భూత్పూర్‌లోని పరీక్ష కేంద్రం కిటికీ వెంట చీటీలను తొలగించాలని ఆదేశిస్తున్న కలెక్టర్ రొనాల్డ్ రోస్ (ఫైల్)
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్ : పదో తరగతి వార్షిక పరీక్షలు బుధవారం ముగిశాయి. అయితే, జిల్లా స్థాయిలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు మొదటి నుంచి చెబుతున్నా మరికల్‌లో ఇంగ్లిష్–1 ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం వారికి మరక మిగిల్చింది. ప్రారంభం నుండి అంతా సాఫీగానే సాగుతోందని భావిస్తుండగా పేపర్ లీక్ కావడాన్ని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు.. అన్ని శాఖల అధికారులను రంగంలోకి దించారు.
మరికల్ వ్యవహారంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల పాత్ర ఉన్నట్లు తేలగా.. 13 మంది ఉపాధ్యాయ, ఉద్యోగులను సస్పెండ్ చేయడంతో పాటు 11 మందిపై కేసులు నమోదు చేశారు. ఇందులో ఒక ఇన్విజిలేటర్ కూడా ఉండడం గమనార్హం. కాగా, ఎస్సెస్సీ పరీక్షల్లో మొత్తం నలుగురు విద్యార్థులను డిబార్ చేశారు.
లీక్ వ్యవహారంలో 13 మంది సస్పెన్షన్
మరికల్‌లోని జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో 19వ తేదీ సోమవారం ఇంగ్లిష్–1 పరీక్ష ప్రారంభమైన కొద్ది సేపటికే నవీన్ అనే యువకుడు కేంద్రం గోడ దూకి ఓ విద్యార్థి ని ప్రశ్నపత్రాన్ని కిటికీ నుంచి ఫొటో తీసుకుని బయట ఉన్న రెండు ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు మోహన్ రాజేందర్, ప్రవీణ్‌కు అందజేశారు. ఆ తర్వాత వారు సమాధానాలు తయారు చేయించి తమ విద్యార్థులకు పంపించారు.
ఈ ఘటనలో ఇన్విజిలేటర్ సహా 13 మందిని సస్పెండ్ చేయడంతో పాటు ఓ ఇన్విజిలేటర్‌పై కేసు నమోదు చేసి, వ్యవహారంతో సంబంధం ఉన్న మొత్తం 11 మంది రిమాండ్‌కు తరలించారు. ఇదే ఘటనలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలడంతో ముగ్గురు కానిస్టేబుళ్లను కూడా ఎస్పీ అనురాధ సస్పెండ్ చేశారు. ఇది జరిగాక కలెక్టర్ రొనాల్డ్ రోస్ అన్ని శాఖల ఉన్నతాధికారులు రంగంలోకి జిల్లాను జల్లెడ పట్టారు.
దాదాపు అన్ని కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించి లోపాలను గుర్తించి హెచ్చరికలు జారీ చేశారు. ఇక ధన్వాడ మండలం కొండాపూర్ పాఠశాలలో తనిఖీకి వెళ్లిన ఆర్జేడీ వియజలక్ష్మికి కేంద్రం ఆవరణలో చీటీలు ఎక్కువ కనిపించడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశా రు. అలాగే, అక్కడ 11 మంది ఇన్విజిలేటర్లను పరీక్ష విధుల నుండి తప్పించారు.
భూత్పూర్‌లో ఉపాధ్యాయుడు..
భూత్పూర్‌లోని పదో తరగతి పరీక్ష కేంద్రంలో తనిఖీ సందర్భంగా విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడుతున్నట్లు కలెక్టర్ రొనాల్డ్ రోస్ గుర్తించారు. ఒక గది కిటీకి పక్కన చీటీలు ఎక్కువగా ఉండడంతో ఇన్విజిలేటర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తేలగా సస్పెండ్ చేశారు. అంతేకాకుండా అదే పరీక్ష కేంద్రం వద్ద ఫిజిక్స్ పేపర్ పరీక్ష రోజు పాత మొల్గర పాఠశాలలో సబ్జెక్టు ఉపాధ్యాయుడు కనిపించగా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక ఉపాధ్యాయుల సస్పెన్షన్‌పై ఉపాద్యాయ సంఘాల నాయకులు కలెక్టర్‌ను కలవగా.. ఆ సమావేశంలో జీహెచ్‌ఎం సంఘం నాయకుడు, పాత మొల్గర పాఠశాల హెచ్‌ఎంను కలెక్టర్ మందలించారు. భూత్పూర్ పరీక్ష కేంద్రంలో ఎక్కువగా పాతమొల్గర విద్యార్థులే పరీక్షలు రాస్తున్నారని, అక్కడకు పాఠశాల చెందిన ఉపాధ్యాయులు ప్రతిరోజు ఎందుకు వెళ్తున్నారు, ఏం పని అంటూ ప్రశ్నించారు.
చివరి రోజు 20,126 మంది విద్యార్థుల హాజరు
ఎస్సెస్సీ పరీక్షల చివరి రోజైన బుధవారం మొత్తం 20,126 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 20,188 మంది విద్యార్థులకు 64 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. చివరి రోజు డీఎల్‌ఓ ఐదు కేంద్రాల్లో, డీఈఓ ఆరు, ఫ్లయింగ్ స్వా్కడడ్లు 28 కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment