ఆదిలాబాద్ జిల్లా బేల జెడ్పీహెచ్‌ఎస్ పరీక్ష కేంద్రంలో బెంచీల వద్ద పెచ్చులూడిన నేల
సాక్షి, హైదరాబాద్: మండు వేసవిలో గొంతు తడుపుకొనే అవకాశం లేదు. ముక్కు మూసుకుంటే తప్ప మరుగుదొడ్లకు వెళ్లలేని పరిస్థితి. ఎప్పుడు ఊడిపడుతుందోనన్నట్టుగా ఉన్న భవనాల పైకప్పులు. కరెంటు సౌకర్యం ఉన్నా ఫ్యాన్లు లేవు. ఉన్నా పనిచేయడం లేదు. ఇదీ ఈ నెల 23 నుంచి జూన్ 1వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు జరగనున్న అనేక కేంద్రాల దుస్థితి. ముఖ్యంగా మారుమూల పల్లెల్లో, ఓ మాదిరి పట్టణ కేంద్రాల్లో ఈ తరహా దయనీయ పరిస్థితి నెలకొని ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా 5,09,275 మంది టెన్త్ విద్యార్థులు 2,861 కేంద్రాల్లో పరీక్షలు రాయాల్సి ఉంది. హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో మౌలిక వసతులు కాస్త మెరుగ్గానే ఉన్నాయి. ప్రైవేటు స్కూల్స్ పరీక్షా కేంద్రాలు కావడంతో సౌకర్యాలు బాగానే ఉన్నాయి. కానీ జిల్లాల్లో పరిస్థితి అధ్వానంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,500 పరీక్ష కేంద్రాల్లో ఏదో ఒక సమస్య కన్పిస్తోందని క్షేత్రస్థాయి అధికారులు ఇటీవల విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
నివేదికలు కూడా పంపారు. వీటి ప్రకారం.. దాదాపు 500 పాఠశాలల్లో మరుగుదొడ్లు, మూత్రశాలలు వాడుకలోనే లేవని తెలిసింది. 400 పాఠశాలల్లో శుద్ధమైన తాగునీటి సౌకర్యం లేకపోవడాన్ని గుర్తించారు. 145 పాఠశాలల్లో విద్యుత్ సౌకర్యం అంతంత మాత్రంగానే ఉంది.
ఎక్కడ..ఎలా?
♦కరీంనగర్ పట్టణం సప్తగిరి కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆర్‌వోఆర్ ప్లాంట్ కొన్ని నెలలుగా వాడుకలో లేదు. దీన్ని మరమ్మతు చేయించకపోవడంతో మంచినీళ్లు అందే అవకాశం కన్పించడం లేదు. ఇదే స్కూల్‌లో మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకుని అధ్వానంగా ఉన్నాయి.
♦ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని 5 పరీక్ష కేంద్రాల్లో ఫ్యాన్లు పనిచేయడం లేదు. నల్లబెల్లి మండలంలో మంచినీటి కొరత ఉంది. శౌచాలయాలు ఉపయోగంలో లేవు. ఖానాపురం పాఠశాల పరీక్ష కేంద్రంలో పైకప్పు పెచ్చులూడి మీద పడే పరిస్థితి ఉంది. ఈ పరీక్ష కేంద్రాన్ని చూసి ఉపాధ్యాయులే భయపడుతున్నారు. సంగెం మండల కేంద్రంలోని పాఠశాలలో ఎనిమిది గదులుంటే నాలుగింటికి విద్యుత్ సరఫరా లేదు. ఈదుల పూసపల్లి ఒకటో వార్డులో ప్రభుత్వ పాఠశాలకు మంచినీటి వసతి అంతంత మాత్రంగానే ఉంది. మరుగుదొడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. గతంలో కూడా ఇక్కడ విద్యార్థులు ఇబ్బంది పడినా, మరోసారి కేంద్రంగా ఎంపిక చేయడం గమనార్హం. ఈ స్కూల్‌కు చెందిన పాత భవనంలో నాలుగు గదులు శిథిలావస్థలో ఉన్నాయి.
♦ఉమ్మడి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఉన్నత పాఠశాలలో 13 తరగతి గదులుంటే 8 గదులకే విద్యుత్ సౌకర్యం ఉంది. సూర్యాపేటలోని నంబర్ 2 జెడ్పీ ఉన్నత పాఠశాల కేంద్రంలో మరుగుదొడ్లు, మూత్రశాలలు లేవు. దేవరకొండ జిల్లా పరి«షత్ బాలికల ఉన్నత పాఠశాలలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది.
♦ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ పరీక్ష కేంద్రం దారుణంగా ఉంది. ఫ్లోరింగ్ పగిలిపోయి అస్తవ్యస్తంగా తయారైంది. ఫ్యాన్ల రెక్కలు వంకర తిరిగి ఉన్నాయి. బెంచీలు విరిగిపోయి ఉన్నాయి.
సమస్యలుంటే డీఈవో దృష్టికి తెండి
సమస్యలు లేని స్కూళ్లనే పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేయమని క్షేత్రస్థాయి సిబ్బందికి మొదట్లోనే ఆదేశాలిచ్చాం. అయినా అక్కడక్కడ ఏమైనా సమస్యలుంటే డీఈవోల దృష్టికి తీసుకెళ్లాలి. సాధ్యమైనంత వరకు వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించాలన్నదే మా లక్ష్యం.
– కృష్ణారావు (పరీక్షల విభాగం అదనపు డైరెక్టర్)
Comments
Please login to add a commentAdd a comment