* పదో తరగతి పరీక్షల్లో సర్కారు సంస్కరణలు
* ప్రైవేటుగా పరీక్ష రాసే విధానానికి స్వస్తి
* గుర్తింపు లేని స్కూళ్ల విద్యార్థులకు నో చాన్స్
* ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం
* పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్ ఖరారు
* అపరాధ రుసుం లేకుండా వచ్చే నెల 5 వరకు గడువు
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల నిర్వహణలో తెలంగాణ ప్రభుత్వం సంస్కరణలు చేపట్టింది. స్కూలుకు వెళ్లి చదువుకోకపోయినా.. ప్రైవేటుగా ఫీజు కట్టి పరీక్ష రాసే విధానానికి స్వస్తి చెప్పింది. దీంతో గుర్తింపు లేని పాఠశాలల విద్యార్థులకు ప్రైవేటు అభ్యర్థులుగా పదో తరగతి బోర్డు పరీక్ష రాసే అవకాశం ఉండదు. అలాగే గుర్తింపు లేని పాఠశాలలకు చెక్ పెట్టేందుకు పదో తరగతి పరీక్షల దరఖాస్తులను ఆన్‌లైన్ విధానంలో స్వీకరించాలని సర్కారు నిర్ణయించింది. ఈ విధానంలో షెడ్యూల్‌ను శుక్రవారం ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రకటించింది. దీని ప్రకారం విద్యార్థులు వచ్చే నెల 5లోగా అపరాధ రుసుం లేకుండా పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.
కాగా, ఇప్పటివరకు ఆఫ్‌లైన్(ఐసీఆర్ షీట్) పద్ధతిలో దరఖాస్తులను స్వీకరించిన అధికారులు.. ఈ ఏడాది ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్ పద్ధతిలోనూ దరఖాస్తులను తీసుకోనున్నారు. ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ముందుగా http://bsetelangana.org వెబ్‌సైట్‌లో ఎస్‌ఎస్‌సీ పరీక్షల లింక్‌ను తెరిచి.. తమ పాఠశాల కోడ్‌ను నమోదు చేయగానే లాగిన్ కాగలుగుతారు. ఆ తర్వాత తమ పాఠశాల విద్యార్థులకు సంబంధించిన సమాచారాన్ని ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. అయితే, ప్రైవేటు పాఠశాలల విషయంలో మాత్రం విద్యాశాఖ కట్టుదిట్టంగా వ్యవహరించనుంది.
ఆయా స్కూళ్ల హెడ్‌మాస్టర్లు తొలుత స్థానిక ఉప విద్యాశాఖాధికారి(డీఈవో)ని సంప్రదించి తమ పాఠశాలకు సంబంధించిన పూర్తి వివరాలను అందించాల్సి ఉంటుంది. పాఠశాలకు గుర్తింపు ఉందా లేదా, స్కూళ్లు నడుస్తున్నాయా లేదా వంటి విషయాలను డీఈవోలు పరిశీలిస్తారు.
అంతా సవ్యంగా ఉంటే, సంబంధిత ప్రైవేటు పాఠశాల గుర్తింపు సంఖ్య, పదో తరగతి సెక్షన్ల సంఖ్య, విద్యార్థుల సంఖ్యను వెబ్‌సైట్‌లో డీఈవో నమోదు చేస్తారు. తర్వాతే ఆ పాఠశాల పేరుతో పరీక్షల దరఖాస్తులను సమర్పించేందుకు లాగిన్ అకౌంట్ తెరుచుకుంటుంది. దీని కోసం ఎస్‌ఎస్‌సీ బోర్డు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. ఈ ఆన్‌లైన్ విధానంపై అవగాహన కల్పించేందుకు వెబ్‌సైట్‌లో ‘డెమో’(దరఖాస్తులను నింపే విధానం నమూనా)ను చూసే వీలు కల్పించింది. రెగ్యులర్ వితౌట్ వొకేషనల్, ఫెయిల్డ్ ఇన్ జూన్ 2014, రెగ్యులర్ విత్ వొకేషనల్, ఓఎస్‌ఎస్‌సీ రెగ్యులర్, ఓఎస్‌ఎస్‌సీ ప్రైవేటు, ఫెయిల్డ్ ప్రియర్ టు 2014 పేర్లతో ఆరు వేర్వేరు కేటగిరీల కింద సంబంధిత విద్యార్థుల దరఖాస్తులను సమర్పించేలా ఏర్పాట్లు చేసింది. స్టూడెంట్ రిజిస్ట్రేషన్ లింక్‌ను క్లిక్ చేయగానే ఈ ఆప్షన్లు కంప్యూటర్ తెరపై ప్రత్యక్షం కానున్నాయి.
ఇక ఓపెన్ స్కూల్ పరీక్షలే దిక్కు
గుర్తింపు లేని పాఠశాలల విద్యార్థులు, బడికి వెళ్లని పిల్లలకు ప్రైవేట్‌గా బోర్డు పరీక్షలు రాసే అవకాశం లేకపోవడంతో ఇకపై అలాంటి వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ఓపెన్ స్కూల్ విధానమే దిక్కు కానుంది. గుర్తింపు లేని, ఇతర స్కూళ్లకు అనుబంధంగా మారి తమ విద్యార్థులతో పరీక్షలు రాయించేందుకు ఇకపై అవకాశం ఉండదు.
దరఖాస్తుల పరిశీలనలోనే అలాంటి వాటిని గుర్తించి ఏరివేస్తారు. ప్రైవేట్ స్కూళ్ల ప్రవేశాల రిజిస్టర్, హాజరు పట్టికలో విద్యార్థుల పేర్లను పరిశీలించిన తర్వాతే దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవాలని శుక్రవారం జిల్లా విద్యా శాఖాధికారులతో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ బి.మన్మథరెడ్డి ఆదేశించినట్లు సమాచారం. అయితే, గతంలో ప్రైవేటుగా పరీక్షలు రాసి ఉత్తీర్ణులు కాని విద్యార్థులకు మాత్రమే ఈసారి మళ్లీ ప్రైవేటుగా పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తున్నారు.
టెన్త్ ‘ప్రైవేటు’కు నో
Published Sat, Oct 18 2014 12:53 AM | Last Updated on Sat, Sep 2 2017 3:00 PM
Advertisement
Advertisement