కిరణ్ బండారం బయటపెడతా: ఆనం
హైదరాబాద్: రాష్ట్రపతి పాలనపై కేంద్ర కేబినేట్ నిర్ణయాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వాగతించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజార్టీ ఉన్నప్పటికీ ఎన్నికల షెడ్యూల్ వెలువడుతున్నందున కొత్త ప్రభుత్వం ఏర్పాటైనా ప్రయోజనం లేదని అభిప్రాయపడ్డారు. సీమాంధ్ర, తెలంగాణకు త్వరలో రెండు పీసీసీలు ఏర్పడతాయని తెలిపారు.
ఎన్నికల ముందు రాజకీయ వలసలు సహజమే అన్నారు. అధికారమే పరమావధిగా భావించే అవకాశవాద నేతలు, వెన్నుపోటు దారులే పార్టీని వీడారని దుయ్యబట్టారు. కొత్త పార్టీ పెట్టాక కిరణ్ బండారాలన్నీ బయటపెడతామని ఆనం హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రానికా, రెండు రాష్ట్రాలకా అనేది రాష్ట్రపతి, ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుందన్నారు.