27శాతం ఐఆర్ చెల్లించేందుకు ఎండీ అంగీకారం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు మధ్యంతర భృతి చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించడంతో బుధవారం ఉదయం నుంచి నిర్వహించతలపెట్టిన సమ్మె యోచనను విరమించుకుంటున్నట్లు గుర్తింపు కార్మిక సంఘాలు ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్‌లు మంగళవారం రాత్రి ప్రకటించాయి. ఈ నెల జీతంతో పాటే మధ్యంతర భృతిని కలిపి చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించింది. అదేవిధంగా ఇప్పటివరకు బకాయిపడిన ఐఆర్‌ను సప్లిమెంటరీ బిల్లు ద్వారా ఏప్రిల్ 15వ తేదీ నాటికి అందజేయనున్నట్లు ఆర్టీసీ ఎండీ పూర్ణచందర్‌రావు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో కార్మిక సంఘాలు సమ్మె యోచనను విరమించుకున్నాయి. అంతకుముందు మంగళవారం మధ్యాహ్నం కార్మికశాఖ అదనపు కమిషనర్ మురళీసాగర్ ఆర్టీసీ అధికారులను, కార్మిక సంఘాల నాయకులను చర్చలకు ఆహ్వానించారు. 2 గంటలపాటు చర్చలు జరిగాయి. ప్రభుత్వం గ్రాంటు అందజేయడంలో జాప్యం కారణంగానే మధ్యంతర భృతిని చెల్లించలేకపోతున్నట్లు ఆర్టీసీ ఎండీ చెప్పారు. దాంతోసమ్మెకు వెళ్లనున్నట్లు కార్మిక సంఘాల నాయకులు ప్రకటించారు. బుధవారం నుంచి ఇంటర్ పరీక్షలు ఉన్న దృష్ట్యా సమ్మె యోచనను విరమింపజేయాలనే ఉద్దేశంతో ఆర్టీసీ ఎండీ ప్రభుత్వ ఉన్నతాధికారులను సంప్రదించారు.
అనంతరం మరోసారి కార్మిక నాయకులను చర్చలకు పిలిచారు. రాత్రి 10.30 గంటల వరకు చర్చలు జరిగాయి. ప్రభుత్వ ఉద్యోగులు కోరిన వెంటనే 27 శాతం మధ్యంతర భృతిని చెల్లించిన ప్రభుత్వం తమ విషయంలో వివక్ష ప్రదర్శించడం తగదని కార్మిక నాయకులు అన్నారు. దిగొచ్చిన యాజమాన్యం మధ్యంతర భృతిని ఈ నెల జీతంతోనే చెల్లించేందుకు అంగీకరించింది. ఈ మేరకు ఎండీ పూర్ణచందర్‌రావు లిఖితపూర్వక హామీ ఇచ్చారు. దీంతో సంతృప్తి చెందిన ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పద్మాకర్, టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వథ్ధామరెడ్డి, దామోదర్‌లు సమ్మె యోచనను విరమిస్తున్నట్లు ప్రకటించారు.
ఆర్టీసీ సమ్మె యోచన విరమణ
Published Wed, Mar 12 2014 3:45 AM | Last Updated on Sat, Sep 2 2017 4:35 AM
Advertisement