
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో పదోవ తరగతి పరీక్షలకు సంబంధించి సామాజిక మాధ్యమంలో వస్తున్న వదంతులు నమ్మవద్దని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చిన వీరభద్రుడు విజ్ఞప్తి చేశారు. రోజుకు ఒకరకంగా పదో తరగతి పరీక్షలకు సంబంధించిన ఫేక్ న్యూస్‌లను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారన్నారు. మొన్న టైమ్ టేబుల్ విషయంలో వదంతులు సృష్టించగా, నేడు ఏకంగా తన పేరును ఫోర్జరీ చేసి పరీక్ష తేదీలను ఆన్‌లైన్‌లో పెట్టారని తెలిపారు. (‘అప్పుడే పదో తరగతి పరీక్షల నిర్వహణ’)
పదవ తరగతి పరీక్షలపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇలాంటి వదంతులు సృష్టించడం సైబర్ నేరాల కిందకి వస్తోందని, అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే విద్యార్థులు మానసికంగా ఆందోళన చెందుతున్నారని వారిని ఇలా గందరగోళానికి గురిచేయడం సమంజసం కాదన్నారు. ప్రజలెవరు ఈ వదంతులు నమ్మి ఆందోళన చెందవద్దని వీరభద్రుడు కోరారు. (పరీక్షలు జరుగుతాయి.. చదువుకోండి)