హాస్టల్లో కలెక్టర్ బస
జిల్లా వ్యాప్తంగా హాస్టళ్లలో నిద్రించిన అధికారులు
సాక్షి, సంగారెడ్డి: కలెక్టర్ రాహుల్ బొజ్జా సోమవారం రాత్రి సంగారెడ్డిలోని బాలుర హాస్టల్‌లో విద్యార్థులతో కలిసి నిద్రించారు. హాస్టళ్లు, రెసిడెన్షియల్ హాస్టల్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యార్థులు చదువుతున్న తీరును పరిశీలించేందుకు కలెక్టర్ హాస్టల్ నిద్రకు శ్రీకారం చుట్టారు. కలెక్టర్‌తోపాటు జిల్లాలో ఉన్న హాస్టళ్లలో ప్రత్యేకాధికారులు 260 మంది సోమవారం రాత్రి విద్యార్థులతో కలిసి నిద్రించారు. ఈ సందర్భంగా వసతి గృహాల్లోని మౌలిక వసతుల కొరత, విద్యార్థుల సమస్యలు, టెన్‌త పరీక్షలకు విద్యార్థుల సన్నద్ధమవుతున్న తీరు తదితర అంశాలను పరిశీలించారు.
ప్రత్యేకాధికారులంతా తమ దృష్టికి వచ్చిన వివరాలను మంగళవారం కలెక్టర్‌కు తెలియజేయస్తారు. ఈ సందర్భగా కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ హాస్టళ్లలోని సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కరించేందుకు వీలుగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. హాస్టళ్లలో ప్రత్యేకాధికారులు విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడాలని సూచించినట్లు తెలిపారు. హాస్టల్ విద్యార్థుల పరీక్షల సన్నద్ధతపై మంగళవారం ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో నిర్వహించనున్న సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు. కలెక్టర్ వెంట ఆర్డీవో మధుకర్‌రెడ్డి, తహశీల్దార్ గోవర్ధన్ ఉన్నారు.
బట్టీ వద్దు.. ఒకటికి రెండుసార్లు చదవండి
హాస్టల్ నిద్రలో భాగంగా కలెక్టర్ మొదట మహిళ డిగ్రీ కళాశాల సమీపంలోని బాలికల సమీకృత హాస్టల్‌ను సందర్శించారు. అక్కడ ఉన్న హాస్టల్ గదులను పరిశీలించి ప్రత్యేక అధికారులు వరలక్ష్మి, మీనాతో మాట్లాడి హాస్టళ్లలో ఉన్న సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం పదవతరగతి విద్యార్థులతో ముఖాముఖి సమావేశమయ్యారు. విద్యార్థులతో పాటు కలెక్టర్ నేలపైనే కూర్చున్నారు. కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడుతూ ‘ఏమ్మా పదవతరగతి పరీక్షలకు అందరూ బాగా ప్రిపేర్ అవుతున్నారా..అర్ధవార్షిక పరీక్షలో ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి.. అంటూ’ ఆరా తీశారు. బట్టీ వేసే పద్ధతి మానుకోవాలని పాఠ్యపుస్తకాలను మొత్తం చదవి అర్థం చేసుకోవాలని సూచించారు.
గణితం, ఇంగ్లిషు పరీక్షలకు బాగా సన్నద్ధం కావాలని మంచి మార్కులు సాధించాలని.. ఏవైనా సమస్యలుంటే తనకు వివరించాలని తెలిపారు. పరీక్షలకు బాగా సన్నద్ధమవుతున్నామని మంచి మార్కులు సాధిస్తామని విద్యార్థులు కలెక్టర్‌కు తెలియజేశారు. హాస్టల్‌లో తాగునీటి సమస్య ఉందని, కరెంటు సమస్య పరిష్కరించాలని కోరారు. రెండు సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. అనంతరం కలెక్టర్ పట్టణంలోని ఎస్సీ డీ హాస్టల్‌ను సందర్శించి విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. ఆ తర్వాత ఎస్సీ బాలుర హాస్టల్స్ చేరుకుని అక్కడి విద్యార్థులతో కొద్దిసేపు మాట్లాడారు. ఆ తర్వాత వారితో కలిసి కలిసి నిద్రపోయారు.