బోథ్: పంచాయతీ రిజర్వేషన్లు కుదించడంపై బీసీ సామాజిక వర్గాల్లో అసంతృప్తి రాజుకుంటోంది. గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 60.19శాతం రిజర్వేషన్లు అమలు కాగా.. ప్రస్తుతం 50 శాతం మించవద్దంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీంతో ప్రభుత్వం 50 శాతానికి రిజర్వేషన్లను పరిమితం చేసేందుకు వారం క్రితం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీని ప్రాతిపాదికన రిజర్వేషన్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ పంచాయతీ చట్టం ప్రకారం రిజర్వేషన్లు 60 శాతంగా చట్టం చేశారు. న్యాయపరంగా చిక్కులు వస్తాయని భావించిన ప్రభుత్వం చట్టంలో మార్పు చేస్తూ 50 శాతానికి కుదించి ఆర్డినెన్స్ తెచ్చింది. దీంతో బీసీలకు 34గా ఉన్న రిజర్వేషన్లు 22.79 శాతానికి తగ్గించారు. ఈ లెక్కన బీసీలకు పంచాయతీల్లో రిజర్వేషన్లు తక్కువగా వచ్చాయి. దీంతో బీసీ సంఘాలు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. ఇది ముమ్మాటికీ బీసీలను అణగదొక్కడమేనని వారు పేర్కొంటున్నారు.
పంచాయతీలు పెరిగినా..తగ్గిన బీసీ రిజర్వేషన్లు
ఆదిలాబాద్ జిల్లాలో గత పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే ఈ సారి బీసీలకు కేటాయించిన పంచాయతీ స్థానాలు తగ్గాయి. ఇది శాతాల పరంగా చూస్తే 11.21గా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు జిల్లాలో 243 పంచాయతీలు ఉండేవి. ఆ ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కలిపి 60.19 శాతం రిజర్వేషన్లను అమలు చేశారు. బీసీలకు 34 శాతం, ఎస్సీలకు 20.46, ఎస్టీలకు 5.73 శాతం పంచాయతీలను రిజర్వ్ చేశారు. దీంతో ఎస్టీలకు ఏజెన్సీ ప్రాంతాలు, వంద శాతం ఎస్టీ ప్రాంతాలు, 5.73 శాతం రిజర్వేషన్లను కలుపుకుని గత ఎన్నికల్లో 148 పంచాయతీలు కేటాయించారు. ఎస్సీలకు 20.46 శాతంతో 16 పంచాయతీలు, బీసీలకు 34 శాతానికి 34 సీట్లు కేటాయించారు.
మిగిలిన స్థానాలు 45 జనరల్ కేటగిరీగా కేటాయించారు. కాగా 2014 తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక గతేడాది 500 జనాభా కలిగిన ప్రతీ తండా, గూడేంను నూతన పంచాయతీలుగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో 243గా ఉన్న పంచాయతీలు 467 అయ్యాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం నూతన పంచాయతీ చట్టంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించింది. 50 శాతం రిజర్వేషన్లు దాటరాదన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆర్డినెన్స్ ద్వారా బీసీల రిజర్వేషన్లను 22.79 శాతానికి తగ్గించింది. దీంతో 2013లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 243 పంచాయతీల్లో 34 పంచాయతీలు కేటాయించగా, ప్రస్తుతం 467 పంచాయతీల్లో బీసీలకు 47 పంచాయతీలు కేటాయించారు. స్థానాలు పెరిగినా పంచాయతీలతో పోలిస్తే మరో 11 శాతం పంచాయతీలు బీసీలకు అదనంగా రావాల్సి ఉంది. ప్రస్తుతం జరగనున్న ఎన్నికలో ఎస్టీలకు 322, ఎస్సీలకు 25, బీసీలకు 47, ఆన్ రిజర్వ్‌డ్ 103 రిజర్వేషన్లను కేటాయించారు.
ఆందోళనబాటలో బీసీ సంఘాలు, ప్రతిపక్షాలు
శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించాక జరుగుతున్న ఎన్నికలు కావడంతో టీఆర్‌ఎస్ వాటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీసీలకు కచ్చితంగా సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పినా రాజ్యాంగం ప్రకారం అది సాధ్యం కాలేదు. దీంతో బీసీ సంఘాలు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నాయి. జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలను ప్రభుత్వం విస్మరించిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు సైతం ప్రభుత్వ తీరును ఎండగట్టుతున్నాయి. ఇటీవలే ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా రాష్ట్ర బీసీ మహాజన సంఘం నేతలు వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఆర్డినెన్స్‌ను సస్పెండ్ చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment