
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను నిర్వహించేందుకు అవసరమైన అదనపు కేంద్రాల ఏర్పాటుకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం ఉన్న 2,500 కేంద్రాలకు అదనంగా మరో 2,500 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
అలాగే ఇప్పటివరకు 5.65 లక్షల మంది విద్యార్థులకు 30వేల గదుల్లో పరీక్షలు నిర్వహించగా, ఇకపై 60వేల గదులు అవసరమని అంచనా వేసింది. ఇప్పటివరకు 30 మంది విద్యార్థులు పరీక్షలు రాసిన ఒక్కో గదిలో ఇప్పుడు 10 నుంచి 15 మందిలోపే పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేయాలని డీఈవోలను విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ ఆదేశించారు. బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.