జగనన్న వసతి దీవెన పథకం కింద తొలి విడత చెక్కుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో విద్యార్థులు, వారి తల్లులు, మంత్రులు వేణుగోపాలకృష్ణ, శంకర నారాయణ, సురేష్, తదితరులు
ప్రతి విద్యార్ధి కోసమే నేను ఆలోచిస్తున్నా... టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించకుంటే వారి భవిష్యత్తుకే నష్టం. పరీక్షలు రద్దు చేస్తున్నామని చెప్పడం చాలా సులభం. అన్ని జాగ్రత్తలతో పరీక్షలు నిర్వహించడం కష్టమే అయినా పిల్లల కోసం కష్టతరమైన మార్గాన్ని ఎంచుకున్నాం. అన్ని జాగ్రత్తలతో బాధ్యతగా పరీక్షలు నిర్వహిస్తామని ప్రతి తల్లికీ భరోసా ఇస్తున్నా.
– సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై కొందరు తమ రాజకీయ ప్రయోజనాల కోసం అగ్గి రాజేయడానికి, వక్రీకరించేందుకు ప్రయత్నాలు చేయడం పట్ల సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం పాస్ మార్కుల సర్టిఫికెట్‌తో ఓ విద్యార్థి బయటపడితే తరువాత వారి భవిష్యత్తు సంగతి ఏమిటని ప్రశ్నించారు. బొటాబొటి మార్కులతో పాసైన వారికి మంచి కాలేజీల్లో సీట్లు ఎలా వస్తాయని, జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో మన విద్యార్థులు ఎలా నెగ్గుకు రాగలుగుతారో ఒక్కసారి అందరూ ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. వరుసగా రెండో ఏడాది ‘జగనన్న వసతి దీవెన’ పథకం కింద తొలివిడతగా 10,89,302 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో రూ.1,048.94 కోట్లను సీఎం జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేశారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లోని తల్లులు, విద్యార్థులు, అధికారులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ముఖ్యమంత్రి ప్రసంగం వివరాలు ఇవీ...
ఒక్కసారి ఆలోచన చేయండి..
పిల్లలు, తల్లిదండ్రులు అంతా ఆలోచించాల్సిన విషయాలు చెబుతా. పదో తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణపై బాధ్యతారాహిత్యంగా విమర్శలు చేస్తున్న వారికి కూడా చెబుతున్నా. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పిల్లవాడి భవిష్యత్తు కోసం నాకన్నా ఎక్కువగా ఆలోచించేవారు ఎవరూ ఉండరని చెబుతున్నా. అంతగా మన పిల్లల కోసం నేను ఆలోచిస్తున్నా, తపిస్తున్నా. వారి కోసం పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ఇవాళ మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నా. ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నా. ఇలాంటి విపత్కర సమయంలో కూడా కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం అగ్గి పెట్టాలని ప్రయత్నిస్తున్నారు.
రాష్ట్రాలదే ఆ నిర్ణయం..
ఇవాళ అన్ని రాష్ట్రాలలో ఒకే విధమైన పాలసీ లేదు. కేంద్రం కొన్ని నిర్ణయాల బాధ్యతను రాష్ట్రాలకే వదిలేసింది. దీంతో కొన్ని రాష్ట్రాలు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేస్తున్నాయి.
కేవలం పాస్ సర్టిఫికెట్లతో ఏం ఉపయోగం?
ఇలాంటి పరిస్థితుల్లో పదో తరగతి నుంచి ఓ విద్యార్థి పాస్ సర్టిఫికెట్‌తో బయటపడితే.. లేదా కేవలం పాస్ మార్కులతో బయటకు వస్తే ఆ విద్యార్థికి మరో 50 ఏళ్ల పాటు భవిష్యత్తు ఏమిటి? పరీక్షలు నిర్వహించే రాష్ట్రాల విద్యార్థుల మార్కులు గొప్పగా ఉంటే, పరీక్షలు జరపకుండా కేవలం పాస్ మార్కులతో, ఆ సర్టిఫికెట్లతో మన పిల్లలు ఉంటే వారికి గొప్ప కాలేజీలలో సీట్లు ఎలా వస్తాయన్నది ఒక్కసారి ఆలోచించండి. పరీక్షలు నిర్వహించకపోతే ఉత్తీర్ణులైనట్లు కేవలం పాస్ సర్టిఫికెట్ మాత్రమే ఇస్తారు. మరి అలాంటప్పుడు పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకున్న వారితో ఈ విద్యార్థులు ఎలా పోటీ పడతారు? ఈ పిల్లలకు మంచి కాలేజీలలో సీట్లు ఎలా వస్తాయి?
రద్దు చాలా సులభం అయినా..
పరీక్షలు రద్దు చేస్తున్నామని చెప్పడం చాలా సులభం. ప్రతి అడుగులో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలు నిర్వహించడం చాలా కష్టం. పిల్లల కోసం కష్టతరమైన మార్గం అయినా కూడా, అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, ఆ పిల్లలకు తోడుగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాం. మంచి చేయాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం. పిల్లలకు మంచి చేయాలన్నదే ఈ ప్రభుత్వం ఉద్దేశం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని మరోసారి తెలియజేస్తున్నా. అన్ని జాగ్రత్తలతో బాధ్యతగా తీసుకుని పరీక్షలు నిర్వహిస్తామని ప్రతీ తల్లికీ భరోసా ఇస్తున్నా.
– ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఆర్ అండ్ బీ మంత్రి ఎం.శంకరనారాయణ, ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ సీఈవో ఆలూరు సాంబశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆడపిల్లలు ధైర్యంగా చదువుకుంటున్నారు
ఫీజులు కట్టలేక ఆపేద్దామనుకున్నా..
అమ్మ, అన్నయ్య కూలి పనులు చేసి నన్ను చదివిస్తున్నారు. జేఎన్‌టీయూ అనంతపురంలో సీటు వచ్చింది. ఫీజులు కట్టలేక చదువు ఆపేద్దామనుకున్నా. మీరు నాకు రూ.20 వేలిచ్చారు. వచ్చే ఏడాదికల్లా ల్యాప్‌టాప్ కూడా అందుతుంది. నాకు నాన్న లేకపోయినా మేనమామలా అన్నీ చేస్తున్నారు. ఆడపిల్లలు మీవల్ల ధైర్యంగా చదువుకుంటున్నారు.
– హారిక, బీటెక్, బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు
అన్నలా.. మేనమామలా..
నేను కూలికి వెళతా. ఇంటర్ తర్వాత పెద్దమ్మాయి చదువు ఆపేద్దామనుకునే సమయంలో మీ పథకాలు ఆదుకున్నాయి. నా భర్త ఆటో డ్రైవర్. వాహనమిత్ర ద్వారా లబ్ధి పొందారు. ఆరోగ్యశ్రీ ద్వారా సర్జరీ కూడా చేశారు. నాకు డ్వాక్రా రుణమాఫీ వచ్చింది. మా పిన్ని భర్త చనిపోతే పింఛన్ అందుతోంది. మాకు అన్నలా, మా పిల్లలకు మేనమామలా అన్నీ చేస్తున్నారు.
– రమణమ్మ, విద్యార్థిని తల్లి, పేర్నమిట్ట, ప్రకాశం జిల్లా
మాకు ఎంతో చేస్తున్నారు..
నా తమ్ముడు, నేను చదువుతున్నామంటే విద్యా దీవెన, వసతి దీవెన పథకాలే కారణం. గత ప్రభుత్వంలో మెయింటెనెన్స్, స్కాలర్‌షిప్ డబ్బులు హాస్టల్ ఖర్చులకు కూడా సరిపోయేవి కాదు. పక్క రాష్ట్రాల విద్యార్ధులు కూడా మీలాంటి ముఖ్యమంత్రి ఉండాలని కోరుకుంటున్నారు. మీరు దేశంలోనే బెస్ట్ సీఎం.
–గుత్తావుల తేజేశ్వరరావు, విద్యార్థి, ఆగూరు గ్రామం, శ్రీకాకుళం
Comments
Please login to add a commentAdd a comment