
సాక్షి, హైదరాబాద్: పరీక్షల నిర్వహణలో గతేడాది జరిగిన తప్పులు పునరావృతం కావద్దని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ స్పష్టంచేశారు. మార్చి, ఏప్రిల్‌ల్లో జరగనున్న ఇంటర్, టెన్త్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. సోమవారం ఆయన బీఆర్‌కేఆర్ భవన్‌లో పదో తరగతి పరీక్షల నిర్వహణపై విద్యాశాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు.
జవాబు పత్రాల మూల్యాంకనంలో పాల్గొనే ప్రతి ఉపాధ్యాయుడికి అవసరమైన శిక్షణను ఇవ్వాలని సూచించారు. విద్యార్థుల కోసం ఆన్‌లైన్ గ్రీవెన్స్ రిడ్రెసెల్ సిస్టమ్ ప్రారంభిస్తామని తెలిపారు. ఇంటర్ పరీక్షలు మార్చి 4 నుంచి 23 వరకు, టెన్త్ పరీక్షలు మార్చి 19 నుంచి ఏప్రిల్ 6 వరకు జరుగుతాయన్నారు. ఇంటర్ పరీక్షలకు 9.65 లక్షల మంది విద్యార్థులు, పదో తరగతి పరీక్షలకు 5.08 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారని, సెంటర్ల ఏర్పాటు, జంబ్లింగ్ పద్ధతి, హాల్ టికెట్ల జారీ, ఫలితాల వెల్లడి ప్రక్రియలను అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించారు.