‘నా కుమార్తె ఇంటర్, కుమారుడు పదోతరగతి పరీక్షలు రాయాలి. నేను తహశీల్దార్‌గా పనిచేస్తున్నాను. మా ఆయన పీఆర్ ఏఈ. ఇద్దరం పొద్దున డ్యూటీకి వెళితే సాయంత్రం వస్తాం. కేవలం రాత్రి వేళ ల్లో పిల్లలకు తోడుగా ఉండి, పరీక్షల వేళల్లో సూచనలు చేస్తుంటాం. వరుస ఎన్నికలతో ఎన్నిగంటలకు ఇంటికి వెళతామో.. ఏమో తెలీదు. పిల్లల పరీక్ష టైంలో మేం ఇంట్లో లేకపోతే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి.
-ఓ మహిళా తహశీల్దార్ ఆవేదన
సాక్షి, కడప: ఉరుమొచ్చి మంగళం మీద పడినట్లుంది ఎన్నికల నిర్వహణ పరిస్థితి. మునిసిపల్, సార్వత్రిక ఎన్నికలతో పాటు స్థానిక పోరుకు సైరన్ మోగే పరిస్థితి ఉండటంతో రాజకీయవర్గాలతో పాటు అధికార యంత్రాంగంలోనూ ఆందోళన కన్పిస్తోంది. స్థానికసంస్థల పాలకవర్గాలు పూర్తయి నాలుగేళ్లయినా ప్రత్యేకాధికారుల పాలనతో నెట్టుకొచ్చిన ప్రభుత్వ నేతలు బాగానే ఉన్నారని, వారి రాజకీయ ఎత్తుగడల కారణంగా తాము భారం మోయాల్సి వస్తోందని అధికారవర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
60రోజుల వ్యవధిలో మునిసిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, శాసనసభ, లోక్‌సభలకు ప్రత్యక్ష ఎన్నికలు, ఎంపీపీ, జెడ్పీచైర్మన్, మునిసిపల్ చైర్మన్‌కు పరోక్ష ఎన్నికలు నిర్వహించాలి. రిజర్వేషన్ల ఖరారు నుంచే అధికారులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఆఘమేఘాలపై ఆదేశాలు రావడంతో రిజర్వేషన్ల నిష్పత్తి, రొటేషన్ విధానంలో ఏమాత్రం తప్పులు దొర్లకుండా చూసేందుకు పదిరోజులుగా తలమునకలవుతున్నారు.
ఎన్నికల విధుల్లో 3547 మంది పోలీసులు:
ఎన్నికల్లో శాంతిభద్రతల పర్యవేక్షణకు ఎస్పీ అశోక్‌తో పాటు 3547 మంది పోలీసులు విధులు నిర్వహించనున్నారు. వీరిలో 3067 మంది జిల్లాపోలీసులు ఉన్నారు. అలాగే నాలుగు కంపెనీలకు చెందిన 480 మంది కేంద్ర పోలీసులు ఉన్నారు. వీరంతా మూన్నెళ్లపాటు అవిశ్రాంతంగా భద్రతను పర్యవేక్షించనున్నారు. బెటాలియన్‌లోని పోలీసులైతే ఇతర ప్రాంతాలకు వెళ్లి రోజులతరబడి భార్యాపిల్లలకు దూరంగా విధులు నిర్వహించాల్సిన పరిస్థితి. ఇంట్లో తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగాలేకపోయినా, ఇంకేదైనా ఇతర కారణాలు ఉన్నా నామినేషన్ దాఖలు చేసేరోజు నుంచి ఫలితాలు ప్రకటించేంత వరకూ...ఒక్కమాటలో చెప్పాలంటే ఎన్నికలకోడ్ అమల్లో ఉన్నంత వరకూ డ్యూటీకే అంకితం కావాల్సిన అనివార్యపరిస్థితి.
ఇప్పటికే నెలరోజులు సెలవులు బంద్:
ఎన్నికల ప్రక్రియ ఎంత వేగంగా జరుగుతున్నదో...రాష్ట్ర విభజన ప్రక్రియ అంతే వేగంగా జరుగుతోంది. శాఖలకు సంబంధించిన విభజన ప్రక్రియను పూర్తి చేసేందుకు ఇప్పటికే అధికారులకు నెలరోజులపాటు సెలవులను బంద్ చేసినట్లు సీఎస్ మహంతి ప్రకటించారు. దీంతో పాటు ఎన్నికల సంఘం ఆదేశాల అమలుపై రోజువారీ సమీక్షలు, కోడ్‌పర్యవేక్షణ, నిబంధనలు పాటించేలా అభ్యర్థుల్లో అవగాహన పెంచడం, ఓటర్లజాబితా పునఃప్రచురణ, పోలీస్‌బందోబస్తు, అభ్యర్థుల ఎన్నికల ఖర్చు పర్యవేక్షణ లాంటి విధుల్లో నిమగ్నం కావాలి. దాదాపు మే ఆఖరు వరకూ సాగే ఈ క్రతువులో అధికారయంత్రాంగం రోజూ పరీక్ష ఎదుర్కోవాలి.
తప్పని సరి తద్దినంలా ఎన్నికలు:
2010 సెప్టెంబరు 29తో మునిసిపల్ పాలకవర్గాల గడువు ముగిసింది. తర్వాత పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్‌ల గడువు ముగిసింది. అప్పటి నుంచి ప్రభుత్వం వీటి ఎన్నికలు వాయిదా వేస్తోంది. వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీని ఎదుర్కోలేకే అన్నిరకాల ఎన్నికలను వాయిదా వేసిందనేది బహిరంగ రహస్యం. రిజర్వేషన్ల అంశంలో వివాదాన్ని తెరపైకి తెచ్చి ప్రభుత్వం వాయిదా పర్వాన్ని కొనసాగించింది. స్థానిక సంస్థల ఎన్నికలు సంబంధించి ప్రభుత్వమూ పరోక్షంగా స్టేకు కారణమైంది. గతేడాది కాలంగా ఉద్యమాలు, రాష్ట్ర విభజన వ్యవహారం తెరపైకి వచ్చింది.
కారణాలు ఏదైనా అధికారపార్టీకి ప్రతికూల పరిస్థితులు ఉన్నందునే ఎన్నికలు వాయిదాపడ్డాయనేది నిర్వివాదాంశం. ఎప్పటికప్పుడు తాము ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు చెబుతూనే ఉన్నా ప్రభుత్వమే లోపాయికారిగా వాయిదా మంత్రాన్ని పఠించింది. ఎట్టకేలకు న్యాయస్థానాల జోక్యంతో తప్పనిసరి తద్దినంలా ముహూర్తం నిర్ణయించింది. అన్నీ కలిపి స్వల్ప వ్యవధిలో నిర్వహించాల్సి రావడంతో యంత్రాంగం తీవ్ర ఒత్తిడికి గురవుతోంది.
ఏమి చేయాలో ఎలా
Published Sun, Mar 9 2014 2:52 AM | Last Updated on Sat, Sep 2 2017 4:29 AM
Advertisement