ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలో మార్చి 27వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు మొత్తం 39,601 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత విద్యా సంవత్సరంలో 247 మంది విద్యార్థులు పెరిగారు. పరీక్షలకు హాజరువుతున్న విద్యార్థుల్లో 35,304 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా, 4,297 మంది ప్రైవేటు విద్యార్థులు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది రెగ్యులర్ విద్యార్థులు 388 మంది పెరిగారు. ప్రైవేటు విద్యార్థులు 141 మంది తగ్గారు.
పాఠశాలలకు ప్రభుత్వ గుర్తింపు విషయంలో ఈ సంవత్సరం విద్యాశాఖాధికారులు ఒత్తిడి పెంచడంతో పలు ప్రైవేటు పాఠశాలలు కొత్తగా ప్రభుత్వ గుర్తింపు పొందాయి. దీంతో రెగ్యులర్ విద్యార్థుల సంఖ్య పెరిగింది. జిల్లాలో మొత్తం 777 ఉన్నత పాఠశాలలుండగా 710 పాఠశాలల నుంచి విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. 67 పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఒక్కరు కూడా లేరు. 17 వృత్తి విద్యాకోర్సులున్న పాఠశాలల నుంచి 1,337 మంది ఒకేషనల్ విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. 4 ఓఎస్‌ఎస్‌సీ పాఠశాలల నుంచి 54 మంది ఓఎస్‌ఎస్‌సీ విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. జిల్లాలో ఈ సంవత్సరం కొత్తగా 46 పాఠశాలలు ప్రభుత్వ గుర్తింపు పొందాయి. మొత్తం 24 ప్రభుత్వ, 299 జిల్లా పరిషత్, 7 మున్సిపల్, 49 ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలు, 31 కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), నాలుగు ఏపీ రెసిడెన్షియల్ హైస్కూళ్లు, 13 ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, రెండు ఏపీ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, 281 ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరు కానున్నారు.
పరీక్ష కేంద్రాలు సిద్ధం...
జిల్లాలో విద్యార్థులకు అందుబాటులో ఉండేలా మొత్తం 195 పదో తరగతి పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటిలో 173 పరీక్ష కేంద్రాలను రెగ్యులర్ విద్యార్థులకు కేటాయించగా 22 కేంద్రాలను ప్రైవేటు విద్యార్థులకు కేటాయించారు. పరీక్ష కేంద్రాల్లో 40 సీ సెంటర్లున్నాయి. 15 కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఒకేషనల్ విద్యార్థులకు 16 పరీక్ష కేంద్రాలు, ఓఎస్‌ఎస్‌సీ విద్యార్థులకు మూడు పరీక్ష కేంద్రాలు కేటాయించారు. ఈ ఏడాది కొత్తగా 4 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
అమ్మనబ్రోలు ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ (బాలికలు), సంతనూతలపాడు ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ (బాలురు), కురిచేడు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, ముండ్లమూరు జిల్లా పరిషత్ హైస్కూల్‌లో బీ కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. ఒంగోలు డీఆర్‌ఆర్‌ఎం హైస్కూల్‌లోని పరీక్ష కేంద్రాన్ని రద్దు చేశారు. పదో తరగతి మూల్యాంకన కేంద్రం (స్పాట్ వాల్యూయేషన్ సెంటర్)లో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయవద్దని ప్రభుత్వ పరీక్షల డెరైక్టర్ ఆదేశించడంతో డీఆర్‌ఆర్‌ఎం హైస్కూల్ పరీక్ష కేంద్రాన్ని రద్దు చేశారు. దాని బదులుగా స్థానిక అన్నవరప్పాడులోని శ్రీసూర్య విద్యానికేతన్‌లో కొత్తగా పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సంతమాగులూరు బాలాజీ హైస్కూల్‌లోని పరీక్ష కేంద్రాన్ని కూడా ఈ ఏడాది రద్దు చేశారు.
పదో తరగతి పరీక్షలకు 39,601 మంది
Published Fri, Feb 28 2014 2:39 AM | Last Updated on Sat, Sep 2 2017 4:10 AM
Advertisement
Advertisement