ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త ఒరవడిని సృష్టించారు
హైదరాబాద్: ఏ పీఆర్సీలో లేని విధంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కొత్త ఒరవడి సృష్టించారని తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల(టీఎన్‌జీవో) సంఘం రాష్ట్ర అధ్యక్షులు దేవీప్రసాద్, పార్లమెంటరీ సెక్రటరీ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. పీఆర్సీ ప్రకటనపై వారు హర్షం వ్యక్తంచేశారు. సచివాలయంలో గురవారం వారు విలేకరులతో మాట్లాడారు. ఇది రాష్ట్ర తొలి పీఆర్సీ అన్నారు. గతంలోని అన్ని పీఆర్సీల్లో అన్యాయాలు జరిగాయన్నారు. ఈ పీఆర్సీలో న్యాయం చేయాలని కేసీఆర్‌ను అడిగామని.. అందుకు తగ్గట్లుగానే ప్రకటించడం సంతోషదాయకమన్నారు.
కేసీఆర్ వాగ్దానంలో ఇది తొలి మెట్టన్నారు. 43 శాతం ఇస్తామని ప్రకటించడం హర్షదాయకమన్నారు. తెలంగాణ ఏర్పడిన జూన్ రెండు నుంచి ఫిబ్రవరి చివరి వరకు ఏరియర్స్ ఇచ్చేందుకు అంగీకరించారన్నారు. పీఆర్సీ ప్రకటనతో తమపై బాధ్యత పెరిగిందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేసేందుకు ఉద్యోగులంతా కష్టపడి పనిచేయాలని వారు పిలుపునిచ్చారు. అవసరమైతే గంట కాదు మరో గంట కూడా అదనంగా పనిచేయాలని కోరారు. ఆరోగ్యశ్రీకి కూడా ప్రీమియం చెల్లించవద్దని ప్రభుత్వం నిర్ణయిం చడం సంతోషకరమన్నారు. రేచల్, మమత, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పోలీసు అధికారుల సంఘం హర్షం
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ 43 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించడంపై రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం హర్షం వ్యక్తం చేస్తూ ఆ సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.