AP EAMCET 2021 Live Updates: AP EAPCET Results Released - Sakshi
Sakshi News home page

AP EAPCET 2021: ఏపీ ఈఏపీ సెట్‌: టాప్‌ టెన్‌.. అబ్బాయిలే

Published Wed, Sep 8 2021 10:32 AM | Last Updated on Thu, Sep 9 2021 6:40 PM

Ap: Eapcet Results Released On 8 September 2021 - Sakshi

ఫలితాలు విడుదల చేస్తున్న మంత్రి సురేష్‌. చిత్రంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌ చంద్ర, ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ చైర్మన్‌ వి. ఈశ్వరయ్య ఉన్నత విద్యామండలి చైర్మన్‌ హేమచంద్రారెడ్డి, సెట్స్‌ ప్రత్యేకాధికారి ఎం. సుధీర్‌ రెడ్డి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీ సెట్‌–2021 ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్ష ఫలితాల్లో 80.62 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. తొలి పది ర్యాంకులను బాలురు కైవసం చేసుకోవడం విశేషం. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ బుధవారం విజయవాడలోని ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహంలో ఇంజనీరింగ్‌ విభాగానికి సంబంధించి ర్యాంకులను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గురువారం నుంచి వెబ్‌సైట్‌లో ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. 26వ తేదీ నుంచి అభ్యర్థులకు రెస్పాన్స్‌ షీట్లు అందుబాటులో ఉంటాయన్నారు.

ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌కు 1,76,586 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా.. 1,66,460 పరీక్షకు హాజరయ్యారని, వీరిలో 1,34,205 మంది ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు. ఇందులో బాలురు 79,221 మంది కాగా.. బాలికలు 54,984 మంది ఉన్నారు. గత ఏదితో పోలిస్తే అదనంగా వెయ్యి మంది అభ్యర్థులు అర్హత సాధించినట్టు వివరించారు. ఈ నెల 14వ తేదీన అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్‌ ఫలితాలను ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. కోవిడ్‌ నిబంధనల్ని పాటిస్తూ పూర్తి పారదర్శకంగా ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీలో 120, తెలంగాణలో 3 కేంద్రాల్లో 15 సెషన్లలో ‘ఏపీ ఈఏపీసెట్‌–2021’ పరీక్షలను కాకినాడ జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో నిర్వహించామన్నారు.

ఏపీ ఈఏపీసెట్‌ (ఎంసెట్‌) 2021 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

కోవిడ్‌ సోకడంతో పరీక్షకు హాజరు కాని విద్యార్థులకు తిరిగి పరీక్ష నిర్వహించి ర్యాంకు కార్డులు అందజేస్తామని మంత్రి చెప్పారు. పరీక్షకు హాజరైన 18,547 మంది ఎస్సీ, 3,455 మంది ఎస్టీ విద్యార్థులు నూరు శాతం అర్హత సాధించినట్టు వివరించారు. రెండు నెలల రికార్డు సమయంలో ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా ఏపీ ఈఏపీసెట్‌–2021ను నిర్వహించిన కాకినాడ జేఎన్‌టీయూ వర్సిటీ అధికారులను మంత్రి అభినందించారు.

ఎంసెట్‌ స్థానంలో ఈఏపీ సెట్‌
రాష్ట్రంలో ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులకు గతంలో ఏపీ ఎంసెట్‌ పేరుతో ప్రవేశ పరీక్ష నిర్వహించేవారు. అయితే, మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో ‘నీట్‌’ ప్రవేశపెట్టిన నేపథ్యంలో మెడికల్‌ విభాగాన్ని ఎంసెట్‌ నుంచి మినహాయించారు. ఈ క్రమంలో ఏపీ ఎంసెట్‌ను ఏపీ ఈఏపీసెట్‌ (ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) పేరుతో కొనసాగిస్తున్నారు. ఆగస్టు 19, 20, 23, 24, 25 తేదీల్లో ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌కు, సెప్టెంబర్‌ 3, 6, 7 తేదీల్లో అగ్రికల్చర్‌/ఫార్మసీ స్ట్రీమ్‌కు పరీక్షలు (ఇంగ్లిషు, తెలుగు భాషల్లో) నిర్వహించారు. 160 మార్కులకు కంప్యూట్‌ బేస్ట్‌ టెస్ట్‌ నిర్వహించిన అనంతరం ఫైనల్‌ కీ విడుదల చేసి ప్రత్యేక వెబ్‌సైట్‌ ద్వారా విద్యార్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించారు. నిపుణులతో వెరిఫికేషన్‌ కమిటీ నియమించి విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసి, పారదర్శకంగా మూల్యాంకనం చేసి ఫలితాలు విడుదల చేశారు.

విద్యను వ్యాపారం కానివ్వం
గత ప్రభుత్వం విద్యను వ్యాపారంగా చేయడంతో చాలా మంది నిరుపేద విద్యార్థులకు సాంకేతిక విద్య దూరమైందని మంత్రి ఆదిమూలపు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్‌ దృష్ట్యా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాంకేతిక విద్య అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. అర్హత సాధించిన పేద పిల్లలకు కూడా ప్రైవేట్‌ వర్సిటీలు, కార్పొరేట్‌ కళాశాలల్లో 35 శాతం సీట్లు కేటాయించేలా కేబినెట్‌లో ఆమోదించి ఆర్డినెన్స్‌ తీసుకొచ్చినట్టు గుర్తు చేశారు. ఈ కళాశాలల్లో చదివే విద్యార్థులకు నూరు శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం అందిస్తోందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు కళాశాలలు జవాబుదారీగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద నేరుగా తల్లుల ఖాతాల్లోనే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తాన్ని జమ చేస్తోందన్నారు. గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.2 వేల కోట్లను కూడా తమ ప్రభుత్వం చెల్లించినట్టు వివరించారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అంశాన్ని  కోర్టు దృష్టికి తీసుకెళ్తాం
విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ జమ చేయడంపై కోర్టు స్టే విధించిందని మంత్రి తెలిపారు. తల్లుల ఖాతాల్లో ఆ మొత్తాలను జమ చేయడం వల్ల ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో మౌలిక వసతులు, ల్యాబ్‌లు, బోధనా సిబ్బంది తదితర అంశాలను తల్లిదండ్రులు తెలుసుకుని తమ పిల్లలను చేర్పించే అవకాశం ఏర్పడిందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పొందిన వారిలో ఒకరిద్దరు తల్లులు పొరపాటున లేదా మరే కారణం వల్ల కళాశాలలకు ఫీజులు చెల్లించి ఉండకపోవచ్చన్నారు. ఎవరూ ఉద్దేశపూర్వకంగా తమ పిల్లల భవిష్యత్‌ను పాడుచేసుకోవాలనుకోరని పేర్కొన్నారు.

ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. గతంలో ప్రైవేట్‌ వర్సిటీల్లో మేనేజ్‌మెంట్‌ కోటా, ఎన్‌ఆర్‌ఐ కోటాలో సీట్ల కేటాయింపు మెరిట్‌ చూడకుండా, పారదర్శకత పాటించకుండా పూర్తి వ్యాపార ధోరణితో కేటాయించే పరిస్థితి ఉండేదన్నారు. బీ–కేటగిరీ కింద ఈ ఏడాది నుంచి 70 శాతం ‘ఏపీ ఈఏపీసెట్‌’ ద్వారా, మిగిలిన 30 శాతంలో 15 శాతం ఎన్‌ఆర్‌ఐ కోటా, మిగిలిన 15 శాతం రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ప్రకారం స్థానిక, స్థానికేతర కోటాలో భర్తీ చేస్తామన్నారు. ఇంటర్మీడియెట్‌లో గత ఏడాది నుంచి ఆన్‌లైన్‌లో ప్రవేశాలు తీసుకొచ్చామన్నారు. దీనివల్ల పేద విద్యార్థులు తమకు కావలసిన కాలేజీలను ఎంపిక చేసుకునే అవకాశం కలిగిందని, ఎస్సీ, ఎస్టీ, బీసీలు 79 శాతం కళాశాలల్లో ప్రవేశాలు పొందారని వివరించారు. ఆన్‌లైన్‌ ప్రవేశాలపై కోర్టు స్టే విధిస్తూ.. తల్లిదండ్రలకు అవగాహన కల్పించి విసృత ప్రచారం కల్పించాలని సూచిందన్నారు. 

పేదలకు సైతం కార్పొరేట్‌ విద్య
ఏపీ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మోనిటరింగ్‌ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఫీజుల నియంత్రణకు కమిటీ లేకపోవడం వల్లే ప్రైవేట్‌ వర్సిటీలు ఇష్టానుసారంగా దండుకున్నాయన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పేదలకు సైతం కార్పొరేట్‌ విద్యను అందించే మహాయజ్ఞం చేపట్టారని కొనియాడారు. కార్యక్రమంలో ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్చంద్ర, ఏపీ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి, స్పెషల్‌ ఆఫీసర్‌ సెట్స్‌ డాక్టర్‌ ఎం.సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఐఐటీలో సీటు సాధించడమే లక్ష్యం: శ్రీనిఖిల్‌
ఇంజనీరింగ్‌లో మొదటి ర్యాంక్‌ సాధించిన అనంతపురం జిల్లా పరిగి మండలం కొడిగెనహళ్లికి చెందిన కోయి శ్రీనిఖిల్‌ 160 మార్కులకు గాను 158.3400 మార్కులు సాధించాడు. శ్రీనిఖిల్‌ తండ్రి వెంకటేశ్వరరావు కొడిగెనహళ్లిలోని ప్రభుత్వ దివ్యాంగుల ఆశ్రమ పాఠశాలలో, తల్లి సుజాత హిందూపురంలోని నేతాజీ మునిసిపల్‌ హైస్కూల్‌లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. శ్రీనిఖిల్‌ మాట్లాడుతూ.. ఐఐటీలో సీటు సంపాదించే లక్ష్యంతో ప్రిపరేషన్‌ కొనసాగిస్తున్నానని చెప్పాడు. ఇంజనీరింగ్‌లో ఉన్నత శిఖరాలకు అధిరోహించడమే తన లక్ష్యమని వెల్లడించాడు. 

నా లక్ష్యం సివిల్స్‌: మహంత నాయుడు
ఇంజనీరింగ్‌ విభాగంలో రెండో ర్యాంకు సాధించిన శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన వారాడ మహంతనాయుడు 160 మార్కులకు గాను 156 మార్కులు సాధించాడు. అతడి తల్లిదండ్రులు త్రివేణి, రామారావు ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. మహంత నాయుడు మాట్లాడుతూ.. తాను జేఈఈ అడ్వాన్స్‌లో మంచి ర్యాంక్‌ పొంది ఐఐటీ ముంబైలో చేరి సివిల్స్‌ సాధించడమే లక్ష్యమని తెలిపారు. 

చదవండి: దక్షిణ భారతదేశ ఉత్తమ విద్యా సంస్థగా ఏపీ నిట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement