అనంతపురం జిల్లా నార్పలలో జరిగిన సభకు హాజరైన భారీ జనసందోహంలో ఓ భాగం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘మనం చదువుకునేది ఉద్యోగం కోసం మాత్రమే కాదు.. ప్రపంచంతో పోటీపడే అత్యుత్తమ చదువులే మన లక్ష్యం. విద్య ఒక కుటుంబం స్థితిగతులను, సామాజిక అసమానతలను రూపుమాపుతుంది. పేదరికం సంకెళ్లను తెంచాలంటే చదువే పెద్ద అస్త్రం. అందుకే అధికారంలోకి వచ్చాక విద్యా విధానంలో సమూల సంస్కరణలకు శ్రీకారం చుట్టాం. మన చదువులు బతకడానికి మాత్రమే కాదు.. లీడర్లుగా ఎదగడానికి కూడా ఉపయోగపడాలి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్రంలో గత నాలుగేళ్లలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని, పేదలెవరూ పెద్ద చదువులకు దూరం కాకూడదని పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు విద్యార్థులు ఉండటానికి, తినటానికి అవసరమయ్యే వసతి ఖర్చులకు కూడా డబ్బులు చెల్లిస్తున్నామని తెలిపారు. ఐటీఐ నుంచి ఇంజనీరింగ్ చదివే ప్రతి ఒక్కరికీ ఆర్థిక సాయం అందిస్తున్నట్లు చెప్పారు. బుధవారం అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నార్పలలో ‘జగనన్న వసతి దీవెన’ కింద రూ.912.71 కోట్లను తల్లుల ఖాతాల్లోకి జమ చేసిన సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. ఆ వివరాలు ఇవీ..
నాలుగేళ్లలో రూ.14,223.60 కోట్లు
ఈరోజు విడుదల చేస్తున్న జగనన్న వసతి దీవెన నిధులతో రాష్ట్రవ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతోంది. 8,61,138 మంది తల్లుల ఖాతాల్లోకి రూ.912.71 కోట్లు బటన్ నొక్కి జమ చేస్తున్నాం. మన పిల్లలు గొప్ప గొప్ప చదువులు చదివేందుకు ఎక్కడా అడ్డంకులు రాకూడదనే విద్యాదీవెనతో పాటు వసతి దీవెన నిధులు ఇస్తున్నాం. ఇప్పటివరకూ జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన కింద నాలుగేళ్లలో రూ.14,223.60 కోట్లు అందచేశాం.
సత్య నాదెళ్ల స్థాయికి అందరూ ఎదగాలి
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల గురించి మనమంతా చెప్పుకుంటున్నాం. కానీ ఆయన ఒక్కరే కాకుండా రాష్ట్రంలో ప్రభుత్వ అండతో చదువుకునే ప్రతి విద్యార్థీ ఆ స్థాయికి వెళ్లాలన్నదే నా తపన. భవిష్యత్తు తరాలకు మేలు జరగాలని పిల్లలను చక్కగా చదివించే బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుంది. మనమంతా గత ప్రభుత్వాలను చూశాం. అరకొర ఫీజు రీయింబర్స్‌మెంట్ వచ్చేది. భోజన వసతి లేక పేద పిల్లలు ఎంతో ఇబ్బంది పడేవారు.
గత పాలకులు 2017–18, 2018–19కి సంబంధించి రూ.1,778 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెట్టి వెళ్లిపోయారు. ఇప్పుడు మనం ప్రతి మూడు నెలలకు ఒకసారి నిధులు విడుదల చేస్తూ ఎలాంటి అవినీతికి తావులేకుండా నేరుగా తల్లుల ఖాతాల్లోనే జమ చేస్తున్నాం. ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థులకు రూ.20 వేలు చొప్పున వసతి దీవెన కింద ఇస్తున్నాం.
రెట్టింపు దాటిన జీఈఆర్
గతంలో ఇంటర్ పూర్తయ్యాక చాలామంది విద్యార్థులు కాలేజీలకు వెళ్లలేకపోయేవారు. ఇప్పుడు అలాంటి డ్రాపౌట్స్ తగ్గిపోయాయి. జీఈఆర్ (స్థూల చేరికల నిష్పత్తి) గతంలో 32.4 శాతం ఉండగా ఈ ప్రభుత్వం వచ్చాక 70 నుంచి 80 శాతానికి పెంచేలా చర్యలు తీసుకున్నాం. ప్రైవేట్ స్కూళ్లతో ప్రభుత్వ స్కూళ్లు పోటీ పడటం కాకుండా ప్రభుత్వ పాఠశాలలతో ప్రైవేట్ స్కూళ్లే పోటీ పడాల్సిన స్థాయికి తెచ్చాం. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇచ్చాం.
6వ తరగతి నుంచి 30,230 క్లాస్ రూమ్స్‌లో డిజిటల్ బోధన తెచ్చాం. సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ ప్రవేశపెట్టాం. 2018–19 నాటికి ప్రభుత్వ స్కూళ్లలో 37 లక్షల మంది విద్యార్థులు ఉండగా ఈ ఏడాది 40 లక్షల మందికి పెరిగారు. వారికి వాళ్ల అన్న ఉన్నాడనే నమ్మకంతోనే ప్రభుత్వ స్కూళ్లలో చేరుతున్నారు. గతంలో 87 వేల మంది ఇంజనీరింగ్ చదువుతుంటే ఈ ప్రభుత్వం వచ్చాక రూ.1.20 లక్షల మంది ఇంజనీరింగ్ చదువుతున్నారు.
‘ఉన్నత’ మార్పులతో ఉత్తమ ఉద్యోగాలు
అధికారంలోకి రాగానే ఉద్యోగాలకు అనుకూలంగా ఉన్నతవిద్య కరిక్యులమ్‌లో మార్పులు తీసుకొచ్చాం. 30 శాతం స్కిల్, జాబ్ ఓరియెంటెడ్‌గా మార్పులు తేవడంతో పాటు 25 మార్కెట్ ఓరియెంటెడ్ కోర్సులు, 67 బిజినెస్ ఒకేషనల్ కోర్సులను కరిక్యులమ్‌లో భాగం చేశాం. దేశంలోనే తొలిసారిగా నాలుగేళ్ల డిగ్రీ ఆనర్స్ కోర్సులు కూడా ప్రవేశపెట్టాం.
పిల్లల నైపుణ్యం పెంపొందించేలా అప్ స్కిల్లింగ్ కార్యక్రమాల కోసం దేశంలో తొలిసారిగా ఆన్‌లైన్ కోర్సులను కరిక్యులమ్‌లో భాగం చేశాం. ఆన్‌లైన్ క్రెడిట్స్ కూడా అందుబాటులోకి తీసుకొస్తూ సంపూర్ణ మార్పులు చేపట్టాం. 1.60 లక్షల మందికి సైబర్ సెక్యూరిటీ, అజూర్ వెబ్ సర్వీసెస్, డైనమిక్ 365 లాంటి కోర్సుల్లో మైక్రోసాఫ్ట్ ద్వారా ఉచితంగా శిక్షణ, సర్టిఫికెట్స్ ఇప్పించి మెరుగైన ఉద్యోగాలు లభించేలా చర్యలు తీసుకున్నాం.
మైక్రోసాఫ్ట్ ఒక్కటే కాకుండా అమెజాన్ వెబ్ సర్వీసెస్, సేల్స్‌ఫోర్స్ లాంటి దిగ్గజ సంస్థల సేవలను అనుసంధానం చేశాం. మన విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా మాస్టర్స్ ప్రోగ్రాంపై జర్మనీకి చెందిన యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్నాం. బీఎస్సీ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్‌కు సంబంధించి మెల్‌బోర్న్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకుని అడుగులు ముందుకు వేస్తున్నాం.
గత సర్కారు పెత్తందారీ పోకడ
పేద పిల్లలు ఎప్పటికీ పేదలుగానే మిగిలిపోవాలన్న పెత్తందారీ మనస్తత్వం గత ప్రభుత్వానిది. ప్రతి పేదవాడూ పెద్ద చదువులు చదువుకోవాలి.. కుటుంబ పరిస్థితులు మారాలన్నది మన ప్రభుత్వ సంకల్పం. ఆ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో చూడండి. రెండు ప్రభుత్వాలనూ బేరీజు వేయండి. ఈ ప్రభుత్వం వల్ల మీ ఇంట్లో మంచి జరిగిందంటే మీరే జగనన్నకు సైనికులుగా నిలబడండి. అబద్ధాలు, మోసాలు లాంటివి రానున్న రోజుల్లో మరిన్ని చూస్తారు. అవేమీ నమ్మకండి. నాకు ఉన్న ధైర్యమల్లా దేవుడి దయ, మీ ఆశీస్సులే.
హాజరైన మంత్రులు, ప్రజా ప్రతినిధులు
మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, మేరుగ నాగార్జున, ఉషశ్రీ చరణ్ తదితరులతోపాటు అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీ, ఇతర నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
విదేశీ విద్యకు ఆర్థిక సాయం..
ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ యూనివర్సిటీల్లో చదివే మన విద్యార్థుల కోసం ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’ పథకాన్ని ప్రవేశపెట్టాం. టాప్ 50 యూనివర్సిటీల్లో సీటొస్తే రూ.1.25 కోట్ల వరకూ ప్రభుత్వమే భరించి వారిని చదివిస్తుంది. ఇప్పటికే 200 మంది విద్యార్థులను జగనన్న విదేశీ విద్యాదీవెన ద్వారా విదేశాల్లో చదివిస్తున్నాం. ‘నాలెడ్జ్ ఈజ్ పవర్’ అన్నది నిజమే కానీ.. ‘ఎడ్యుకేషన్ ఈజ్ నాలెడ్జ్’ అన్నది సత్యం. మన చదువులు బతకడానికి మాత్రమే కాదు.. లీడర్లుగా ఎదగడానికీ ఉపయోగపడాలి. మనలో ఎదగాలన్న తపన, ఆత్మవిశ్వాసం, సమయస్ఫూర్తి ఉంటే ప్రపంచమే మనచుట్టూ తిరుగుతుంది.
మా జగనన్న చదివిస్తున్నారు.. అని గర్వంగా చెబుతా
మాది ధర్మవరం. మా నాన్న టైలరింగ్ చేస్తారు. అమ్మ గృహిణి. చదువుల దీపాలను వెలిగించే యాగానికి మీరు శ్రీకారం చుట్టారు. మీరు వెలిగించే దీపాలు ఏపీ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపబోతున్నాయి. 2021లో ఇంటర్ పూర్తవగానే జేఎన్‌టీయూ అనంతపురంలో ఇంజినీరింగ్ సీటు సాధించా. విద్యాదీవెన ద్వారా ఉచితంగా చదువుకుంటున్నా. మా తల్లిదండ్రులకు భారం కాకుండా వసతిదీవెన ద్వారా హాస్టల్ ఫీజు కూడా చెల్లిస్తున్నారు. ఇప్పుడు నేను గర్వంగా చెబుతున్నా.. మా జగనన్న నన్ను చదివిస్తున్నారని. మా ఇంటికి ఇప్పటివరకు అక్షరాలా రూ.3,06,000 సాయం చేశారు. మా సొంతింటి కల నెరవేరింది.
– దివ్యదీపిక, బీటెక్ సెకండియర్, జేఎన్‌టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాల
మీరే సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాం
మాది తిరుపతి జిల్లా చెన్నూరు. నిరుపేద కుటుంబం. రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న నేను ఈ రోజు ఉన్నతవిద్యను అభ్యసిస్తున్నానంటే మీ నవరత్న పథకాలే కారణం. విద్యాదీవెన, వసతిదీవెన లేకపోతే నేను చదువుకు దూరమయ్యేవాడిని. నాలాంటి ఎంతోమంది మీకు రుణపడి ఉంటాం. ప్రతి నెలా మా ఇంట్లో పథకాలు అందుతున్నాయి. మా ఒక్క కుటుంబానికే మీరు రూ.4,59,976 అందజేశారు. మీరే ఎప్పుడూ సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాం. నేను ప్రయోజకుడిని అయి పదిమంది విద్యార్థులకు తోడ్పాటు అందిస్తానని ప్రమాణం చేస్తున్నా.
– గోవింద్ చంద్రశేఖర్, బీటెక్ ఫైనలియర్, ఎస్కేయూ ఇంజినీరింగ్ కళాశాల
లోకేశ్.. శింగనమల చెరువు వద్దకు వెళ్లి సెల్ఫీ చాలెంజ్ ఎందుకు చేయలేదు?
గతంలో శింగనమల నియోజకవర్గంలో కరువు ఉండేది. కానీ ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు నిండాయి. లాభసాటి వ్యవసాయం చూస్తున్నాం. ఇవన్నీ కేవలం నాలుగేళ్ల పాలనలోనే సాధ్యమయ్యాయి. ఒక్క శింగనమల నియోజకవర్గానికే వివిధ పథకాల ద్వారా రూ.1,400 కోట్ల ఆర్థిక ప్రయోజనాలు కల్పించారు. నియోజకవర్గ అభివృద్ధికి రూ.320 కోట్లు కేటాయించారు. ఇటీవల శింగనమలలో లోకేశ్ యువగళం కాదు.. గందరగోళం పాదయాత్ర జరిగింది. మీ బాబు హయాంలో ఒక్కసారైనా శింగనమల చెరువు నిండిందా? ఇప్పుడు నాలుగేళ్లుగా నిండే ఉంది. సెల్ఫీ చాలెంజ్ అంటున్న లోకేశ్.. ఆ చెరువు పక్కన సెల్ఫీ ఎందుకు తీసుకోలేదు?
– జొన్నలగడ్డ పద్మావతి, శింగనమల ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment