Exam centers Arrangement
-
నిమిషం ఆలస్యమైనా.. నో ఎంట్రీ
సాక్షి, చిలకలపూడి(కృష్ణా): ఆదివారం నుంచి ప్రారంభం కానున్న గ్రామ, వార్డు సచివాలయ పోస్టులకు సంబంధించి పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు నిర్ణీత సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని అధికారులు ప్రకటించారు. ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షా సమయానికి గంట ముందుగా కేంద్రానికి అభ్యర్థులు చేరుకోవాలన్నారు. అరగంట ముందు పరీక్షా కేంద్రంలోకి అనుమతించనున్నట్లు పేర్కొన్నారు. 2,00,655 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానుండగా.. జిల్లా వ్యాప్తంగా 374 కేంద్రాలను సిద్ధం చేశారు. పరీక్షా కేంద్రానికి హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ఏదొక గుర్తింపుకార్డును తప్పనిసరిగా తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారు. సిబ్బంది నియామకం.. గ్రామ, వార్డు సచివాలయ పోస్టులను భర్తీ చేసేందుకు నిర్వహించనున్న పరీక్షలకు ఇప్పటికే అధికారులు అవసరమైన సిబ్బందిని నియమించారు. 374 పరీక్షా కేంద్రాలకు 374 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లుగా 229 మంది, హాల్ సూపరింటెండెంట్లుగా 1, 772మంది, సెంటర్ ప్రత్యేక అధికారులుగా 374, రూట్ ఆఫీసర్లుగా 100, ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది 49 మందితో పాటు ఇన్విజిలేటర్లు 6,054 మందిని ర్యాండమ్ పద్ధతిలో నియమించారు. నేటి ఉదయం రిపోర్ట్ చేయాలి ఎవరైనా సిబ్బందికి ఏ పరీక్షా కేంద్రంలో విధులు నిర్వహించాలో వివరాలు అందకపోతే వారు ఆయా మండల విద్యాశాఖాధికారులను గానీ మండల ప్రజాపరిషత్ అధికారినిగానీ శనివారం ఉదయం సంప్రదించాలని కలెక్టర్ కోరారు. అలాగే నియామక ఉత్తర్వులు అందుకున్న వారందరూ వారికి కేటాయించిన సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్‌కు శనివారం ఉదయం 11 గంటలలోగా రిపోర్ట్ చేయాలని కోరారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి కో ఆర్డినేటర్‌గా జిల్లా పరిషత్ సీఈఓ షేక్ సలాం, జాయింట్ కో ఆర్డినేటర్‌గా డిప్యూటీ కలెక్టర్ ఎం. చక్రపాణి వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇవి తప్పనిసరి : బ్లూ, బ్లాక్ పాయింట్ పెన్ను, హాల్‌టికెట్, ఏదైనా గుర్తింపుకార్డు ఇవి నిషిద్ధం : సెల్‌ఫోన్, కాలిక్యులేటర్, వాచ్ సహా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు.. పరీక్షల నిర్వహణకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పరీక్షా కేంద్రాల్లో నిర్వహణపై వీడియో చిత్రీకరణ చేయనున్నారు. అవసరమైన చోట్ల సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. స్ట్రాంగ్‌రూమ్‌ల నుంచి పరీక్షా కేంద్రాలకు సామగ్రిని తరలించేందుకు పటిష్ట భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉండేలా పోలీసులు చర్యలు తీసుకోనున్నారు. పరీక్షా కేంద్రంలోకి వెళ్లే అభ్యర్థులు బ్లూ, బ్లాక్ పాయింట్ పెన్ను, హాల్‌టికెట్, ఏదైనా గుర్తింపుకార్డు తీసుకురావాలన్నారు. సెల్‌ఫోన్, కాలిక్యులేటర్, వాచ్‌తో సహా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్షా కేంద్రంలోకి అనుమతించబడవని అధికారులు స్పష్టం చేశారు. అలాగే పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు అరగంట ముందుగా ఓఎంఆర్ పత్రాలను అందజేస్తారు. సౌకర్యాలు ఏర్పాటు.. పరీక్షలకు హాజరుకానున్న అభ్యర్థుల కోసం అన్ని పరీక్షా కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు అధికారులు కల్పించారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీల్చైర్లు, వలంటీర్ల సౌకర్యం దివ్యాంగులకు కల్పించారు. తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా పరీక్షా కేంద్రాలకు వెళ్లే అభ్యర్థుల కోసం ఆర్టీసీ ద్వారా ప్రత్యేక బస్సు సౌకర్యం కూడా కల్పించారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న పరీక్షా కేంద్రాలకు హాజరయ్యే అభ్యర్థులకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. మండల కేంద్రాలకు పరీక్ష సామగ్రి సాక్షి, విజయవాడ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన గ్రామ సచివాలయ ఉద్యోగాల పరీక్షలకు సంబంధించిన సామగ్రిని అధికారులు మండల కేంద్రాలకు తరలించారు. విజయవాడలో పంచాయతీరాజ్ కార్యాలయం, జెడ్పీ అతిథిగృహం నుంచి శుక్రవారం సామగ్రిని డిస్పాచ్ చేశారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ జాయింట్ కలెక్టర్ –2 మోహన్ కుమార్ స్వీయ పర్యవేక్షణలో జిల్లాలో పరీక్షలు నిర్వహించే అన్ని మండల కేంద్రాలకు పంపించారు. నిర్ణీత రూట్ల ప్రకారం సామగ్రి తరలింది. -
‘పది’కి సన్నద్ధం
కరీంనగర్‌ఎడ్యుకేషన్: 2018–19 విద్యా సంవత్సరానికి గాను పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా పక్కా ప్రణాళికతో ముందుకెళ్లుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు వెల్లడించారు. ప్రత్యేకంగా మెటీరీయల్ తయారు చేయించి విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణులయ్యేలా చర్యలు చేపట్టామని తెలిపారు. గతంలో రెండుసార్లు పదవ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే జిల్లా రెండవ స్థానం సాధించిందని, ఈసారి మొదటి స్థానం సాధించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని ఆయన వివరిం చా రు. పదో తరగతి వార్షిక పరీక్షలకు సన్నద్ధత, తీసుకుంటున్న చర్యలపై ఆయనను బుధవారం ‘సాక్షి’కి ఇంటర్వ్యూ చేసింది. సాక్షి: జిల్లాలో ఈసారి ఎంత మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు? డీఈవో: కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, రెసిడెన్షియల్ ఉన్నత పాఠశాలలు 150 ఉన్నాయి. వీటిల్లో మొత్తం 14,196 మంది విద్యార్థులు ఈసారి పదో తరగతి వార్షిక పరీక్షలు రాయనున్నారు. గత రెండు సంవత్సరాలుగా పది ఫలితాల్లో జిల్లా రెండవ స్థానం సాధించింది. ఈ దఫా జిల్లాను మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నాం. ఇప్పటినుంచే ప్రణాళిక ప్రకారం బోధన చేయాలని ప్రధానోపాధ్యాయులను, సబ్జెక్టు ఉపాధ్యాయులను అదేశించాం. గత నెల నుంచే అన్ని పాఠశాలల్లో 60 రోజుల ప్రత్యేక ప్రణాళిక రూపొందించి పదో తరగతి విద్యార్థులకు సబ్జెక్టు వారీగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. విద్యార్థుల సామర్థ్యాన్ని గుర్తించి వెనుకబడిన వారిపై శ్రద్ధ కనబరుస్తున్నాం. సాక్షి: విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నారా..? డీఈవో: పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. నవంబర్ నుంచే ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల వరకు స్పెషల్ క్లాసులు కొనసాగిస్తున్నాం. ప్రతిరోజు స్లిప్ టెస్టులు, వారానికి ఒకసారి ఓరల్ టెస్టులు నిర్వహిస్తున్నాం. ప్రత్యేక తరగతుల్లో పాల్గొంటున్న విద్యార్థుల కోసం అల్పాహారం విషయంపై జిల్లా కలెక్టర్‌కు నివేదించాం. ని«ధులిస్తామని స్పష్టం చేశారు. ఆమోదం రాగానే పాఠశాలల్లో అల్పాహారం విద్యార్థులకు కిచిడి, ఉప్మా అందిస్తాం. సాక్షి: అన్ని పాఠశాలల్లో సిలబస్ పూర్తి చేశారా..? డీఈవో: జిల్లాలోని అన్ని పాఠశాలల్లో దాదాపు సిలబస్ తుది దశకు చేరుకుంది. ఈ నెలాఖరు నాటికి అన్ని సబ్జెక్టుల సిలబస్ పూర్తవుతుంది. జనవరి మొదటి వారంలో డీసీబీ ద్వారా సబ్జెక్టు నిపుణులతో అన్ని సబ్జెక్టుల పరంగా పాఠ్యాంశం ప్రకారం మెటీరియల్ తయారు చేయిస్తాం. విద్యార్థులకు రివిజన్ చేయిస్తూ పరీక్షలకు సిద్ధం చేస్తాం. సాక్షి: వార్షిక పరీక్షలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి? డీఈవో: మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ మొదటి వారం వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు పూర్తవుతాయి. అంతకు ముందే సిలబస్ పూర్తి చేసి, తరగతులు రివైజ్ చేయిస్తాం. ఫిబ్రవరిలో ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహించే అవకాశముంది. దీని ద్వారా విద్యార్థులకు మేలు చేకూరుతుంది. సాక్షి: విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మీరిచ్చే సూచనలు..? డీఈవో: జిల్లాను పదవ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపేలా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇప్పటినుంచే సిద్ధం కా వాలి. ప్రణాళిక ప్రకారం చదువుకోవాలి. విద్యార్థులను ఇంటి వద్ద తల్లిదండ్రులు చదివించాలి. ఉపా«ధ్యాయులు సైతం పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలి. సబ్జెక్టుల వారీగా తరగతులు రివైజ్డ్ చేయాలి. గత విద్యా సంవత్సరంలో జిల్లాలో 94.03 ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఈ సంవత్సరం ఉత్తీర్ణత 100 శాతం నమోదయ్యేలా అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు కృషి చేయాలి. -
ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
ఇంటర్ విద్యార్థులకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మరో నాలుగు రోజుల్లో జరగనున్న పరీక్షలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లూ దాదాపు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 47,778 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, వారి కోసం 66 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నడూ లేనివిధంగా ఈ సారి జీపీఎస్ విధానం అనుసంధానం చేశారు. దీంతో పరీక్ష తీరుతెన్నులన్నీ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు గమనించవచ్చు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. మార్చి 2 నుంచి 21 వరకు పరీక్షలు విజయనగరం అర్బన్: ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. మార్చి రెండు నుంచి జరగనున్న వార్షిక పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యూరు. పరీక్ష కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ, సాధారణ, సమస్యాత్మకం, అతి సమస్యాత్మకం పరీక్ష కేంద్రాల గుర్తింపు, నిఘా పెంపు వంటి అంశాలపై దృష్ణి సారించారు. దూరప్రాంతాల విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ఆర్టీసీ అధికారులతో చర్చించి రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. మార్చి 2 నుంచి 21 వరకు ఉదయం తొమ్మిది నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నారుు. 66 కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా 66 కేంద్రాలలో పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి 47,773 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో మొదటి సంవత్సరం విద్యార్థులు 24,062 మంది ( జనరల్: 21,705, ఒకేషనల్: 2,357 మంది) ఉన్నారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 20,455 మంది ( జనరల్: 18,808, ఒకేషనల్: 1,647 ), ప్రైవేటు విద్యార్థులు 3,256 మంది (జనరల్: 3,078. ఒకేషనల్: 178 ) ఉన్నారు. ఈ పరీక్షలు జంబ్లింగ్ విధానంలోనే జరగనున్నాయి. పక్కగా నిర్వహణ ఇంటర్ పరీక్షలను పక్కాగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. గతేడాది 68 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా అందులో ఐదింటిని రద్దు చేసి కొత్తగా మూడు కేంద్రాలను మాత్రమే ఎంపిక చేశారు. దీంతో 66 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. జీపీఎస్‌కు అనుసంధానం... పరీక్ష కేంద్రాలను జీపీఎస్‌తో అనుసంధానం చేస్తున్నారు. దీంతో పరీక్ష జరుగుతున్న తీరు, పర్యవేక్షకుల పనితీరు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించవచ్చు. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న తొమ్మిది కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. పాచిపెంట మండలం పి.కోనవలస గిరిజన కళాశాలలో నిఘా కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని ఇంటర్మీడియట్ ప్రాంతీయ తనిఖీ అధికారి విజయలక్ష్మి చెప్పారు. పరీక్ష కేంద్రాలు ప్రభుత్వ కళాశాలు-21, ఎయిడెడ్ కళాశాలలు-05, మోడల్ పాఠశాలలు-04, ఏపీఎస్‌డబ్లూఆర్ జూనియర్ కళాశాలలు-05, గిరిజన కళాశాలలు -04, ఏపీ గురుకుల కళాశాలలు-01, ప్రైవేటు అన్ అయిడెడ్ జూనియర్ కళాశాలలు-26 ఉన్నాయి. పరీక్షల నిర్వహణలో 145 మంది సిబ్బంది పాల్గొంటారు.