Parliamentary democracy
-
దేశ ప్రజాస్వామ్యానికి విఘాతం: ఆప్
న్యూఢిల్లీ: జమిలి ఎన్నికల విధానం దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విఘాతం కలిగిస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన ఆప్ ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక విధానం దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగ మౌలిక స్వరూపం, సమాఖ్య విధానాలను దెబ్బతీస్తుంది. పార్లమెంట్, శాసనసభల్లో హంగ్ ఏర్పడిన సందర్భాల్లో ఈ విధానంలో పరిష్కారం లేదు. పైపెచ్చు పార్టీ ఫిరాయింపులను, ఎమ్మెల్యేలు, ఎంపీలను బహిరంగంగానే కొనుగోలు చేసేందుకు దారులు చూపుతుంది. జమిలి ఎన్నికల నిర్వహణతో ఆదా అయ్యే ప్రజాధనం కేంద్ర వార్షిక బడ్జెట్లో కేవలం 0.1 శాతం మాత్రమే. సంకుచిత ఆర్థిక లాభాలు, పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాంగం, ప్రజాస్వామ్య సిద్ధాంతాలను త్యాగం చేయజాలం’అని ఆప్ పేర్కొంది. -
ఏమిటీ తీర్మానం...?
ఒక్కోసారి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రభుత్వ మే లోక్‌సభలో తన బలాన్ని నిరూపించుకునేందుకు ప్రవేశపెట్టేదే విశ్వాస తీర్మానం. ఇలా విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి మూడు ప్రభుత్వా లు బలం నిరూపించుకోలేక పడిపోయాయి... పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వమైనా అది ప్రత్యక్షంగా ఎన్నికయ్యే చట్టసభలో (భారత్‌లో అయితే లోక్‌సభ) మెజారిటీ ఉన్నంత కాలమే మనుగడ సాగించగలదు. కేంద్ర మంత్రిమండలి లోక్‌సభకు ఉమ్మడిగా బాధ్యత వహిస్తుందని రాజ్యాంగంలో 75(3) ఆర్టీకల్ నిర్దేశిస్తోంది. ఏమిటీ అవిశ్వాస తీర్మానం? ► ప్రభుత్వం, అంటే మంత్రిమండలి లోక్‌సభ విశ్వాసం కోల్పోయిందని, మరోలా చెప్పాలంటే మెజారిటీ కోల్పోయిందని భావించినప్పుడు బలం నిరూపించుకోవాలని ఎవరైనా డిమాండ్ చేసేందుకు అవకాశముంది. ► సాధారణంగా విపక్షాలే ఈ పని చేస్తుంటాయి. ఇందుకోసం అవి లోక్‌సభలో ప్రవేశపెట్టే తీర్మానమే అవిశ్వాస తీర్మానం. ► అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభలో మాత్రమే ప్రవేశపెట్టే వీలుంది. ► లోక్‌సభ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్, కండక్ట్ ఆఫ్ బిజినెస్లోని 198వ నిబంధన మేరకు దీన్ని ప్రవేశపెడతారు. ► కనీసం 50 మంది సహచర ఎంపీల మద్దతు కూడగట్టగలిగిన ఏ లోక్‌సభ సభ్యుడైనా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చు. ► అనంతరం తీర్మానంపై చర్చ, అధికార–విపక్షాల మధ్య సంవాదం జరుగుతాయి. ప్రభుత్వ లోపాలు, తప్పిదాలు తదితరాలను విపక్షాలు ఎత్తిచూపుతాయి. వాటిని ఖండిస్తూ అధికార పక్షం తమ వాదన విని్పస్తుంది. ► చర్చ అనంతరం అంతిమంగా తీర్మానంపై ఓటింగ్ జరుగుతుంది. ► లోక్‌సభకు హాజరైన ఎంపీల్లో మెజారిటీ, అంటే సగం మంది కంటే ఎక్కువ తీర్మానానికి మద్దతుగా ఓటేస్తే అది నెగ్గినట్టు. అంటే ప్రభుత్వం సభ విశ్వాసం కోల్పోయినట్టు. అప్పుడు మంత్రిమండలి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అంటే ప్రభుత్వం పడిపోతుంది. ప్రభుత్వమే పరీక్షకు నిలిస్తే.. విశ్వాస తీర్మానం ► అలాగే 1997లో హెచ్డీ దేవెగౌడ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచి్చన 10 నెలలకే బలపరీక్షకు వెళ్లింది. కేవలం 158 మంది ఎంపీలే దానికి మద్దతిచ్చారు. 292 మంది వ్యతిరేకంగా ఓటేయడంతో ప్రభుత్వం కుప్పకూలింది. ► ఇక 1999లో అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం చివరి క్షణంలో అన్నాడీఎంకే ప్లేటు ఫిరాయించి వ్యతిరేకంగా ఓటేయడంతో అనూహ్యంగా ఓడి ప్రభుత్వం పడిపోయింది. ► 1990లో రామమందిర అంశంపై బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో లోక్‌సభలో బలం నిరూపించుకునేందుకు వీపీ సింగ్ ప్రభుత్వం విశ్వాస తీర్మానం పెట్టింది. తీర్మానానికి అనుకూలంగా కేవలం 142 ఓట్లు రాగా వ్యతిరేకంగా ఏకంగా 346 ఓట్లు రావడంతో ప్రభుత్వం పడిపోయింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చట్టసభల్లో నిరసనకు హద్దులుండాలి
సాక్షి, న్యూఢిల్లీ: చట్టసభల్లో నిరసనలు తెలపడంలో తప్పు లేదని, అదే సమయంలో సభా గౌరవాన్ని, గొప్పతనాన్ని కాపాడుకోవాలని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు అన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు, చట్టాల్లోని లోపాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడం ప్రజా ప్రతినిధుల హక్కు అయినప్పటికీ, అవి భావోద్వేగాలకు దారి తీసి పరిమితులు దాటకూడదని హితవు పలికారు. చట్టసభల్లో కార్యకలాపాలకు తరచూ అంతరాయాలు కలుగుతుండటం, దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం స్ఫూర్తికి విఘాతం కలిగే పరిస్థితులు చోటు చేసుకోవడంపై ఉపరాష్ట్రపతి ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తొలి స్మారకోపన్యాసం చేసిన ఉపరాష్ట్రపతి, చట్టసభల్లో అంతరాయాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని ప్రణబ్ ముఖర్జీ లెగసీ ఫౌండేషన్ వర్చువల్ వేదికగా నిర్వహించింది. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి మాట్లాడే స్వేచ్ఛ ఉంటుందని, రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండడమే నిజమైన ప్రజాస్వామ్యాన్ని, సమగ్రాభివృద్ధిని ముందుకు తీసుకెళుతుందని ఉపరాష్ట్రపతి తెలిపారు. చట్టసభల్లో అంతరాయాలతో జవాబుదారీతనం కొరవడి, ఏకపక్ష ధోరణి ఏర్పడే ప్రమాదముందని ఉపరాష్ట్రపతి ఆందోళన వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రణబ్ ముఖర్జీ బుద్ధి కుశలత, అసాధారణ జ్ఞాపకశక్తి అనేక వివాదాస్పద అంశాలకు సమాధానాన్ని చూపిందన్న ఉపరాష్ట్రపతి, పన్ను సంస్కరణలను స్వయంగా ఆర్థికమంత్రిగా సేవలందించిన ప్రణబ్ స్వాగతించిన విషయాన్ని గుర్తు చేశారు. 2018లో నాగపూర్‌లో జరిగిన ఆర్.ఎస్.ఎస్. శిక్షణా శిబిరంలో ప్రణబ్ ముఖర్జీ పాల్గొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, హుందాగా వ్యవహరించగల ప్రణబ్ వ్యక్తిత్వానికి ఇది ఉదాహరణ అన్నారు. జాతీయవాదం గురించి మాటల్లో చెప్పే వారికి, నిజమైన జాతీయవాదాన్ని చేతల్లో చూపించారని తెలిపారు. దేశాభివృద్ధికి ప్రణబ్ విశేష సేవలు: మోదీ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దార్శనికతగల గొప్ప నేత అని ప్రధాని మోదీ శ్లాఘించారు. అత్యుత్తమ ప్రజాజీవితం, పరిపాలనా దక్షత, సునిశిత దృష్టి కలిగిన ఆయన వివిధ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారన్నారు. ప్రణబ్ ముఖర్జీ ప్రథమ స్మారకోపన్యాసంలో ప్రధాని ఈ మేరకు పేర్కొన్నారు. అమోఘ ప్రజ్ఞాపాటవాలు కలిగిన ప్రణబ్ దేశాభివృద్ధికి గుర్తుంచుకోదగ్గ సేవలందించారని తెలిపారు. దేశ ప్రజాస్వామ్య విలువలను ఆయన పరిపుష్టం చేశారన్నారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ ఖలీదా జియా వర్చువల్‌గా ప్రసంగించారు. యువ ఎంపీగా బంగ్లాదేశ్ అవతరణకు తోడ్పాటునందిం చారని ప్రణబ్‌ను కొనియాడారు. బంగ్లాదేశ్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించాలంటూ 1971 జూన్‌లో రాజ్యసభలో ఆయన తీర్మానం ప్రవేశపెట్టారని గుర్తుకు తెచ్చుకున్నారు. భూటాన్ రాజు జింగ్మే కేసర్ నామ్‌గ్యాల్ వాంగ్‌చుక్ తన ఉపన్యాసంలో.. ప్రణబ్‌తో పలుమార్లు తాను భేటీ అయ్యాయని చెప్పారు. ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నాననీ, ఆయన లోటు తీర్చలేనిదని తెలిపారు. ప్రణబ్‌ముఖర్జీ దేశానికి 13వ రాష్ట్రపతిగా 2012–17 మధ్య కాలంలో పనిచేశారు. కాంగ్రెస్ నేత అయిన ఆయన కేంద్ర ప్రభుత్వంలో పలు శాఖలకు మంత్రిగా కూడా ఉన్నారు. -
ధనస్వామ్యంలో ఓడిన ఓటరు !
ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలవలేదు. కుబేరుడు గెలిచాడు. ఓడింది.. పార్టీలు కాదు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. అవినీతి గెలిచింది. ఓటరు మహాశయుడు తలవొంచాడు. ప్రజలు కురిపించిన ఓట్ల వాన మన్మోహన్ సింగ్-సోనియా దుష్టపాలనకు వ్యతిరేకంగా వేసిన ఓటు, అంతేగానీ మోడీపట్ల మోజుతో వేసిన ఓటు కాదు. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలిచింది.. కాదు నరేంద్ర మోడీ గెలిచారు.... కాదు ఆర్ఎస్ఎస్ గెలిచింది. ఆ పార్టీ అగ్రనాయకులు మోడీని ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేయడానికి ఇష్టపడలేదు. దీనితో ఆయన ఆర్ఎస్ఎస్ను ఆశ్రయించారు. అభ్యర్థిత్వాన్ని గెలుచుకున్నారు. అత్యధిక సీట్లు గెలుచుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఒక పార్టీ సొంతంగా మెజారిటీ సీట్లు గెలవడం దేశ చరిత్రలో ఇది మొదటిసారి కాదు. రాజీవ్ గాంధీ 1984 ఎన్నికల్లోనే 400 సీట్లుపైనే గెలుచుకున్నారు. సామాన్య ప్రజలకు ముందుంది ముసళ్లపండుగ. ఎందుకంటే ఇప్పటికే కార్పొరేట్లూ, వాటికి చెందిన మీడియా సంస్థలూ మోడీకి పల్లకీ మోశాయి. మన దేశంలో కొన్ని కార్పొరేట్ సంస్థలు ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుల జాబితాలో ఉన్నాయి. ‘ధనమూలమిదం జగత్’ అన్నట్టు దేశంలో వీరి హవా జోరుగా నడుస్తోంది. ఇప్పుడు మోడీ గెలుపు వీరికీ, అధికార పగ్గాలు చేపట్టబోతున్న మోడీకీ అండగా నిలుస్తుంది. కాదు, శాసిస్తుంది. సామాన్యులను కాటేస్తుంది. ప్రధాని గద్దెమీద కూర్చుంటేనే నాలుగు రొట్టె ముక్కలు విసురుతాడు. అంతే. కాబోయే ప్రధానికి ఒక హెచ్చరిక. ప్రజలు కురిపించిన ఓట్ల వాన మన్మోహన్ సింగ్-సోనియా దుష్టపాలనకు వ్యతిరేకంగా వేసిన ఓటు, అంతేగానీ మోడీపట్ల మోజుతో వేసిన ఓటు కాదు. కాంగ్రెస్ పీడ వదిలిందని మురిసిపోవద్దు. కార్పొరేట్-మోడీ ఉచ్చు బిగియబోతోంది. జాతీయస్థాయిలో ఇది ప్రధాన అంశమైతే, రాష్ట్రంలో టీడీపీతో నువ్వానేనా అన్న స్థాయిలో హోరాహోరీగా పోరాడి 67 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ సాధించిన విజయం ముఖ్యమైన పరిణామంగానే భావించాలి. గత రెండు మూడేళ్లలో ప్రజా సమూహాల్లో ఈదుకుంటూ వచ్చిన పార్టీకి ఈ సమూహాలను ఓటింగ్ కేంద్రాలకు తీసుకొని రాగలిగిన పార్టీ యంత్రాంగం లేదు. అంతేకాదు ఎన్నికల్లో విస్తృతంగా పాల్గొన్న అనుభవం వైఎస్ఆర్సీపీకి లేదు. నా దృష్టిలో చంద్రబాబు విజయం కన్నా జగన్మోహన్రెడ్డి గెలుపు గొప్పది. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలతో పోల్చితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మెరుగైన ఫలితాలు సాధించడం బట్టి గ్రామాల్లో ఆ పార్టీకి బలమైన పునాదులు ఉన్నాయని స్పష్టమవుతోంది. ఇక్కడ 1983 ఎన్నికల గురించి ప్రస్తావించాలి. తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ఎన్టీ రామారావు కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించి అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఆయనకు పార్టీ యంత్రాంగం, కిందిస్థాయిలో పనిచే సే కార్యకర్తలు, పోటీకి అవసరమయ్యే నిధులు లేకుండానే సినిమా ఇమేజ్‌తో అఖండ విజయం సాధించారు. జగన్‌కు రాజశేఖరరెడ్డి ఇమేజ్ ఉండబట్టే తొలిరౌండ్ రాష్ట్ర పర్యటనలోనే జనం కుప్పతెప్పలుగా సభలకు హాజరయ్యారు. ఆ నేపథ్యమే ప్రస్తుత విజయాలకు పునాది. ఇక్కడ ఏ నేపథ్యంలో ఈ ఎన్నికలు జరిగాయో విశ్లేషించుకోవాలి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలవలేదు. కుబేరుడు గెలిచాడు. ఓడింది.. పార్టీలు కాదు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. అవినీతి గెలిచింది. ఓటరు మహాశయుడు తలవొంచాడు. 2013-14 కన్నా 2014-15లో దేశ పరిస్థితి మరింత క్లిష్టతరమవుతుంది. సామాన్యుడి ఆర్థిక పరిస్థితి ఇంకా దారుణమవుతుంది. కార్పొరేట్లు మరింతగా లాభాలు దండుకుంటారు. కాంగ్రెస్ మన రాష్ట్రంలో ఓడిపోయిందంటే అది స్వయంకృతాపరాధమే. దానికి కాంగ్రెస్ అధినాయకురాలు సోనియాగాంధీ నేరుగా బాధ్యత వహించాలి. రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఓటమికి ఆమే కారణం. మన్మోహన్ సింగ్ సౌమ్యతను అవకాశంగా తీసుకుని, ఆయన్ని కీలుబొమ్మ ప్రధానిగా మార్చి అధికారాలన్నీ చెలాయించి బొక్కబోర్లా పడ్డారు. రాష్ట్రాన్ని విభజించవొద్దని ప్రజానీకం తిరగబడినా కాదని విడదీసి, తన పార్టీని సీమాంధ్రలో తుడిచిపెట్టేశారు. ఇక తెలంగాణలో ఆ పార్టీ కుంటి గుర్రమే. తాను తీసుకున్న గోతిలో తానే పడ్డారంటే విచారించేవారెవరూ లేరు. సోనియా దేశాన్నే ముంచేస్తే, మన్మోహన్ దేశాన్ని అమెరికాకు పాదాక్రాంతం చేశారు. ఇవి ఎన్నికలు కావు. ఇదో ఓట్ల మార్కెట్. డబ్బు పంచిపెట్టడంలో దేశంలోనే రాష్ట్రం ప్రథమశ్రేణిలో నిలిచింది. ఈ ఎన్నికల్లో పార్టీలు తెలుగు ప్రజలు తలవొంచుకునేటట్లు చేశాయంటే అందుకు విచ్చలవిడిగా డబ్బులు పంచిపెట్టిన పార్టీలే బాధ్యత వహించాలి. అసలీ ధోరణిని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీయే. మొట్టమొదట 1952లో ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్, కమ్యూనిస్టులు ప్రధాన ప్రత్యర్థులు. అప్పట్లో కొన్ని గ్రామాల్లో కమ్యూనిస్టులకు ఓట్లు వేస్తారని అనుమానించినవారిని పోలింగ్ రోజున బందెలదొడ్లో బంధించి ఓటింగ్ పూర్తయిన తర్వాత విడిచిపెట్టారు. భూస్వాములు కొంతమందిని భయపెట్టి ఓట్లు వేయకుండా నిరోధించారు. ఇంతచేసినా, కమ్యూనిస్టులే కాంగ్రెస్ కన్నా ఒక సీటు అధికంగా గెలిచారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక కాంగ్రెస్ అభ్యర్థి స్త్రీలకు వెండి కుంకుమ భరిణెలు, జాకెట్ గుడ్డలు పంచారు. ఆ తర్వాత జరుగుతూ వచ్చిన ఎన్నికల్లో గూండాలను గూడేలపై ప్రయోగించడం, అక్కడక్కడ సారా సరఫరా, గూడెం పెద్దను నయానోభయానో లొంగదీసుకొని మొత్తం గూడెంలో ఉండే ఓటర్లను ప్రభావితం చేయడం జరిగింది. ఈ చర్యల లక్ష్యం ఒక్కటే. వారి ఓట్లు కమ్యూనిస్టులకు పడకుండా చేయడమే. ఎన్నికల్లో డబ్బు వెదజల్లడం చిన్నగా ప్రారంభమై నేడు ఈ స్థాయికి చేరింది. డబ్బు ఖర్చుపెట్టి అధికారాన్ని కొనుక్కోవడం, లేదా అధికారంలో కొనసాగడం నేడు మనం చూస్తున్నామంటే దానికి కాంగ్రెస్ వేసిన పునాదే కారణం. జనం డబ్బు పుచ్చుకొన్న ఓటర్లు ఏ పార్టీ ఇచ్చిందో దానికే ఓటు వేశారంటే అది వారి నిజాయితీకి చిహ్నం. కాని నాయకులో? ప్రచారంలో ఎన్నో వాగ్దానాలు చేసి తీరా ఏరు దాటాక బోడిమల్లయ్య అన్న తరహాలో ప్రవర్తించే నేతలు సామాన్య ఓటర్ల కాలిగోటికి కూడా సరిరారు. ఇక జయాపజయాల విషయానికి వస్తే... కాంగ్రెస్‌ను ప్రజలు ఏడు నిలువుల లోతు పాతిపెడతారని అందరూ అనుకొన్న మాటే. కాంగ్రెస్ ఓటమిని ముందే పసిగట్టిన పాలకపార్టీ నేతలు కొంతమంది టీడీపీలోకి, మరికొంతమంది వైఎస్ఆర్సీపీలోకి వెళ్లారు. 2004, 2009 ఎన్నికల్లో ఓడిపోయిన చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో గెలుస్తానని నమ్మకం లేదు. ఆ విశ్వాసమే కనక ఉంటే అంతకముందుదాకా ఆయన ఎడాపెడా విమర్శించిన బీజేపీతో ఎందుకు చేతులు కలిపారు? కార్పొరేట్ల చేతుల్లో ఉన్న మీడియా మోడీకి బ్రహ్మరథం పడుతుంటే ఇదే అదనుగా భావించి ఆయన కూడా గోడదూకి, మోడీ గెలిచి ప్రధాని అయితే తన రొట్టె కూడా నేతిలో పడుతుందని భావించారు. అంతేకాదు బీజేపీకి పడే ఓట్లు తమ పార్టీకీ పడతాయని ఆశించారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు పడ్డాయంటే అది ఆయనంటే, ఆయన తొమ్మిదేళ్ల పాలనంటే మోజుపడి కాదు. ఆ ఓటు, కాంగ్రెస్ వ్యతిరేక ఓటని గుర్తుంచుకోవాలి. చంద్రబాబు పరిపాలన చూసిన తర్వాత రెండు సాధారణ(2004,2009) ఎన్నికల్లో ప్రజలు ఆయన్ని తిరస్కరించి వైఎస్‌కే పట్టంగట్టారని గుర్తుంచుకోవాలి. ఈ ఎన్నికల్లోనే కాదు, మొదటి ఎన్నికల నాటి నుంచి ఏ పార్టీలో చూసినా ప్రచారం, పరిపాలన వ్యక్తుల చుట్టూనే పరిభ్రమిస్తోందిగానీ, పా ర్టీల చుట్టూ, విధానాల చుట్టూ కాదు. నెహ్రూ పాలించినంతకాలం మహాత్మాగాంధీ పేరుతో ప్రచారం జరిగింది. తర్వాత గాంధీ-నెహ్రూ కుటుంబసభ్యులే వంశపారంపర్యంగా, వ్యక్తుల ఆధ్వర్యంలోనే ప్రచారం, పాలన కొనసాగింది. ఈ జాడ్యం ఇతర పార్టీలకూ సోకింది. పార్టీ అధ్యక్షులు నిమిత్తమాత్రులుగా ఉండిపోయారు. ప్రధానులు, సీఎంలే సమస్తం అయ్యారు. ఇదెంత అనారోగ్యకర పరిణామమో మోడీని చూస్తే తెలుస్తుంది. - (వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్) వి.హనుమంతరావు -
అవకాశవాద సాన్నిహిత్యం!
సంపాదకీయం: పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పొత్తులు పెట్టుకోవడం, కూటములు కట్టడం సర్వసాధారణం. ఒంటరిగా నెగ్గలేమని భావించే పక్షాలు మాత్రమే ఇలా సన్నిహితమవుతాయనుకోనవసరం లేదు. సిద్ధాంతాలు, ఆచరణల్లో సారూప్యత ఉన్నదనుకున్నా... విధానపరమైన అంశాల్లో ఒకే రకమైన ఆలోచనలున్నాయనుకున్నా పొత్తులు, కూటములు ఆవిర్భవిస్తాయి. ఇలాంటి సర్దుబాట్ల ద్వారా ఎన్నికల్లో తమ బలాన్ని పెంచుకోవాలని, లాభం పొందాలని పార్టీలనుకుంటే అందుకు తప్పుబట్టవలసిందేమీ లేదు. కానీ, రాష్ట్రంలో టీడీపీ-బీజేపీల మధ్య కుదిరిన పొత్తు ఏ లెక్కకూ అందనిది. అవకాశవాదం తప్ప దానికి ప్రాతిపదికన్నదే లేదు. ఈ పొత్తుకు బీజేపీలోని రాష్ట్ర స్థాయి నాయకత్వం, శ్రేణులుగానీ ఒప్పుకోలేదని అందరికీ తెలుసు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో బీజేపీ నాయకులు చివరి నిమిషం వరకూ ససేమిరా అన్నారు. చివరకు పొత్తు కుదిరిందన్న ప్రకటన చేయడం కోసం జరిగిన విలేకరుల సమావేశానికి సైతం వారు దూరంగా ఉన్నారు. దేశ, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రెండు పార్టీలూ పొత్తు పెట్టుకున్నాయని బాబు ప్రకటించారు. అందుకోసం త్యాగాలు తప్పవని కూడా చెప్పారు. ఆ ప్రయోజనాలేమిటో వివరించి ఉంటే అవి ఈ రెండు పార్టీల అవగాహనవల్లా ఎలా సమకూడగలవో అందరూ అర్ధం చేసుకునే అవకాశం ఉండేది. కూటమికట్టి అలాంటి ప్రయోజనాలు నెరవేర్చడానికి ముందు తమ మధ్య ఇంతకు పూర్వం ఉన్న అపోహలైనా, విభేదాలైనా ఎందుకు వచ్చాయో, అవి ఇప్పుడు ఎలా తొలగినవో రెండు పార్టీలూ ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. కానీ, ఆ పని ఇద్దరూ చేయలేదు. చంద్రబాబు నాయుడు 1999 మొదలుకొని 2004 వరకూ బీజేపీతో జాతీయస్థాయిలో కలిసి పనిచేశారు. ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీయేలో కీలకపాత్ర పోషించారు. అందుకు అనుగుణంగా ఇక్కడా పొత్తు పెట్టుకున్నారు. 1998 లోక్‌సభ ఎన్నికల్లో బాబు బీజేపీకి తాత్కాలికంగా దూరమైనప్పుడు ఆ పార్టీ వంద తప్పులతో ఆయనపై చార్జిషీటు పెట్టింది. ఈసారి ఎన్నికల తర్వాత అయోధ్యలో రామమందిరం నిర్మిస్తామని 2004లో ఆపద్ధర్మ ప్రధాని హోదాలో వాజపేయి ప్రకటించినప్పుడు ఆ కార్యక్రమం ఎన్డీయే ఎజెండాలోనిది కాదని బాబు సంజాయిషీ ఇచ్చారు. అంతేకాదు...లౌకికవాద భావాలుంటేనే తమ పార్టీ ఎన్డీయేలో కొనసాగుతుందని కూడా చెప్పారు. చివరకు ఆ ఎన్నికల్లో సైతం బీజేపీతోనే కలిసి ప్రయాణించారు. అది కలిసిరాక ఓటమి మూటగట్టుకున్నాక బాబు మాట మార్చారు. మతతత్వ బీజేపీతో పొత్తువల్లే ఓటమి సంభవించిందని ఆరోపించారు. బాబు వల్లే తాము నిండా మునిగామని కమలనాథులు కూడా వాపోయారు. అటు తర్వాత బాబుగారిలో పశ్చాత్తాపం పొంగుకొచ్చింది. బీజేపీతో ఇకపై ఎలాంటి పొత్తులూ ఉండబోవని మైనారిటీ వర్గాలకు హామీ ఇచ్చారు. తాను అంతక్రితం చేసిందంతా తప్పేనని ఒప్పుకున్నారు. బీజేపీ నేతలు కూడా ఊరుకోలేదు. ముందుగా ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారం కైవసం చేసుకున్న బాబు తమ దయవల్లనే రెండోసారి సీఎం కాగలిగారని జవాబిచ్చారు. ఇవన్నీ రహస్యంగా అనుకున్న మాటలు కావు. బహిరంగంగా చేసుకున్న విమర్శలు. ఇలా అనుకున్నంత మాత్రాన మళ్లీ దగ్గర కాకూడదని ఏం లేదు. తమ తమ తప్పులు తెలుసుకుని లెంపలు వాయించుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండనవసరం లేదు. కానీ, ఆ పనేదో బహిరంగంగా చేయాలి. బీజేపీలో మతతత్వం ఉన్నదని తాను భ్రమపడ్డానని, 2002 గుజరాత్ మారణకాండలో మోడీ ప్రమేయంపై అపోహపడ్డానని బాబు చెబితే తప్పుబట్టాల్సింది ఏమీ లేదు. తనకు హఠాత్తుగా జ్ఞానోదయమైందని ఆయన చెప్పుకుంటే కాదనేదెవరు? ఇటు బీజేపీ కూడా బాబును క్షమించామని చెప్పవచ్చు. లేదా తమ తమ అభిప్రాయాల్లో లేశమాత్రమైనా మార్పులేకపోయినా ‘దేశ, రాష్ట్ర ప్రయోజనాల కోసం’ దగ్గరయ్యామని దేశ ప్రజలకు సంజాయిషీ ఇచ్చినా వేరుగా ఉండేది. ఇలా కలిసినవారితో ఎలా వ్యవహరించాలో జనమే తేల్చుకునేవారు. కానీ, అంతక్రితం అసలేమీ జరగనట్టు రెండు పక్షాలూ నటిస్తున్నాయి. ఇది అవకాశవాదానికి పరాకాష్ట. తెలంగాణలోనైనా, ఆంధ్రలోనైనా క్షేత్రస్థాయిలో టీడీపీ తీవ్రంగా దెబ్బతిని ఉన్నది. పార్టీ శ్రేణులు, నాయకగణం నీరసావస్థలో ఉన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్, ఆంధ్ర ప్రాంతంలో వైఎస్సార్ కాంగ్రెస్ బలమైన పార్టీలుగా రూపుదిద్దుకున్నాయి. జనాభిమానాన్ని చూరగొన్నాయి. ఈ స్థితిలో ఒంటరిగా ఎన్నికలకు వెళ్తే ఓటమి ఖాయమని...భవిష్యత్తు శూన్యమని అంచనావేసుకున్న బాబు బీజేపీని బతిమాలి బామాలి దారికి తెచ్చుకున్నారు. అటు జాతీయస్థాయిలో బీజేపీది మరో రకం అవస్థ. అధికారం వచ్చి ఒళ్లో వాలుతుందని చెప్పే సర్వేలమాట ఎలావున్నా జేడీ(యూ) వైదొలగాక ఎన్డీయేలో చెప్పుకోదగిన పార్టీ లేదు. ఇప్పుడున్న పార్టీలకు ఎన్ని స్థానాలొస్తాయో తెలియదు. ఎన్నికలయ్యాక జత కలిసేదెవరో చెప్పలేని స్థితి. ఇలాంటపుడు గతంలో కలిసి ప్రయాణించిన బాబును మళ్లీ చేరదీయడంవల్ల లాభమే తప్ప నష్టంలేదని బీజేపీ అంచనాకొచ్చినట్టు కనిపిస్తోంది. కానీ, రాష్ట్రంలో ఫలితాలు వెలువడిన తర్వాతగానీ తమ నిర్ణయంలోని ఔచిత్యం కమలనాథులకు అర్ధంకాదు. ఇప్పటికే నామినేషన్ల పర్వం పూర్తయిన తెలంగాణలో ఈ రెండు పార్టీలూ పరస్పర వైరిపక్షాలుగా మారాయని, ఉమ్మడి ఓటమికి కృషి ప్రారంభించాయని అర్ధమవుతుంది. ఉమ్మడి ఎజెండా లేకుండా, కనీసమైన భావసారూప్యత కూడా లేకుండా పొత్తులకు దిగితే ఏమవుతుందో ఇవాళ తెలంగాణలో కనబడుతోంది. రేపు ఆంధ్రలోనూ ఇదే పునరావృతం అవుతుంది. ఇంతటి డొల్లతనాన్ని జనం గమనించకపోరు. ఆ సంగతి ఫలితాల అనంతరం వెల్లడవుతుంది.