కాపీరైట్? | copyright! | Sakshi
Sakshi News home page

కాపీరైట్?

Published Wed, Mar 25 2015 11:54 PM | Last Updated on Sat, Sep 2 2017 11:22 PM

కాపీరైట్?

కాపీరైట్?

పెట్టరా సులువైనా దారిలోనా..’ అన్న శివ సినిమాలోని పాట బీహార్‌కు కూడా పాకినట్టుంది. ఏకంగా తల్లిదండ్రులే మా దారి రహదారి అంటూ టెన్త్ పరీక్షలు....

‘పెట్టరా సులువైనా దారిలోనా..’ అన్న శివ సినిమాలోని పాట బీహార్‌కు కూడా పాకినట్టుంది. ఏకంగా తల్లిదండ్రులే మా దారి రహదారి అంటూ టెన్త్ పరీక్షలు రాస్తున్న తమ పిల్లల కోసం చిట్టీలు మోసుకొచ్చారు. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఈ దృశ్యంపై.. క్యాంపస్ కబుర్లలో మాదాపూర్‌లో వెంకటేశ్వర ఫైనార్ట్స్ కాలేజ్ విద్యార్ధులు స్పందించారు. కాపీ రైటింగ్ రాంగ్ అన్న స్టూడెంట్స్.. కాపీ రాస్తున్న విద్యార్థులది కాదు.. అందుకు ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులదే అసలు తప్పని అంటున్నారు. బీహార్ ఒక్కచోటే కాదు.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ మాస్‌కాపీయింగ్ జోరుగా సాగుతోందని చెబుతున్నారు.
 
మణిదీప్: ఈ మధ్యనే యూట్యూబ్‌లో బీహార్ ఎగ్జామ్ సెంటర్ ఫొటో చూసి చాలా షాకయ్యా. సోషల్ మీడియాలో ఈ ఫొటో చాలా హల్‌చల్ చేస్తోందని తెలిసాక కొంచెం సిగ్గు పడ్డా. మన సంగతి పక్కనపెడితే పొరుగు దేశాల వాళ్లు ఈ చిత్రం చూసి ఓహో... ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇలా ఉంటుందా? అని అనుకుంటారు.
చందు: మాది కూడా సేమ్ ఫీలింగ్. మరీ ఘోరంగా పేరెంట్స్ చీటీలు ఇవ్వడమేమిటో? తాడు సాయంతో ఐదంతస్తులు ఎక్కి మరీ!   
నందు: అలాంటి సాహసకృత్యాలు పిల్లలు చేస్తే క్రీడల్లో కప్పులు కొట్టుకోవచ్చు.
అనన్య: ఇట్స్ టూ బ్యాడ్. బేసిక్‌గా బీహార్‌లో ఎడ్యుకేషన్ తక్కువ. అక్కడ చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంటుంది. ఒక ఎగ్జామ్ సెంటర్‌కి అంతమంది పేరెంట్స్ వచ్చి, పిల్లలకి కాపీలు అందివ్వడమంటే ఇది అక్కడి ప్రభుత్వం ఫెయిల్యూర్. దీనికి ఉపాధ్యాయులు కూడా బాధ్యత వహించాలి.
టీనా: పిల్లలతోనైనా, పేరెంట్స్‌తోనైనా ఇలాంటి తప్పు పని చేయించడం వెనుక ఉన్నది ‘ప్రెజర్’. మా బాబుకి 90 మార్కులు రావాలి, మా బాబుకి 98 మార్కులు రావాలని కోరుకునే పేరెంట్స్ ఉన్నారు అందులో. ఏదో నాలుగు మార్కులు వచ్చి పాసైతే చాలనే పేరెంట్సూ ఉన్నారు. కానీ మనిషిని బతికించేది మార్కులు కాదు, మంచి ప్రవర్తనేనని తెలుసుకోకపోవడం వల్లే ఇలాంటి తప్పులన్నీ జరుగుతాయి. అక్కడ స్టూడెంట్స్‌కి, పేరెంట్స్‌కి కౌన్సెలింగ్ చేయాల్సిన అవసరం ఉంది.
మనోజ్: స్టూడెంట్స్ కాపీ కొట్టడం సాధారణ విషయమే. కానీ తల్లిదండ్రులే కాపీలకు సహకరించడమంటే... పిల్లల జీవితాలు మొగ్గలోనే తుంచేయడమే.
వంశీ: మాస్ కాపీయింగ్ కచ్చితంగా తప్పే. పేరెంట్స్, కొన్ని చోట్ల కాలేజీల సహకారం ఉందన్నది అందరూ నమ్మాల్సిన విషయం. మార్కులు కోసం పేరెంట్స్... ర్యాంకుల కోసం కాలేజ్ యాజమాన్యాలు ఇలా తప్పుదోవలో ప్రయాణించడం మన దేశంలో చాలా సాధారణ విషయం.
స్నేహ: ఒక్క బీహార్‌లోనే కాదు, చాలా చోట్ల నిర్లక్షరాస్యులైన తల్లిదండ్రులు తమ పిల్లల చదువు కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతుంటారు. దానికి మంచి మార్గాలని ఎంచుకుంటున్నారు. చెడు మార్గాలనూ ఎంచుకుంటున్నారు. బీహార్‌లో మనం చూసిన తల్లిదండ్రులు రెండో మార్గంలో వెళుతున్నారు.
ప్రకాష్: స్కూల్ డేస్‌లో స్టూడెంట్స్ కాపీ కొట్టడం చాలా సహజం. కానీ నాకు తెలిసి పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అప్పుడు లెక్చరర్స్ దగ్గరుండి చీటీలు అందిస్తున్న సందర్భాల గురించి విన్నాను. దీనంతటికీ కారణం... టార్గెట్‌లు.
మహమ్మద్ షకీర్: బీహార్‌లో ఎగ్జామ్ సెంటర్ పిక్చర్ చూసి ‘ఇండియా పరువు పోయిందిరా బాబూ’ అనుకున్నాను. ఎక్కడ చూసినా ఇదే డిస్కషన్. అయినా ఆ సీన్‌ని టీవీలో చూపించడం.. ఇంకా బాధాకరం. ఎదురుగుండా స్టూడెంట్స్, పేరెంట్స్ అలాంటి పనులు చేస్తుంటే టీచర్లు ఏం చేస్తున్నారో అర్థం కాలేదు.
కుంజిన్: బీహార్‌లో మనం చూసిన పిక్చర్... దేశంలోని ప్రతి ప్రాంతంలో కనిపిస్తుంది. కాకపోతే వాటి న్యూస్ బయటకు రాలేదు. బీహార్ న్యూస్ బయటకు వచ్చింది. అదే తేడా.  
రూప: సర్లేండి... జరిగిందేదో జరిగిపోయింది. ఈ న్యూస్‌కి వచ్చిన స్పందనను బట్టి అయినా స్టూడెంట్స్, పేరెంట్స్ ఆలోచించే విధానంలో మార్పు రావాలని కోరుకుందాం. అన్నిటికీ మార్కులు ఒక్కటే కాదు. మంచి బిహేవియర్ అలవర్చడంలో పేరెంట్స్ ఇంట్రస్ట్ చూపిస్తే బాగుంటుంది.
మన్విత: మీరు చెప్పే మాటలు ఎలా ఉన్నా, నాకు ఆ పిక్చర్ చూసినప్పుడు నాలుగో అంతస్తు కిటికీ ఊచలు పట్టుకుని వేలాడుతున్న పేరెంట్ గనక కింద పడిపోతే అతని పిల్లల పరిస్థితి ఏంటని పించింది.
మనోజ్: అవును నిజమే. పిల్లల కోసం చాలా పెద్ద పెద్ద ఫీట్స్ చేశారు. ఒక తాడు సాయంతో పై అంతస్తు వరకు ఎక్కిన సీన్ చూస్తే నాకు చాలా భయం వేసింది.
గోవింద: ఆ కష్టమేదో పిల్లల్ని రోజూ సాయంత్రంపూట ఒక అరగంట చదివించడంపై పెడితే సరిపోయేది కదా. ఇకపై అయినా ఇలాంటి చిత్రాలు మనకంట పడే పరిస్థితి రాకూడదని కోరుకుందాం.
 భువనేశ్వరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement