఇలా
► మొదటగా గూగుల్ ప్లే స్టోర్లో జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి.
► డౌన్లోడ్ అయిన తర్వాత పేరు, మొబైల్ నంబర్ తో రిజిస్ట్రేషన్ చేయాలి. మొబైల్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
► రిజిస్టర్ అయిన తర్వాత గ్రామం, సచివాల యం, పాఠశాల వివరాలు నమోదు చేయాలి.
► ఏ క్రీడపై ఆసక్తి ఉంటే దానిపై టచ్ చేసి రిజిస్టర్ కావాలి.
► అప్పటి నుంచి జగనన్న స్పోర్ట్స్ క్లబ్‌లలో సభ్యులుగా మారుతారు. ఆ తర్వాత నోటిఫికేషన్ల రూపంలో క్రీడల వివరాలు అందుతాయి.
పల్లె మట్టి వాసనల్లో మరుగున పడిన క్రీడా ఆణిముత్యాలు ఇకపై అంతర్జాతీయ వేదికపై మెరిసేందుకు బాటలు పడ్డాయి. మారుమూల వీధుల్లో ఖోఖో అంటూ కూత పెట్టే యువతరం ఇక ఉన్నత స్థాయిలో మోత మోగించనుంది. మెరికల్లాంటి ఆటగాళ్లలో ప్రతిభను వెలికి తీస్తూ కబడ్డీ తొడగొట్టనుంది. సీనియర్ సిటిజన్స్ నుంచి చిన్నారి బుడతల వరకు ప్రతి ఒక్కరినీ ఆటలో అందలమెక్కిస్తూ శారీరక దారుఢ్యం పెంచుతూ క్రీడా రంగానికి ఉజ్వల భవిష్యత్ తీసుకొచ్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్కా ప్రణాళిక రూపొందించింది. జగనన్న స్పోర్ట్స్ క్లబ్‌ల ద్వారా క్రీడాకారుల తర్ఫీదు, పోటీల నిర్వహణకు సమగ్ర విధివిధానాలు రూపొందించింది.
పోటీల నిర్వహణ ఇలా..
► పంచాయతీ కార్మదర్శులు, సచివాలయ అడ్మిన్ ప్రతి నెలా స్పోర్ట్స్ క్లబ్ సమావేశం నిర్వహిస్తారు. తొలుత వీఆర్వో, సర్వేయర్ల ద్వారా ఆట స్థలాన్ని గుర్తిస్తారు. క్రీడాకారులను
ఇందులో భాగస్వాములను చేస్తారు. ఒక్కో క్రీడాంశానికి ఒక్కో క్లబ్‌ను ఏర్పాటు చేస్తారు.
► వెటరన్స్ కోసం జగనన్న వాకింగ్ క్లబ్‌లు రూపొందించారు. మహిళలకు స్కిప్పింగ్, టెన్నికాయిట్, త్రోబాల్ తదితర ఆటలు నిర్వహిస్తారు.
► సామాజిక భవనాలు, పంచాయతీ హాళ్లలో వసతులు గుర్తించి చెస్, క్యారమ్స్, ఉచిత యోగా శిక్షణ ఏర్పాటు చేస్తారు.
► క్రీడా స్థలాలు లేకపోతే వీధుల్లోనే దీనికి అనువైన ప్రదేశాలను గుర్తించి కబడ్డీ, వాలీబాల్, రబ్బర్ బాల్‌తో క్రికెట్ వంటి అనువైన ఆటలు ఆడిస్తారు. ఎన్‌ఆర్‌ఐలు, వ్యాపారులు, ఉద్యోగుల నుంచి క్రీడా సామగ్రి సమకూరుస్తారు.
► మండల క్రీడాప్రాధికార సంస్థ సభ్యులు దేశీయ క్రీడలను ప్రోత్సహించడం, ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్, క్రీడా మైదానాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి జిల్లా క్రీడా ప్రాధికార సంస్థకు అందజేస్తారు. టోర్నమెంట్లు, మ్యాచులు, స్పోర్ట్స్ ఈవెంట్లు నిర్వహించి స్పోర్ట్స్ అథారిటీకి ఆదాయాన్ని పెంచుతారు.
► ప్రతి మూడు నెలలకోసారి మండల, నియోజకవర్గ స్థాయి పోటీలు నిర్వహిస్తారు. మండల, జిల్లా పరిషత్‌ల ఆదాయం నుంచి నాలుగు శాతాన్ని క్రీడలకు వెచ్చిస్తారు.
మంచి వేదిక
క్రీడలపై ఆసక్తి ఉన్నవారికి స్పోర్ట్స్ క్లబ్ మంచి వేదిక. జగనన్న స్పోర్ట్స్ క్లబ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జిల్లాలో ప్రారంభమైంది. యువత తమకు ఏ క్రీడలో ఆసక్తి ఉందో యాప్‌లో నమోదు చేసుకోవాలి. క్రీడలు, వ్యాయామం, వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. అందుకే ప్రభుత్వం ప్రత్యేకంగా జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్‌ను రూపొందించింది.
– ఎ.మహేష్ బాబు చీఫ్ కోచ్, జిల్లా క్రీడాప్రాధికార సంస్థ, పల్నాడు
Comments
Please login to add a commentAdd a comment