నేటి నుంచి టెన్త్ పరీక్షలు
5 నిమిషాలు దాటితే అనుమతించరు..
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి వార్షిక పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 వరకు నిర్వహిస్తారు. ద్వితీయ భాష, ఓరియంటల్ ఎస్సెస్సీ, కాంపొజిట్ కోర్సు పరీక్షలు మాత్రం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు ఉంటాయి. విద్యార్థులను ఉదయం 8.45 నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. షెడ్యూల్ సమయానికి 5 నిమిషాలు దాటితే (9.35 వరకు) పరీక్షహాల్లోకి అనుమతించరు. హాల్‌టికెట్ పోగొట్టుకున్న వారు bsetelangana.org నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
వాటిపై ప్రధానోపాధ్యాయుడి సంతకం అవసరం లేదు. వాటితో నేరుగా పరీక్షకు హాజరు కావచ్చు. ఈ పరీక్షలకు మొత్తం 5,38,226 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వారిలో రెగ్యులర్ విద్యార్థులు 5,09,831 మంది, వన్స్ ఫెయిల్డ్ విద్యార్థులు 28,395 మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,556 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. నేడు ఓరియంటల్ ఎస్సెస్సీ పేపరు–1 పరీక్ష జరగనుంది.