కర్నూలు(జిల్లా పరిషత్): జిల్లాలో ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 11వ తేదీ వరకు నిర్వహిస్తున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మాస్‌కాపీయింగ్ జరిగితే సంబంధిత అధికారులు, ఇన్విజిలేటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే సంబంధిత అధికారుల సస్పెన్షన్‌కు వెనుకాడబోమని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ హెచ్చరించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై మంగళవారం ఆయన ఆత్మకూరు తహశీల్దార్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షల్లో విద్యార్థులు మాస్‌కాపీయింగ్ చేయకుండా ఇన్విజిలేటర్లు గట్టి నిఘా ఉంచాలన్నారు.
ఏ కారణం చేతనైనా పరీక్ష కేంద్రాల్లో చిన్న సంఘటన జరిగినా, మాస్‌కాపీయింగ్ జరిగినా ఆ సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్, సంబంధిత ఇన్విజిలేటర్‌పై కఠిన చర్యలు తప్పవన్నారు. క్వాలిటీ ఎగ్జామినేషన్ కోసం అందరూ సహకరించాలన్నారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా, అనుమానాలకు తావివ్వకుండా పరీక్షలు నిర్వహించాలన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, ఫర్నిచర్, పరీక్షా సమయంల్లో విద్యుత్, అత్యవసర చికిత్సా శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలు చేయాలని, జిరాక్స్ కేంద్రాలు మూసివేయించాలని ఆదేశించారు. ప్రైవేట్ పాఠశాలల్లో మాస్‌కాపీయింగ్ జరిగినట్లు తమ దృష్టికి వస్తే ఆ పాఠశాల అనుమతి రద్దు చేయడానికి సిఫారసు చేస్తామన్నారు. సమస్యత్మాక, అత్యంత సమస్యాత్మాక పరీక్షా కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డీఈవో సుప్రకాష్‌ను ఆయన ఆదేశించారు. జిల్లా ఎస్‌పీ రవికృష్ణ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 11 పోలీస్ ప్రత్యేక స్క్వాడ్ ఏర్పాటు చేశామన్నారు. అందరు అధికారులు పరీక్షలు సాఫీగా జరిగేందుకు సహకరించాలని సూచించారు. సమావేశంలో డీఈవో సుప్రకాష్, జెడ్పీ సీఈవో ఈశ్వర్, సీపీవో ఆనంద్‌నాయక్, డీడబ్ల్యుఎంఏ పీడీ పుల్లారెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్ పీవీవీఎస్ మూర్తి, డిప్యూటీ డీఈవో శైలజ, పరీక్షల నిర్వహణాధికారి బ్రహ్మయ్య, మండల విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు.