Manabadi Nadu Nedu: నాణ్యతలో రాజీవద్దు | CM Jagan High Level Review On Mana Badi Nadu Nedu | Sakshi
Sakshi News home page

Manabadi Nadu Nedu: నాణ్యతలో రాజీవద్దు

Published Sat, May 1 2021 3:08 AM | Last Updated on Sat, May 1 2021 1:10 PM

CM Jagan‌ High Level Review On Mana Badi Nadu Nedu - Sakshi

సాక్షి, అమరావతి: మన బడి నాడు–నేడు పనుల్లో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడవద్దని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ప్రతీ పనిలో నాణ్యత (క్వాలిటీ)తో  కూడిన ఆడిటింగ్‌ జరగాలని, అన్ని స్కూళ్లలో పనుల్లో నాణ్యతను తనిఖీ చేయాలని ఆదేశించారు. మే, జూన్‌ రెండు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సిందిగా సూచించారు. మే చివరి నాటికి ‘మన బడి నాడు–నేడు’ మొదటి దశ పనులు పూర్తవ్వాలని ఆదేశించారు.

జూలైలో స్కూళ్లు తెరిచే నాటికి విద్యా కానుక కిట్లు సిద్ధం చేయాల్సిందిగా అధికారులకుసూచించారు. ‘మనబడి నాడు–నేడు’ మొదటిదశలో 15,715 స్కూళ్లలో చేపట్టిన పనుల పురోగతిపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పనులు దాదాపు పూర్తయ్యే దశలో ఉన్నాయని వివరిస్తూ వాటిని ప్రజెంటేషన్‌ద్వారా అధికారులు ముఖ్యమంత్రికి చూపించారు. ఈ సమీక్షలో పదవ తరగతి, ఇంటర్మీడియెట్‌ పరీక్షల నిర్వహణ అంశాన్ని కూడా ముఖ్యమంత్రి జగన్‌ ప్రస్తావించారు.  ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే..

బిల్డింగ్స్‌పై కూడా పెయింటింగ్స్‌ వేయండి
‘‘స్కూళ్లు మరింత ఆకర్షణీయంగా కనిపించేలా పాఠశాలల గోడలకు వేసినట్లు, బిల్డింగ్‌పై కూడా పెయింటింగ్స్‌ వేయండి. మన బడి  నాడు–నేడు పనులు పూర్తయ్యాక, ప్రతి స్కూల్‌లో నాడు ఆ స్కూల్‌ ఎలా ఉంది? ఇప్పుడెలా ఉంది? అన్న ఫొటోలు తప్పనిసరిగా ప్రదర్శించాలి. అప్పుడే ఇప్పుడు చేసిన పనులకు మరింత విలువ వస్తుంది. వాటి ప్రాధాన్యత తెలుస్తుంది. అదే విధంగా ఇప్పుడు ఆ స్కూల్‌ను ఎలా నిర్వహించాలన్న దానిపైనా వారికి అవగాహన కలుగుతుంది. స్కూళ్లలో పెయింటింగ్‌ పనులు, స్మార్ట్‌ టీవీలు, వాల్‌ ఆర్ట్‌తో సహా అన్ని పనులు తప్పనిసరిగా మే చివరి నాటికి పూర్తి కావాలి. పనుల నాణ్యతలో ఎక్కడా లోపం ఉండకూడదు. అందుకే పేరెంట్స్‌ కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది.

నాడు–నేడులో ప్రభుత్వం నిర్దేశించుకున్న విధంగా పనులు జరగాలి. వాటిలో ఎక్కడా తేడా ఉండకూడదు. అలాగే మే, జూన్‌ నెలల్లో పూర్తిగా పనుల నాణ్యతను చూడాలి. ప్రతి స్కూల్‌ సందర్శించాలి. అన్నీ నోట్‌ చేయాలి. క్వాలిటీ ఆడిట్‌ పూర్తి కావాలి. టాయిలెట్‌ నిర్వహణ వ్యవస్థ కూడా స్కూళ్లు తెరిచే నాటికి పూర్తి కావాలి. ఇంగ్లిష్‌ మీడియంలో బోధన సజావుగా జరిగేలా టీచర్లకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలి. అప్పుడే వారు ఏ ఇబ్బందీ లేకుండా ఇంగ్లీష్‌లో పాఠాలు చెప్పగలుగుతారు. పిల్లలు స్కూళ్లకు వచ్చే నాటికే విద్యా కానుక కూడా సిద్ధం కావాలి. ఈసారి కిట్లలో ఇంగ్లీష్‌ డిక్షనరీ కూడా తప్పనిసరిగా ఉండాలి. విద్యా కానుక కింద ఇస్తున్న కిట్లలో ప్రతి ఒక్కటీ పూర్తి నాణ్యత కలిగి ఉండాలి. జూలైలో స్కూళ్లు తెరవగానే మనబడి నాడు–నేడు  రెండో దశ పనులు మొదలు కావాలి.
ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

విద్యార్థుల భవిష్యత్తు కోసమే టెన్త్, ఇంటర్‌ పరీక్షలు
విద్యార్దుల భవిష్యత్తు కోసమే టెన్త్, ఇంటర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. ఏ పరిస్థితిలో ఎందుకు పరీక్షలు పెడుతున్నామన్నది చెప్పాలి. నిన్న కేరళలో 10వ తరగతి పరీక్షలు పూర్తి చేశారు. పదవ తరగతి, ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై కేంద్రం ఏ విధానాన్నీ ప్రకటించలేదు. నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేసింది. దీంతో రాష్ట్రాలు స్వయంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కొన్ని రాష్ట్రాలు పరీక్షలు నిర్వహిస్తుండగా, మరి కొన్ని రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేశాయి. పరీక్ష పెట్టని రాష్ట్రాలు విద్యార్థులకు కేవలం పాస్‌ మార్కులు మాత్రమే ఇస్తున్నాయి. అలాంటప్పుడు మంచి కాలేజీల్లో వారికి సీట్లు వస్తాయి? పరీక్ష రాసిన వారికి 70 శాతం పైగా మార్కులు వస్తే, సీట్లు వారికే వస్తాయి కదా? కేవలం పాస్‌ మార్కులతో బయటపడిన విద్యార్థుల 50 ఏళ్ల భవిష్యత్తు ఏమిటి? విద్యార్థులకు మంచి చేయాలన్న తపనతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం.నిజానికి పరీక్షలు రద్దు చేయడం చాలా సులభం.

పరీక్షల నిర్వహణ ఇంకా బాధ్యతతో కూడుకున్నది. కేవలం విద్యార్థుల మంచి భవిష్యత్తు కోసమే పరీక్షలపై నిర్ణయం తీసుకున్నామన్న విషయాన్ని ప్రతి టీచర్‌ గుర్తించాలి. ఇందులో అందరి సహాయ సహకారాలు కావాలని, తోడ్పాటు కావాలన్న విషయాన్ని వారందరికీ బలంగా చెప్పండి. అలాగే పరీక్షల కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడా ఏ మాత్రం అలక్ష్యం చూపొద్దు. అన్ని కోవిడ్‌ జాగ్రత్తలతో ఈ పరీక్షలు నిర్వహించాలి.’’ అని సీఎం పేర్కొన్నారు. ఇంకా ఈ సమీక్షలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు, సర్వశిక్షా అభియాన్‌ స్టేట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ వెట్రిసెల్వి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement