జూన్‌ 8 నుంచి టెన్త్‌ పరీక్షలు! | Telangana High Court Green Signal For Conducting Tenth Exams | Sakshi
Sakshi News home page

జూన్‌ 8 నుంచి టెన్త్‌ పరీక్షలు!

Published Wed, May 20 2020 3:26 AM | Last Updated on Wed, May 20 2020 11:55 AM

Telangana High Court Green Signal For Conducting Tenth Exams - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పదో తరగతి పరీక్షల నిర్వహణకు రాష్ట్ర హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. జూన్‌ 8 నుంచి పరీక్షలు నిర్వహించుకోవచ్చని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. పరీక్షల నిర్వహణపై గతంలో విధించిన స్టేను ఎత్తివేసింది. ఒక పరీక్ష నిర్వహించిన తర్వాత మరో పరీక్షకు రెండు రోజుల వ్యవధి ఉండాలంది. పరీక్ష నిర్వహించిన తర్వాత పరీక్ష కేంద్రాలను, భవనాలను క్రిమి సంహారకాలతో శుభ్రం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

చిన్న పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను, పరీక్షలు నిర్వహించే స్థితిలోని పాఠశాలల్లో ఉన్న విద్యార్థులను పెద్ద ప్రాంగణాలున్న పాఠశాలలకు, కాలేజీలకు తరలించాలని సూచించింది. పరీక్ష కేంద్రం మార్పు గురించి విద్యార్థులకు ముందుగానే సమాచారం ఇవ్వాలని పేర్కొంది. పరీక్ష కేంద్రంలోకి వెళ్లే విద్యార్థులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసేందుకు వీలుగా పరీక్ష కేంద్రాల వద్ద తగినన్ని కిట్లు ఏర్పాటు చేయాలని ఆదేశిం చింది. 

విద్యార్థుల వైద్య అవసరాలను చూసేం దుకు తగిన సంఖ్యలో వైద్య సిబ్బం దిని అందుబాటులో ఉంచా లని పేర్కొంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అత్యవసర సమయాల్లో వినియోగించేందుకు హెల్ప్‌లైన్‌ నంబర్లు ఏర్పాటు చేయాలని సూచించింది. రెడ్‌జోన్, కంటైన్మెంట్‌ జోన్లలో ఉన్న విద్యార్థులను సురక్షితంగా కేంద్రాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పింది. జూన్‌ 3 నాటికి రాష్ట్రంలోకరోనా తీరుపై సమీక్ష జరపాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. 

అప్పటి పరిస్థితుల ఆధారంగా పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వం అనుకుంటే, ప్రభుత్వం స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చని చెప్పింది. జూన్‌ 8 నుంచి పరీక్ష వాయిదా వేయాలని నిర్ణయిస్తే, ఆ విషయాన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియా ద్వారా విద్యార్థులకు తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది పవన్‌ కుమార్‌ చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకోవాని చెప్పింది. తదుపరి విచారణను జూన్‌ 4కు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ బొల్లంపల్లి విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

కతనిశ్చయంతో ఉన్నాం..
ప్రస్తుతం 5.34 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉందని అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) బీఎస్‌ ప్రసాద్‌ కోర్టుకు తెలిపారు. పరీక్షల వాయిదా వల్ల విద్యార్థుల్లో ఆందోళన, భయం పెరుగుతోందని, ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ ఎత్తివేయగానే వీలైనంత త్వరగా పరీక్షలు నిర్వహించాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే కేంద్రం లాక్‌డౌన్‌ పరిమితులను సడలించిందని, దీంతో పరిమిత రాకపోకలకు ఆస్కారం ఏర్పడిందని వివరించారు. 

ఒక్కో పరీక్ష కేంద్రానికి గతంలో 200 నుంచి 240 మంది విద్యార్థులను కేటాయించగా, ఇప్పుడు గరిష్టంగా 120కి పరిమితం చేస్తామని హామీ ఇచ్చారు. ఒక్కో విద్యార్థికి మధ్య 5 నుంచి 6 అడుగుల దూరం ఉండేలా చర్యలు తీసుకుంటామని, ఈ నేపథ్యంలో 2,005 అదనపు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దీంతో పరీక్ష కేంద్రాలు 2,530 నుంచి 4,535 కేంద్రాలకు పెరిగాయని వివరించారు. ఇన్విజిలేటర్ల సంఖ్యను కూడా పెంచామని, ఒక్కో ఇన్విజిలేటర్‌ 10 నుంచి 12 మంది విద్యార్థులను మాత్రమే పర్యవేక్షిస్తారన్నారు. 26,422 మంది అదనపు సిబ్బంది సేవలను వాడుకుంటామని స్పష్టం చేశారు.

వారికి ప్రత్యేక గదులు..
పరీక్ష కేంద్రాల వద్ద పాటించాల్సిన మార్గదర్శకాలకు సంబంధించి ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను కచ్చితంగా అమలు చేస్తామని అడ్వకేట్‌ జనరల్‌ పేర్కొన్నారు. విద్యార్థుల కోసం బస్సులు ఏర్పాటు చేస్తామని, బస్సుల్లో కూడా భౌతిక దూరం పాటించేలా చూస్తామని చెప్పారు. కేంద్రం వద్దకు విద్యార్థితో పాటు ఓ సహాయకుడిని మాత్రమే అనుమతిస్తామని, పరీక్ష కేంద్రానికి చేరుకునేందుకు హాల్‌టికెట్‌ను ప్రయాణ పాస్‌గా పరిగణిస్తామని పేర్కొన్నారు. 

పరీక్ష కేంద్రాల విద్యార్థులు, టీచర్లు, ఇతర సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సి ఉంటుందన్నారు. హాలులోకి వెళ్లేటప్పుడు, పరీక్ష సమయంలో, బయటకు వచ్చేటప్పుడు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. విద్యార్థులకు ధర్మల్‌ పరీక్షలు చేసి, జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్న వారిని ప్రత్యేక గదుల్లో కూర్చోబెడతామని చెప్పారు. గదుల వద్ద శానిటైజర్లు, మరుగుదొడ్ల వద్ద సబ్బులు, శానిటైజర్లును అందుబాటులో ఉంచుతామని వివరించారు. జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడే టీచర్లు, ఇతర సిబ్బందిని పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని అడ్వొకేట్‌ జనరల్‌ ప్రసాద్‌ తెలిపారు.

పిల్లల భవిష్యత్తు ముఖ్యం..
కాగా, పిటిషనర్‌ తరఫు న్యాయవాది కౌటూరు పవన్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ, ఏపీలో మాదిరిగా పరీక్ష పేపర్ల సంఖ్యను తగ్గించాలని, తెలంగాణలో 8 పేపర్లను నాలుగు చేయాలని సూచించారు. అయితే ఈ ప్రతిపాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. ఈనెల 31 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించినా ప్రభుత్వం పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయడం సబబు కాదన్నారు. 

దీనిపై స్పందించిన హైకోర్టు.. తెలంగాణ అంతటా గ్రీన్‌జోన్‌గా సీఎం ప్రకటించారని, పిల్లల భవిష్యత్‌ గురించి కూడా ఆలోచన చేయాలి కదా అని వ్యాఖ్యానించింది. కరోనా ఇప్పట్లో అంతమవుతుందని ఎవరైనా చెబుతున్నారా, మందు కూడా లేదనే విషయాన్ని గుర్తించాలని, కరోనా సమస్య కొలిక్కి వచ్చేలా లేదని, అందరూ కరోనాతో సహజీవనం చేస్తూనే అన్ని జాగ్రత్తలు తీసుకుని ముందడుగు వేయాల్సిందేనని ధర్మాసనం అభిప్రాయపడింది.

ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలి..
ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. విద్యార్థుల భవిష్యత్‌ బాధ్యత మనందరిపైనా ఉందని, వారు కరోనా బారిన పడకుండా రక్షించే విషయంలో ప్రభుత్వం మరింత జాగరుకతతో ఉండాలని పేర్కొంది. 5.34 లక్షల మంది పదో తరగతి విద్యార్థుల పరీక్షలను వాయిదా వేసుకుంటూ పోతే వారి మెడపై కత్తి వేలాడుతున్నంత టెన్షన్‌ ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. 

పరీక్షలకు అనుమతి ఇవ్వకపోతే విద్యా సంవత్సరం నష్టపోతారని చెప్పింది. అందుకే ప్రభుత్వం వైద్యపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని షరతులు విధిస్తూ పరీక్షల నిర్వహణకు అనుమతి ఇస్తున్నట్లు ధర్మాసనం తీర్పునిచ్చింది. కంటైన్మెంట్, రెడ్‌ జోన్లలోని విద్యార్థులను సురక్షితంగా పరీక్ష కేంద్రాలకు తరలించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని ఆదేశించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement