* నేడు సీఎం ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి భేటీ
* 30% అయినా ఇవ్వాలని కోరుతున్న ఉద్యోగ సంఘాలు
* గతంలో 22% ఐఆర్ ఇచ్చిన వైఎస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురు చూస్తున్న మధ్యంతర భృతిపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శనివారం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి కార్యాలయం ఆర్థిక మంత్రితో పాటు ఉన్నతాధికారులను, ఉద్యోగ సంఘాల నేతలను శనివారం అందుబాటులో ఉండాల్సిందిగా కోరింది. పదవ వేతన సవరణ కమిషన్ నివేదిక వచ్చే ఏడాది గానీ ప్రభుత్వానికి అందే అవకాశం లేదు. దీంతో ఉద్యోగ సంఘాల నేతలు గత కొంత కాలంగా మధ్యంతర భృతి (ఐఆర్)ని మంజూరు చేయాల్సిందిగా కోరుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి శనివారం ఉదయం ఆర్థిక శాఖ మంత్రి, సంబంధిత ఉన్నతాధికారులతో సమావేశమై కసరత్తు చేయనున్నారు. సాయంత్రం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతోకూడా సమావేశం ఉంటుందని సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. అన్ని రకాల నిత్యావసర సరుకుల ధరలు బాగా పెరిగిపోయినందున మధ్యంతర భృతిని 40 నుంచి 50 శాతం వరకు ఇవ్వాలంటూ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే ఆర్థిక శాఖ అధికారులు 17 శాతం వరకు ప్రతిపాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాల ప్రతినిధుల భేటీ సమయంలో 20 నుంచి 25 శాతం వరకు మధ్యంతర భృతి మంజూరుపై చర్చలు జరిగే అవకాశం ఉందని ఉన్నతాధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2003లో ఉద్యోగులకు 8.5 శాతమే ఐఆర్ మంజూరు చేశారు. ఆ తరువాత ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన వైఎస్ ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ను 16 శాతం వరకు ఇచ్చారు. అలాగే ఆయన తొమ్మిదవ వేతన సవరణ కమిషన్‌ను నియమించారు. కమిషన్ నివేదిక రాకముందే ఉద్యోగ సంఘాల కోరిక మేరకు ఐఆర్‌ను ఏకంగా 22 శాతం మేర మంజూరు చేశారు. ఆ విషయాన్ని ఇప్పుడు చర్చల సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు ప్రస్తావించనున్నారు.
ప్రస్తుతం 30 శాతం మేర అయినా మంజూరు చేయాలనేది ఉద్యోగ సంఘాల వాదనగా ఉంది. అంతిమంగా 22 నుంచి 25 శాతం మధ్యలో ముఖ్యమంత్రి ఐఆర్ మంజూరు చేస్తారని అధికార వర్గాలు భావిస్తున్నాయి. తొమ్మిదవ వేతన సవరణ కమిషన్ గడువు ఈ ఏడాది జూన్ నెలాఖరుతో ముగిసింది. పదో కమిషన్ సవరణ వేతనాలు జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రావాల్సి ఉన్నందున అప్పటి నుంచే మధ్యంతర భృతిని మంజూరు చేయాల్సిందిగా ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు.
22-25 శాతం మధ్యంతర భృతి!
Published Sat, Dec 28 2013 1:16 AM | Last Updated on Sat, Jun 2 2018 2:36 PM
Advertisement