రోష్నీ, మధ్యప్రదేశ్ టెన్త్ ర్యాంకర్ (ఎనిమిదో స్థానం)
రవంత పిల్ల ర్యాంకర్ అయింది! ఆ సైకిల్ మీద వెళ్లొచ్చే అమ్మాయేనా! మన పురుషోత్తం కూతురు కదా. ప్రెస్సోళ్లు కూడా వచ్చిపోతున్నారు. ఊరికి ఎప్పుడూ ఇంత పేరు లేదు. ఊళ్లోవాళ్లంతా కూడలికి చేరారు. ఊరి నోరంతా తీపి చేశారు. ఒక తునక రోష్నీ నోటికీ అందించారు.
మధ్యప్రదేశ్, భింద్ జిల్లాలోని అజ్నోల్ గ్రామంలో అంతా కలిపి 1200 మంది వరకు ఉంటారు. శనివారం సాయంత్రం ఆ ఊరికి ఉన్న ఒకే ఒక కూడలిలో గ్రామస్థులలోని కొందరు.. పనుల మధ్యలో తమ దుకాణాల బయటికి వచ్చి, ఒక కుర్రాడి చేతిలో ఉన్న స్వీట్ బాక్సులోని తమ వంతు లడ్డూలు తీసుకున్నారు. అందరికి కన్నా ఎక్కువ లడ్డూలు తిన్నది రోష్నీ. తీసుకున్న లడ్డూలోంచి ప్రతి ఒక్కరూ చిన్న తునక తీసి మొదట రోష్నీకి పెట్టి తర్వాత తాము తిన్నారు మరి. ఆమె ఇక చాలంటున్నా, గ్రామానికి ఆమె సాధించిన పెట్టిన గొప్ప ప్రతిష్టను వారంతా దాదాపు ఒక ఉత్సవంగా జరుపుకున్నారు. ఆ మధ్యాహ్నమే వచ్చిన టెన్త్ ఫలితాలలో 98.5 శాతం మార్కులు సంపాదించి, స్టేట్‌లోనే 8 వ ర్యాంకులో నిలబడింది రోష్నీ. ఆమె నిలబడటం కాదు. ఊరిని నిలబెట్టింది. అజ్నోల్‌లోనే కాదు, భింద్ జిల్లాలో కూడా ఏ ఆడపిల్లా ఇప్పటి వరకు ఇంతటి ఘనతను స్కూల్ నుంచి మోసుకురాలేదు.
రోష్నీకి మేథ్స్‌లో, సైన్స్‌లో వందకు వంద మార్కులు వచ్చాయి! స్వీట్లు పంచిన కుర్రాడు రోష్నీ అన్న. ఇంటర్ చదువుతున్నాడు. పక్కనే రోష్నీ తమ్ముడూ ఉన్నాడు. అతడు నాలుగో తరగతి. గ్రామస్థులంతా మెచ్చుకుంటూ ఉంటే తమ ముగ్గురు పిల్లల్ని చూసుకుని మురిసిపోయారు రోష్నీ తండ్రి పురుషోత్తం, తల్లి సరితాదేవి. నిజానికిది భింద్ జిల్లా మొత్తం మురిసిపోవలసిన సందర్భం. ఆ జిల్లాలో ఒక్కేడాదైనా ‘బాలికలే ముందంజ’ అనే మాట వినిపించలేదు. జనాభా నిష్పత్తిలోనూ ఆడవాళ్లు తక్కువ ఉన్న జిల్లా భింద్. 2011 లెక్కల ప్రకారం బాలురు వెయ్యిమంది ఉంటే బాలికలు 837 మందే ఉన్నారు. మహిళల్లో అక్షరాస్యత 64 శాతం మాత్రమే. రోష్ని తల్లి సరితాదేవి ఇంటర్ వరకు చదివారు.
ఆమె చదువుకునే రోజుల్లోనైతే ఈ శాతం 55 మాత్రమే. ఆడపిల్లలు మధ్యలోనే బడి మానవలసిన పరిస్థితులు అత్యధికంగా ఉన్న భింద్ జిల్లాలో రోష్నీ విజయం ఇక ముందు స్ఫూర్తిగా పనిచేయవచ్చు. అయితే రోష్నీని మరొకందుకు కూడా.. ఊరు, జిల్లా, రాష్ట్రం, దేశం కూడా ప్రేరణగా తీసుకోవాలి. ఆ అమ్మాయి చదువు అంత తేలిగ్గా ఏమీ సాగలేదు. రోష్నీ వాళ్లండే అజ్నోల్ గ్రామం నుంచి ఆమె స్కూల్ ఉన్న మెగావ్ గ్రామం 12 కి.మీ.లు. రానూపోను 24 కి.మీ. రోజూ సైకిల్ మీద స్కూల్‌కి వెళ్లొచ్చేది. ఎర్రటి ఎండల్లో, ఎడతెరిపి లేని వానల్లో కూడా ఏ రోజూ రోష్నీ స్కూలు మానలేదు. వరదల్లో దారి మూసుకుపోయినప్పుడు మోగావ్‌లోని చుట్టాల ఇంట్లో ఉండి స్కూలుకు వెళ్లొచ్చింది.
ఇంటికి రాకుండా మెగావ్‌లోనే ఉండిపోయిన రోజులూ ఉన్నాయి. గ్రామాల్లో ఇది మామూలే అయినా.. ఎండకు, వానకు, గడువు తేదీలోపు ఫీజు కట్టలేని పరిస్థితులకు, స్కూలుకు వెళ్లలేని శారీరక అననుకూలతలకు చదువును వదిలేయకపోవడం మామూలు సంగతైతే కాదు. రాక్షసిలా చదువును పట్టేసుకుంది రోష్నీ. ఆ రాక్షసి ఇప్పుడు రోష్నీని పట్టేసుకుంది. ఐ.ఎ.ఎస్. చదువుతాను అంటోంది రోష్నీ. కలెక్టర్ అవాలని తను చిన్నప్పుడే నిర్ణయించుకుంది. ఎవరో చెప్పారట.. కలెక్టర్ అయితే పేద వాళ్లందరికీ మంచి చెయ్యొచ్చని. ఇంటర్‌లో మేథ్స్ తీసుకోబోతోంది. మెగావ్‌లో కాలేజ్ కూడా ఉంది. రోష్నీని రోజూ మేమే కాలేజ్ దగ్గర దింపి వస్తాం అని బంధువులు ఇప్పటినుంచే పోటీలు పడి మాట ఇస్తున్నారు. రోష్నీ తండ్రి రైతు. నాలుగెకరాల పొలం ఉంది. పొలంతోనే కుటుంబ పోషణ. రోష్నీకి ర్యాంకు రావడంతో ఆయనకు పట్టలేనంత సంతోషంగా ఉంది. ఊరి మొత్తం మీద ఇప్పుడాయన ప్రయోజకుడైన తండ్రి! ‘‘నా ముగ్గురు పిల్లల చదువుల గురించి గర్వంగా చెప్పుకోగలను. రోష్నీ ఇప్పుడు ఊరికే గర్వ కారణం అయింది’’ అంటున్నారు ఆయన. ‘‘నా కూతురు పెద్ద డిగ్రీలు చదవాలి. పెద్ద కంపెనీల్లో పని చేయాలి. పెద్ద నగరాలలో తిరగాలి’’ అని కూడా.
Comments
Please login to add a commentAdd a comment