సాక్షి, అమరావతి: కరోనా వ్యాప్తి నేపథ్యంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణ విషయంలో పునరాలోచించాలని హైకోర్టు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. తల్లిదండ్రులు, విద్యార్థుల ఆందోళనలను, మానసిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని పరీక్షల నిర్ణయాన్ని పునఃసమీక్షించాలంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేసింది. అధికారులతో మాట్లాడి ఏ విషయం తమకు చెప్పాలని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్‌కు సూచించింది. ప్రభుత్వం తెలియచేసే వైఖరిని బట్టి తగిన ఉత్తర్వులు జారీ చేస్తామంది. తదుపరి విచారణను మే 3కి వాయిదా వేసింది. ఈ వ్యాజ్యంలో ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియెట్ బోర్డులను సుమోటోగా ప్రతివాదులుగా చేర్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పదో తరగతి, ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ విజయవాడకు చెందిన ఇంటర్ విద్యార్థి పి.దర్శత్, పదో తరగతి విద్యార్థులు వేణు మాధవ్, రమేష్ చౌదరిలు హైకోర్టు లో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై శుక్రవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది.
క్షేత్ర స్థాయిలో పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నాం: ఏజీ శ్రీరామ్
ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది బసవ ప్రభుపాటిల్ వాదనలు వినిపిస్తూ.. ‘ఇంటర్ పరీక్షలకు 10 లక్షల మంది, పదో తరగతి పరీక్షలకు 5 నుంచి 6 లక్షల మంది హాజరు కానున్నారు. ఈ పరిస్థితుల్లో పరీక్షలంటే విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతారు. పరీక్షల ప్రక్రియలో టీచర్లు, అధికారులు, సిబ్బందికి కూడా కోవిడ్ ప్రమాదం పొంచి ఉంటుంది. పరీక్షలు రద్దు చేయాలని మేము కోరడం లేదు.. కేవలం వాయిదా కోరుతున్నాం అంతే’ అని వివరించారు. ఈ సమయంలో ధర్మాసనం పలు రాష్ట్రాలు నిర్వహించే జాతీయ స్థాయి పోటీ పరీక్షలపై ఆరా తీసింది. ఉమ్మడి ప్రవేశ పరీక్షలు వాయిదా వేయకుండా ఇంటర్ పరీక్షలు వాయిదా వేస్తే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించింది. పలు రాష్ట్రాలు ఉమ్మడి ప్రవేశ పరీక్షలను వాయిదా వేసినట్లు తెలిసిందని ప్రభు పాటిల్ చెప్పారు.
ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ స్పందిస్తూ.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకున్నామన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. రోజురోజుకు కోవిడ్ కేసులు పెరుగుతున్నాయా? తగ్గుతున్నాయా? అని ప్రశ్నించింది. పెరుగుతున్నాయని శ్రీరామ్ చెప్పగా, కాబట్టే పరీక్షల నిర్వహణ విషయంలో పునరాలోచన చేయాలని కోరుతున్నామని ధర్మాసనం తెలిపింది. విద్యార్థులంతా ఒకే చోట ఉండరని, వేర్వేరుగా పరీక్ష కేంద్రాలు ఉంటాయని శ్రీరామ్ తెలిపారు. కోవిడ్ సోకినవారు కోవిడ్ ప్రోటోకాల్స్ ప్రకారం ఐసోలేషన్‌లో ఉండి తీరాలని ధర్మాసనం గుర్తుచేసింది. దీనికి శ్రీరామ్ స్పందిస్తూ.. కరోనా వల్ల, ఒత్తిడి వల్ల ఏదయినా కారణం వల్ల పరీక్ష రాయని వారికి మళ్లీ పరీక్ష పెడతామన్నారు. పరీక్ష రాయడం లేదని విద్యార్థులు, తల్లిదండ్రులు స్వీయ ధ్రువీకరణ పత్రం ఇస్తే సరిపోతుందన్నారు.
పది, ఇంటర్ పరీక్షలపై పునరాలోచించండి
Published Sat, May 1 2021 3:30 AM | Last Updated on Sat, May 1 2021 3:30 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment