మా చిరునవ్వుకు కారణం మీరే జగనన్న.. నార్పల సభలో విద్యార్థిని భావోద్వేగం.. | Jagananna Vasathi Deevena: Students Great Words About Cm Jagan | Sakshi
Sakshi News home page

మా చిరునవ్వుకు కారణం మీరే జగనన్న.. నార్పల సభలో విద్యార్థిని భావోద్వేగం..

Published Wed, Apr 26 2023 4:05 PM | Last Updated on Wed, Apr 26 2023 5:16 PM

Jagananna Vasathi Deevena: Students Great Words About Cm Jagan - Sakshi

సాక్షి, అనంతపురం జిల్లా: ‘అన్నా నమస్తే, మా నాన్న టైలరింగ్‌ చేస్తారు.. మా అమ్మ గృహిణి, మాది ధర్మవరం.. అన్నా మీరు అంటుంటారు ఒక దీపం ఒక గదికి వెలుగులు ఇస్తుంది కానీ చదువుల దీపం ఆ జీవితాల్లో వెలుగులు నింపి ఆ కుటుంబ రూపురేఖలు మార్చేస్తుందని, మీరు విద్యా వ్యవస్ధలో సమూల మార్పులు తీసుకొస్తున్నారు.. ఆ చదువుల దీపాలను వెలిగించే యాగానికి మీరు శ్రీకారం చుట్టారు’’ అంటూ అనంతపురం జేఎన్టీయూ కాలేజ్‌  బీటెక్‌ సెకండియర్‌ విద్యార్ధిని దివ్య దీపిక భావోద్వేగానికి గురైంది.

నార్పలలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి ‘జగనన్న వసతి దీవెన’ ఆర్ధిక సాయాన్ని విద్యార్ధుల తల్లుల ఖాతాల్లోకి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జమ చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో విద్యార్ధులు తమ స్పందన తెలిపారు.

‘జగనన్న వసతి దీవెన గురించి విద్యార్ధిని దివ్య దీపిక మాటల్లోనే..
మీరు వెలిగించే దీపాలు ఏపీ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపబోతున్నాయి. అన్నా నాది 2021లో ఇంటర్‌ పూర్తవగానే ఇక్కడ జేఎన్టీయూలో సీట్‌ తెచ్చుకున్నాను. నేను విద్యా దీవెన ద్వారా ఉచితంగా చదువుకుంటున్నాను. అలాగే మా తల్లిదండ్రులకు భారం కాకుండా వసతి దీవెన ద్వారా హాస్టల్‌ ఫీజు కూడా చెల్లిస్తున్నారు. ఇప్పుడు నేను గర్వంగా చెబుతున్నా.. మా జగనన్న నన్ను చదివిస్తున్నారని.. లాక్‌డౌన్‌ తర్వాత అంతంతగా ఉన్న మా ఆర్ధిక పరిస్ధితిపై మీరు కనుక ఈ పథకాలు పెట్టకపోయి ఉంటే ఎంతో భారం పడేది.

మీ చిరునవ్వులో నేను భాగమవుతా.. మీ కుటుంబంలో ఒకడినవుతానని మీరు అంటుంటారు.. మా చిరునవ్వులో భాగమే కాదు చిరునవ్వుకు కారణం కూడా మీరే, నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చారు.. విద్యా కానుక ద్వారా స్కూల్‌ బుక్స్, బ్యాగ్, ఇలా ప్రతీది అందిస్తున్నారు, ఇది సాధారణ వ్యక్తులకు సాధ్యం కానిదంతా మీరు చేస్తున్నారు. ఒక రాజకీయ నాయకుడు రాబోయే ఎన్నికల గురించి ఆలోచిస్తారు కానీ నాయకుడు రాబోయే తరం గురించి ఆలోచిస్తాడు. మీరు ప్రతి గుండెలో ఉంటారన్నా.. మా ఇంట్లో చాలా పథకాలు అందుతున్నాయి. మా ఇంట్లో ఇప్పటివరకు అక్షరాలా రూ. 3,06,000 సాయం చేశారు. మా సొంతింటి కల నెరవేరింది.. అన్నొచ్చాడని చెబుతాం, మంచి రోజులు వచ్చాయని చెబుతాం.
చదవండి: ఆ పెద్దమనిషి ఇంటర్వ్యూ చూస్తే ముసలి పులి కథే గుర్తొచ్చింది 

మీరు ప్రతి ఇంటికి పెద్ద కొడుకు అయ్యారు. మీ పాదయాత్రకు ఏదీ సాటిరాదన్నా. నేను కోరుకుంటున్న ఉన్నతమైన సమాజానికి మీరు పునాదులు వేశారు. ప్రతి గ్రామంలో అన్నీ ఏర్పాటుచేస్తున్నారు. సచివాలయాల ద్వారా అన్నీ అందుతున్నాయి, మీ కష్టాన్ని చరిత్ర కచ్చితంగా గుర్తుంచుకుంటుంది. ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు కానీ చరిత్ర కొందరినే గుర్తించుకుంటుంది. ఆ చరిత్రలో జగన్‌ అనే పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది.

యాదృచ్చికమో లేక దైవ నిర్ణయమో కానీ మీరు సీఎం అయిన తర్వాత కరువుతో అల్లాడే రాయలసీమ కూడా పచ్చగా కళకళలాడుతుంది. అన్నొచ్చేశాడు మన బతుకులు మార్చేశాడు. రాబోయే రోజుల్లో మీరు చదివిస్తున్న ఈ బిడ్డ ఉన్నతస్ధాయికి ఎదిగి మీ ముందుకొచ్చి మాట్లాడుతుంది అన్నా. మీ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో నా వంతు పాత్రను నేను పోషిస్తాను, ధ్యాంక్యూ అన్నా. 

మా విద్యార్ధులంతా మీకు రుణపడి ఉంటాం
సార్, మాది నిరుపేద కుటుంబం, చెన్నూరు గ్రామం, తిరుపతి జిల్లా. మా నాన్న కూలిపనులు చేస్తారు, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్ధితుల్లో ఉన్న నేను ఈ రోజు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నానంటే మీ నవరత్న పథకాలే కారణం. విద్యాదీవెన, వసతిదీవెన లేకుండా ఉంటే నేను చదువుకు దూరమయ్యేవాడిని, నాలాంటి ఎంతోమంది విద్యార్ధులకు మీరు సాయం చేస్తున్నారు, మా విద్యార్ధులంతా మీకు రుణపడి ఉంటాం, వసతి దీవెన ద్వారా మాకు సాయం అందుతుంది, మాకు చాలా సంతోషంగా ఉంది, చరిత్రలో చిరస్ధాయిగా నిలిచిపోయే మార్పులు మీరు విద్యారంగంలో చేస్తున్నారు.

నాడు నేడు, అమ్మ ఒడి, గోరుముద్ద, విదేశీ విద్యాకానుక పథకాలు తీసుకొచ్చారు, ప్రతి నెలా మా ఇంట్లో పథకాలు అందుతున్నాయి, మా ఒక్క కుటుంబానికే మీరు రూ. 4,59,976 అందజేశారు, మాలాంటి పేద విద్యార్ధులకు మీరు అండగా నిలిచి ఎప్పుడూ మాకు తోడుగా నిలిచి సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాం, నేను రాముడి పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని పుస్తకాలలో చదివాను కానీ ఇప్పుడు జగనన్న పాలనలో మేం అంతే సంతోషంగా ఉన్నాం, నేను మంచి ప్రయోజకుడిని అయి పది మంది విద్యార్ధులకు తోడ్పాటును అందిస్తానని ప్రమాణం చేస్తున్నాను, నేను మీకు ఆజన్మాంతం రుణపడి ఉంటాను సార్, ధన్యవాదాలు.
-గోవింద్‌ చంద్రశేఖర్, బీటెక్‌ ఫైనలియర్, ఎస్‌కేడీ యూనివర్శిటీ

విద్యార్ధులకు మీరు రోల్‌మోడల్‌..
సార్, నేను మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను, ఈ కాంపిటీటివ్‌ ప్రపంచంలో ఉన్నత చదువులు చదివించడం అనేది మా తల్లిదండ్రులకు పెద్ద భారం, కానీ మీరు సమాజంలో గొప్ప విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు. మీరు మా విద్యార్ధులకు అనేక పథకాలు తీసుకొచ్చారు, దాంతో పాటు స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో అనేక కోర్సులు ప్రవేశపెట్టారు, మా విద్యార్ధులకు మీరు రోల్‌మోడల్‌గా నిలిచారు.. మీరు పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చారు.

మేం కూడా ఉన్నత చదువులు చదివి ప్రయోజకులై భవిష్యత్‌లో ఉన్నతంగా రాణిస్తాం.. నేను ఈ మధ్య మాల్కం గ్లాడ్‌వెల్‌ రచించిన అవుట్‌లేర్స్‌ పుస్తకం చదివాను, ఆ పుస్తకంలో పదివేల గంటల సూత్రం చదివాను, దాని అర్ధం ఏంటంటే ఎవరైనా ఏ రంగంలోనైనా నిష్ణాతులు కావాలంటే పదివేల గంటలు అభ్యసించాలని, మీరు పాదయాత్రలో దానిని నిరూపించారు, ఏ రంగానికైనా ఇది వర్తిస్తుంది, మీరు మనసున్న మారాజులా నిలిచారు, మీరు మా యువతకు గొప్ప స్పూర్తిప్రదాతగా నిలిచారు. మీ పేరు నిలబెట్టేలా మేం ముందుకెళతాం, ధ్యాంక్యూ సార్‌.
-గ్రేసీ, బీటెక్‌ సెకండియర్‌ విద్యార్ధిని, జేఎన్‌టీయూ, అనంతపురం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement