
ఇంటర్‌తోపాటే టెన్త్ పరీక్షలు
రాష్ట్రంలో ఇకపై ఇంటర్మీడియెట్‌తోపాటే పదో తరగతి పరీక్షలను నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
- ఉదయం ఇంటర్, మధ్యాహ్నం టెన్త్ ఎగ్జామ్స్
- కసర త్తు చేస్తున్న విద్యాశాఖ అధికారులు
- {పభుత్వ విద్యాసంస్థల్లోనే పరీక్ష కేంద్రాలు
- ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇకపై ఇంటర్మీడియెట్‌తోపాటే పదో తరగతి పరీక్షలను నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 15 ఏళ్ల కిందట అమలు చేసిన ఈ విధానాన్ని ఈ విద్యా సంవత్సరం పరీక్షల నుంచి మళ్లీ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై అధికారులు దృష్టిసారించారు. ఇటీవల జరిగిన ఇంటర్ పరీక్షలతోపాటు ప్రస్తుతం జరుగుతున్న పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే నిర్వహిస్తున్న ప్రభుత్వం ఇకపై ఏటా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే ఇంటర్, టెన్త్ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించింది.
విజిలెన్స్ తనిఖీలను వ్యతిరేకిస్తూ ప్రైవేటు విద్యాసంస్థలు తమ స్కూళ్లు, కాలేజీల్లో పరీక్ష కేంద్రాల ఏర్పాటుకు సహకరించబోమని ప్రకటించిన నేపథ్యంలో వాటిపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తోంది. అయితే పదో తరగతి, ఇంటర్ పరీక్షలు ఒకేసారి నిర్వహిస్తే పరీక్ష కేంద్రాల సమస్య తలెత్తే అవకాశం ఉంది. మార్చి మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాక, పదో తరగతి పరీక్షలు నిర్వహించాలంటే ఆలస్యం అవుతోంది. అందుకే ఉదయం ఇంటర్ పరీక్షలు, మధ్యాహ్నం పదో తరగతి పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. దీనిపై అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
టెన్త్ అడ్వాన్స్‌డ్ విద్యార్థులకు నష్టం వాటిల్లకుండా..
ఏటా దాదాపు 9.5 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు, 5.65 లక్షల మంది పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నారు. ఇంటర్ పరీక్షలు ముగిశాక పదో తరగతి పరీక్షల ప్రారంభం కావడం వల్ల అవి ఏప్రిల్ వరకు కొనసాగుతున్నాయి. దీనివల్ల ఫలితాల వెల్లడి ప్రక్రియలో ఆలస్యం అవుతుండటంతోపాటు పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ముగిసి ఫలితాలు వచ్చేసరికి జూలై వస్తోంది. ఇంటర్ తరగతులు మాత్రం మార్చిలో జరిగే వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యే విద్యార్థులతో జూన్ 1 నుంచే ప్రారంభం అవుతున్నాయి.
పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యే విద్యార్థులు ఇంటర్‌లో చేరి తరగతులకు హాజరయ్యే సరికి 30 నుంచి 45 రోజులు పడుతోంది. ఫలితంగా ఆయా పనిదినాల్లో జరిగే తరగతులను అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ విద్యార్థులు న ష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్ వార్షిక పరీక్షలతోపాటే పదో తరగతి వార్షిక పరీక్షలను నిర్వహించడం ద్వారా త్వరగా ఫలితాలు ఇవ్వొచ్చని అధికారులు పేర్కొంటున్నారు. అలాగే టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలనూ త్వరగా పూర్తి చేసి ఆ విద్యార్థులు కూడా విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే చదువుకునేలా చర్యలు చేపట్టవచ్చని భావిస్తున్నారు. ఈ విధానాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచే (2017 మార్చిలో పరీక్షలకు) అమలు చేయనున్నారు.