వెంకటేశ్వర్లు
కరీంనగర్‌ఎడ్యుకేషన్: 2018–19 విద్యా సంవత్సరానికి గాను పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా పక్కా ప్రణాళికతో ముందుకెళ్లుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు వెల్లడించారు. ప్రత్యేకంగా మెటీరీయల్ తయారు చేయించి విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణులయ్యేలా చర్యలు చేపట్టామని తెలిపారు. గతంలో రెండుసార్లు పదవ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే జిల్లా రెండవ స్థానం సాధించిందని, ఈసారి మొదటి స్థానం సాధించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని ఆయన వివరిం చా రు. పదో తరగతి వార్షిక పరీక్షలకు సన్నద్ధత, తీసుకుంటున్న చర్యలపై ఆయనను బుధవారం ‘సాక్షి’కి ఇంటర్వ్యూ చేసింది.
సాక్షి: జిల్లాలో ఈసారి ఎంత మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు?
డీఈవో: కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, రెసిడెన్షియల్ ఉన్నత పాఠశాలలు 150 ఉన్నాయి. వీటిల్లో మొత్తం 14,196 మంది విద్యార్థులు ఈసారి పదో తరగతి వార్షిక పరీక్షలు రాయనున్నారు. గత రెండు సంవత్సరాలుగా పది ఫలితాల్లో జిల్లా రెండవ స్థానం సాధించింది. ఈ దఫా జిల్లాను మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నాం. ఇప్పటినుంచే ప్రణాళిక ప్రకారం బోధన చేయాలని ప్రధానోపాధ్యాయులను, సబ్జెక్టు ఉపాధ్యాయులను అదేశించాం. గత నెల నుంచే అన్ని పాఠశాలల్లో 60 రోజుల ప్రత్యేక ప్రణాళిక రూపొందించి పదో తరగతి విద్యార్థులకు సబ్జెక్టు వారీగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. విద్యార్థుల సామర్థ్యాన్ని గుర్తించి వెనుకబడిన వారిపై శ్రద్ధ కనబరుస్తున్నాం.
సాక్షి: విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నారా..?
డీఈవో: పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. నవంబర్ నుంచే ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల వరకు స్పెషల్ క్లాసులు కొనసాగిస్తున్నాం. ప్రతిరోజు స్లిప్ టెస్టులు, వారానికి ఒకసారి ఓరల్ టెస్టులు నిర్వహిస్తున్నాం. ప్రత్యేక తరగతుల్లో పాల్గొంటున్న విద్యార్థుల కోసం అల్పాహారం విషయంపై జిల్లా కలెక్టర్‌కు నివేదించాం. ని«ధులిస్తామని స్పష్టం చేశారు. ఆమోదం రాగానే పాఠశాలల్లో అల్పాహారం విద్యార్థులకు కిచిడి, ఉప్మా అందిస్తాం.
సాక్షి: అన్ని పాఠశాలల్లో సిలబస్ పూర్తి చేశారా..?
డీఈవో: జిల్లాలోని అన్ని పాఠశాలల్లో దాదాపు సిలబస్ తుది దశకు చేరుకుంది. ఈ నెలాఖరు నాటికి అన్ని సబ్జెక్టుల సిలబస్ పూర్తవుతుంది. జనవరి మొదటి వారంలో డీసీబీ ద్వారా సబ్జెక్టు నిపుణులతో అన్ని సబ్జెక్టుల పరంగా పాఠ్యాంశం ప్రకారం మెటీరియల్ తయారు చేయిస్తాం. విద్యార్థులకు రివిజన్ చేయిస్తూ పరీక్షలకు సిద్ధం చేస్తాం.
సాక్షి: వార్షిక పరీక్షలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి?
డీఈవో: మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ మొదటి వారం వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు పూర్తవుతాయి. అంతకు ముందే సిలబస్ పూర్తి చేసి, తరగతులు రివైజ్ చేయిస్తాం. ఫిబ్రవరిలో ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహించే అవకాశముంది. దీని ద్వారా విద్యార్థులకు మేలు చేకూరుతుంది.
సాక్షి: విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మీరిచ్చే సూచనలు..?
డీఈవో: జిల్లాను పదవ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపేలా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇప్పటినుంచే సిద్ధం కా వాలి. ప్రణాళిక ప్రకారం చదువుకోవాలి. విద్యార్థులను ఇంటి వద్ద తల్లిదండ్రులు చదివించాలి. ఉపా«ధ్యాయులు సైతం పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలి. సబ్జెక్టుల వారీగా తరగతులు రివైజ్డ్ చేయాలి. గత విద్యా సంవత్సరంలో జిల్లాలో 94.03 ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఈ సంవత్సరం ఉత్తీర్ణత 100 శాతం నమోదయ్యేలా అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు కృషి చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment