పది ఫలితాలపై నజర్‌ | education officials concentration on 10th result | Sakshi
Sakshi News home page

పది ఫలితాలపై నజర్‌

Published Mon, Feb 5 2018 1:33 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

education officials concentration on 10th result - Sakshi

విద్యారణ్యపురి: ఈ ఏడాది పదో తరగతి ఫలితాలపై జిల్లా విద్యాశాఖాధికారి ప్రత్యేక దృష్టి సారించారు.  పదిలో ‘ఫస్ట్‌’ వచ్చేలా ప్రయత్నం చేయాలని ఇప్పటికే రెండు జిల్లాల ఎంఈఓ, హెచ్‌ఎంలను ఆదేశించారు. మార్చి 15 నుంచి 30 వరకు టెన్త్‌ వార్షిక పరీక్షలు జరుగనున్నాయి. ఇప్పటికే రెండు జిల్లాల్లోనూ ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో టెన్త్‌ విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. పాఠశాల విధులకు ముందు ఒక గంట, సాయంత్రం పాఠశాల విధులు ముగిసాక  మరొక గంట ప్రత్యేక తరగతులు జరుగుతున్నాయి. ఈ ప్రత్యేక తరగతుల్లో ఆయా సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయులు వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. నూరుశాతం ఫలితాలు సాధించడంతోపాటు 10/10 జీపీఏ కూడా విద్యార్థులు సాధించేలా వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించేలా ఇప్పటికే 40 రోజుల ప్రణాళికను రూపొందించి అమలుచేస్తున్నారు.

ప్రత్యేక తరగతులపై అబ్జర్వేషన్‌ కమిటీలు 
వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 149 ప్రభుత్వ, జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో 5,436మంది విద్యార్థులు టెన్త్‌ పరీక్షలు రాయనునున్నారు. వీరికి ప్రత్యేక తరగతులు సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అని పరిశీలించేందుకు తాజాగా అబ్జర్వేషన్‌ కమిటీలను నియమించారు. హన్మకొండలోని ప్రభుత్వ డైట్‌ కళాశాలనుంచి ముగ్గురు లెక్చరర్లు, డీఈఓ కార్యాలయంలోని ఇద్దరు సెక్టోరియల్‌ ఆఫీసర్లతో కమిటీలను ఏర్పాటు చేశారు. రూరల్‌ జిల్లాలోనూ 131ప్రభుత్వ, జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో కలిపి  5,036మంది విద్యార్థులు టెన్త్‌ పరీక్షలను రాయబోతున్నారు. ఇక్కడ కూడా ఐదుగురు సీనియర్‌ హెచ్‌ఎంలు, ఒక సెక్టోరియల్‌ ఆఫీసర్‌తో కలిపి ఆరు బృందాలుగా ఏర్పాటు చేశారు. అంతేగాకుండా ఎంఈఓలు, స్కూల్‌కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలు కూడా పర్యవేక్షించనున్నారు.   

కమిటీల పని ఇదే..
కమిటీలు జనవరి నెల 27 నుంచి ఉన్నత పాఠశాలలను రోజువారిగా సందర్శిస్తున్నాయి. సిలబస్‌ను సబ్జెక్టులవారీగా పూర్తి చేశారా.. లేదా ఇటీవల జరిగిన సమ్మీటివ్‌–1 పరీక్ష జవాబు పత్రాలు వాల్యుయేషన్‌ చేశారా లేదా అనేది పరిశీలిస్తున్నారు. విద్యార్థుల ఫలితాలను బట్టి వెనుకబడిన విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. క్లాస్‌ టీచర్లు, తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారు. ఏమైనా లోటుపాటు ఉంటే సరిదిద్దుతున్నారు. ఇలా తదితర అంశాలను పరిశీలించి ఓ ప్రొఫార్మా తయారు చేసి డీఈఓకు సమర్పించబోతున్నారు.  

స్నాక్స్‌ నిధులకోసం ప్రతిపాదనలు 
పదో తరగతి విద్యార్థులకు ఉదయం 8.30గంటల నుంచి 9.30 గంటలవరకు, సాయంత్రం 4.45 గంటల నుంచి 5.45 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో విద్యార్థులు నీరసించకుండా ఉండేందుకు స్నాక్స్‌ అందజేస్తే బాగుంటుందని హెచ్‌ఎంలు విద్యాశాఖాధికారుల దృష్టికి తీసుకొచ్చారు. డీఈఓ జిల్లా కలెక్టర్‌ అమ్రపాలి దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్‌ స్పందించి ఎంతమంది విద్యార్థులు ఉన్నారు. నిధులు ఎన్ని వెచ్చించాలో ప్రతిపాదించాలని ఆదేశించారు. ఈ మేరకు డీఈఓ నారాయణరెడ్డి రోజుకు ఒక్కో విద్యార్థికి రూ.5 చొప్పున వెచ్చించేలా 38 రోజులు(జనవరి 27 నుంచి మార్చి 14 వరకు) నిధులు కావాలని ప్రతిపాదించారు. అర్బన్‌ జిల్లాలో 5436 విద్యార్థులకు గాను రూ.10.32లక్షల నిధులు అవసరమని, రూరల్‌ జిల్లాలో 5,036 విద్యార్థులకు రూ 9.56 లక్షల నిధులు అవసరమని డీఈఓ కలెక్టర్‌కు ప్రతిపాదించారు. స్నాక్స్‌ కోసం నిధులు మంజూరవుతాయో.. లేదనేది రెండు మూడురోజుల్లో తెలిసిపోనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement