సంపాదకీయం: పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పొత్తులు పెట్టుకోవడం, కూటములు కట్టడం సర్వసాధారణం. ఒంటరిగా నెగ్గలేమని భావించే పక్షాలు మాత్రమే ఇలా సన్నిహితమవుతాయనుకోనవసరం లేదు. సిద్ధాంతాలు, ఆచరణల్లో సారూప్యత ఉన్నదనుకున్నా... విధానపరమైన అంశాల్లో ఒకే రకమైన ఆలోచనలున్నాయనుకున్నా పొత్తులు, కూటములు ఆవిర్భవిస్తాయి. ఇలాంటి సర్దుబాట్ల ద్వారా ఎన్నికల్లో తమ బలాన్ని పెంచుకోవాలని, లాభం పొందాలని పార్టీలనుకుంటే అందుకు తప్పుబట్టవలసిందేమీ లేదు. కానీ, రాష్ట్రంలో టీడీపీ-బీజేపీల మధ్య కుదిరిన పొత్తు ఏ లెక్కకూ అందనిది. అవకాశవాదం తప్ప దానికి ప్రాతిపదికన్నదే లేదు. ఈ పొత్తుకు బీజేపీలోని రాష్ట్ర స్థాయి నాయకత్వం, శ్రేణులుగానీ ఒప్పుకోలేదని అందరికీ తెలుసు.
ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో బీజేపీ నాయకులు చివరి నిమిషం వరకూ ససేమిరా అన్నారు. చివరకు పొత్తు కుదిరిందన్న ప్రకటన చేయడం కోసం జరిగిన విలేకరుల సమావేశానికి సైతం వారు దూరంగా ఉన్నారు. దేశ, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రెండు పార్టీలూ పొత్తు పెట్టుకున్నాయని బాబు ప్రకటించారు. అందుకోసం త్యాగాలు తప్పవని కూడా చెప్పారు. ఆ ప్రయోజనాలేమిటో వివరించి ఉంటే అవి ఈ రెండు పార్టీల అవగాహనవల్లా ఎలా సమకూడగలవో అందరూ అర్ధం చేసుకునే అవకాశం ఉండేది. కూటమికట్టి అలాంటి ప్రయోజనాలు నెరవేర్చడానికి ముందు తమ మధ్య ఇంతకు పూర్వం ఉన్న అపోహలైనా, విభేదాలైనా ఎందుకు వచ్చాయో, అవి ఇప్పుడు ఎలా తొలగినవో రెండు పార్టీలూ ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. కానీ, ఆ పని ఇద్దరూ చేయలేదు.
చంద్రబాబు నాయుడు 1999 మొదలుకొని 2004 వరకూ బీజేపీతో జాతీయస్థాయిలో కలిసి పనిచేశారు. ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీయేలో కీలకపాత్ర పోషించారు. అందుకు అనుగుణంగా ఇక్కడా పొత్తు పెట్టుకున్నారు. 1998 లోక్‌సభ ఎన్నికల్లో బాబు బీజేపీకి తాత్కాలికంగా దూరమైనప్పుడు ఆ పార్టీ వంద తప్పులతో ఆయనపై చార్జిషీటు పెట్టింది. ఈసారి ఎన్నికల తర్వాత అయోధ్యలో రామమందిరం నిర్మిస్తామని 2004లో ఆపద్ధర్మ ప్రధాని హోదాలో వాజపేయి ప్రకటించినప్పుడు ఆ కార్యక్రమం ఎన్డీయే ఎజెండాలోనిది కాదని బాబు సంజాయిషీ ఇచ్చారు. అంతేకాదు...లౌకికవాద భావాలుంటేనే తమ పార్టీ ఎన్డీయేలో కొనసాగుతుందని కూడా చెప్పారు. చివరకు ఆ ఎన్నికల్లో సైతం బీజేపీతోనే కలిసి ప్రయాణించారు. అది కలిసిరాక ఓటమి మూటగట్టుకున్నాక బాబు మాట మార్చారు. మతతత్వ బీజేపీతో పొత్తువల్లే ఓటమి సంభవించిందని ఆరోపించారు.
బాబు వల్లే తాము నిండా మునిగామని కమలనాథులు కూడా వాపోయారు. అటు తర్వాత బాబుగారిలో పశ్చాత్తాపం పొంగుకొచ్చింది. బీజేపీతో ఇకపై ఎలాంటి పొత్తులూ ఉండబోవని మైనారిటీ వర్గాలకు హామీ ఇచ్చారు. తాను అంతక్రితం చేసిందంతా తప్పేనని ఒప్పుకున్నారు. బీజేపీ నేతలు కూడా ఊరుకోలేదు. ముందుగా ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారం కైవసం చేసుకున్న బాబు తమ దయవల్లనే రెండోసారి సీఎం కాగలిగారని జవాబిచ్చారు. ఇవన్నీ రహస్యంగా అనుకున్న మాటలు కావు. బహిరంగంగా చేసుకున్న విమర్శలు.
ఇలా అనుకున్నంత మాత్రాన మళ్లీ దగ్గర కాకూడదని ఏం లేదు. తమ తమ తప్పులు తెలుసుకుని లెంపలు వాయించుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండనవసరం లేదు. కానీ, ఆ పనేదో బహిరంగంగా చేయాలి. బీజేపీలో మతతత్వం ఉన్నదని తాను భ్రమపడ్డానని, 2002 గుజరాత్ మారణకాండలో మోడీ ప్రమేయంపై అపోహపడ్డానని బాబు చెబితే తప్పుబట్టాల్సింది ఏమీ లేదు. తనకు హఠాత్తుగా జ్ఞానోదయమైందని ఆయన చెప్పుకుంటే కాదనేదెవరు? ఇటు బీజేపీ కూడా బాబును క్షమించామని చెప్పవచ్చు. లేదా తమ తమ అభిప్రాయాల్లో లేశమాత్రమైనా మార్పులేకపోయినా ‘దేశ, రాష్ట్ర ప్రయోజనాల కోసం’ దగ్గరయ్యామని దేశ ప్రజలకు సంజాయిషీ ఇచ్చినా వేరుగా ఉండేది. ఇలా కలిసినవారితో ఎలా వ్యవహరించాలో జనమే తేల్చుకునేవారు. కానీ, అంతక్రితం అసలేమీ జరగనట్టు రెండు పక్షాలూ నటిస్తున్నాయి. ఇది అవకాశవాదానికి పరాకాష్ట.
తెలంగాణలోనైనా, ఆంధ్రలోనైనా క్షేత్రస్థాయిలో టీడీపీ తీవ్రంగా దెబ్బతిని ఉన్నది. పార్టీ శ్రేణులు, నాయకగణం నీరసావస్థలో ఉన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్, ఆంధ్ర ప్రాంతంలో వైఎస్సార్ కాంగ్రెస్ బలమైన పార్టీలుగా రూపుదిద్దుకున్నాయి. జనాభిమానాన్ని చూరగొన్నాయి. ఈ స్థితిలో ఒంటరిగా ఎన్నికలకు వెళ్తే ఓటమి ఖాయమని...భవిష్యత్తు శూన్యమని అంచనావేసుకున్న బాబు బీజేపీని బతిమాలి బామాలి దారికి తెచ్చుకున్నారు. అటు జాతీయస్థాయిలో బీజేపీది మరో రకం అవస్థ. అధికారం వచ్చి ఒళ్లో వాలుతుందని చెప్పే సర్వేలమాట ఎలావున్నా జేడీ(యూ) వైదొలగాక ఎన్డీయేలో చెప్పుకోదగిన పార్టీ లేదు. ఇప్పుడున్న పార్టీలకు ఎన్ని స్థానాలొస్తాయో తెలియదు. ఎన్నికలయ్యాక జత కలిసేదెవరో చెప్పలేని స్థితి. ఇలాంటపుడు గతంలో కలిసి ప్రయాణించిన బాబును మళ్లీ చేరదీయడంవల్ల లాభమే తప్ప నష్టంలేదని బీజేపీ అంచనాకొచ్చినట్టు కనిపిస్తోంది.
కానీ, రాష్ట్రంలో ఫలితాలు వెలువడిన తర్వాతగానీ తమ నిర్ణయంలోని ఔచిత్యం కమలనాథులకు అర్ధంకాదు. ఇప్పటికే నామినేషన్ల పర్వం పూర్తయిన తెలంగాణలో ఈ రెండు పార్టీలూ పరస్పర వైరిపక్షాలుగా మారాయని, ఉమ్మడి ఓటమికి కృషి ప్రారంభించాయని అర్ధమవుతుంది. ఉమ్మడి ఎజెండా లేకుండా, కనీసమైన భావసారూప్యత కూడా లేకుండా పొత్తులకు దిగితే ఏమవుతుందో ఇవాళ తెలంగాణలో కనబడుతోంది. రేపు ఆంధ్రలోనూ ఇదే పునరావృతం అవుతుంది. ఇంతటి డొల్లతనాన్ని జనం గమనించకపోరు. ఆ సంగతి ఫలితాల అనంతరం వెల్లడవుతుంది.
అవకాశవాద సాన్నిహిత్యం!
Published Fri, Apr 11 2014 1:50 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement