పరీక్ష కేంద్రంలో డీఈవో, ఆర్డీవోల విచారణ
సాక్షి, హైదరాబాద్/ సాక్షి, నెట్‌వర్క్: పదో తరగతి పరీక్షల్లో భాగంగా సోమవారం జరిగిన ఇంగ్లిష్ పేప ర్–1 లీక్ వార్తలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపాయి. 2 జిల్లాల్లో పరీక్ష మొదలైన గంటకే ప్రశ్నపత్రం వాట్సాప్‌లో చక్కర్లు కొట్టింది. ఆదిలాబాద్ జిల్లాలో ఇన్విజిలేటరే ప్రశ్నపత్రాన్ని ఫొటో తీసి వాట్సాప్‌లో బయటకు పంపగా, మహబూబ్‌నగర్‌లో బయటి వ్యక్తి గోడ దూకి వచ్చి కిటికి పక్క నుంచి ప్రశ్నపత్రాన్ని ఫొటో తీసుకొని వాట్సాప్‌లో బయటకు పంపారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం తాడిహత్నూర్ జిల్లా పరిషత్ సెకండరీ స్కూల్‌లో, మహబూబ్‌నగర్ జిల్లా మరికల్‌లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో విద్యార్థుల్లో గందరగోళం నెలకొనడంతో అక్కడున్న పోలీసులు, అధికారులు అప్రమత్తమయ్యారు. పరీక్షలు పూర్తయ్యేలోపు బాధ్యులైన వారిని అదుపులోకి తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు పాఠశాల విద్యా కమిషనర్ కిషన్ వెల్లడించారు. శాఖాపరంగా కూడా చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి ఎలాంటి జవాబులు పరీక్షల హాల్లోకి వెళ్లలేదని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల హస్తం ఉన్నట్లు ప్రాథమికంగా తేలిందని, వారితోపాటు వారి పాఠశాలలపైనా చర్యలు చేపడతామన్నారు.
గుర్తించిందిలా..
విషయం తెలుసుకున్న ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించి వివరాలు తెలపాలని ఉట్నూర్ ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి, డీఈవో జనార్దన్‌రావులను ఆదేశించారు. దీంతో అక్కడికి వెళ్లిన అధికారులు పరీక్ష కేంద్రంలో పేపర్ లీకైనట్లు నిర్ధారించారు. ప్రశ్నపత్రం కింద విద్యార్థి హాల్‌టికెట్ నంబర్‌తో పాటు ఫొటోలో ఇన్విజిలేటర్ చీరను బట్టి అదే గదిలో పేపర్ లీకైనట్లు ఉన్నతాధికారులు గుర్తించారు.
ఆదిలాబాద్‌లో నలుగురి సస్పెన్షన్
ప్రశ్నపత్రం బయటకు పంపిన వ్యవహారంలో ఆదిలాబాద్‌లో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్, అడిషనల్ డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్, సదరు ఇన్విజిలేటర్‌ను సస్పెండ్ చేసినట్లు కిషన్ తెలిపారు. మహబూబ్‌నగర్‌లోని పరీక్ష కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న అందరినీ పరీక్ష విధుల నుంచి రిలీవ్ చేసినట్లు వెల్లడించారు. రెండు ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు, ఓ యువకుడిని అరెస్ట్ చేశారు. మరికల్ లోని ప్రైవేట్ పాఠశాలలైన గౌతమి పాఠశాల, ప్రతిభ పాఠశాల బాధ్యులు కాపీయింగ్‌ను ప్రోత్సహించడంలో భాగంగా ఈ ఘటనకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు డీఈఓ సోమిరెడ్డి వెల్లడించారు. అలాగే పరీక్ష విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సూర్యాపేట జిల్లా నూతన్‌కల్ జిల్లా పరిషత్ హైస్కూల్లో ఒక ఇన్విజిలేటర్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
పరీక్ష రద్దు కాదు..
పరీక్ష ప్రారంభానికి ముందు బయటకొస్తే లీక్ అంటామని, 2 జిల్లాల్లో జరిగిన ఘటనలు మాల్‌ప్రాక్టీస్ కిందకే వస్తాయని తెలిపారు. మాల్‌ప్రాక్టీస్ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం 407 సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, రానున్న సంవత్సరాల్లో అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం జవాబులేవీ పరీక్ష హాల్లోని విద్యార్థులకు చేరలేదని, 2 కేంద్రాలకు సంబంధిం చిన సంఘటనలు మాత్రమే కావడంతో ఈ పరీక్షను రద్దు చేసేది లేదని స్పష్టం చేశారు. పరీక్ష కంటే ముందుగా లీక్ అయితే ఆ పరిస్థితి ఉండేదన్నారు. ఇక 20న జరగాల్సిన ఇంగ్లిష్ పేపర్–2 పరీక్ష యథావిధిగా కొనసాగుతుందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment