విద్యా శాఖతో ఆటలు! | Most schools in apartments only | Sakshi
Sakshi News home page

విద్యా శాఖతో ఆటలు!

Published Thu, Sep 19 2019 2:59 AM | Last Updated on Thu, Sep 19 2019 2:59 AM

Most schools in apartments only - Sakshi

మొహదీపట్నంలో ఓ అపార్ట్‌మెంట్‌లో నడుపుతున్న స్కూల్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ శాతం ఉన్నవి ప్రభుత్వ పాఠశాలలే. వాటికి ఎక్కువ మొత్తంలో ఆట స్థలాలు ఉన్నాయి. ఇక ప్రైవేటు పాఠశాలలు ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. అపార్ట్‌మెంట్లు, బహుళ అంతస్తుల భవనాల్లోనే ప్రైవేటు స్కూళ్లు ఎక్కువగా ఉన్నట్లు విద్యా శాఖ క్షేత్ర స్థాయి అధికారులే చెబుతారు. అలాంటి వాటికి ఆట స్థలాలు లేనేలేవు. కనీసం పాఠశాల భవనాల చుట్టూ ఫైర్‌ ఇంజన్‌ తిరిగే స్థలమే లేదని అగ్నిమాపక శాఖ ఫైర్‌ ఎన్‌వోసీలే ఇవ్వలేదు. దీంతో దాదాపు గత మూడేళ్ల నుంచి 1,500 వరకు ఉన్నత పాఠశాలలకు అను మతి లేదని ఆయా పాఠశాలల విద్యార్థులను పదో పరీక్షలకు షరతులతో విద్యా శాఖ అనుమతించింది. ఫైర్‌ ఇంజన్‌ తిరిగేందుకే స్థలం లేనప్పుడు.. ఆట స్థలాలు ఎలా ఉంటాయని విద్యా శాఖ అధికారులే ప్రశ్నిస్తున్నారు. ఇవికాకుండా మరో 9 వేలకు పైగా ఉన్న ప్రైవేటు స్కూళ్లలో ఆట స్థలాలు లేనివే అత్యధికంగా ఉన్నాయి. అయినా రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 2482 పాఠశాలలకు మాత్రమే ఆట స్థలాలు లేవని యాజమాన్యాలు చెబుతున్నాయి. 

అన్నీ ఉన్నాయట.. 
ప్రభుత్వానికి ఇచ్చే లెక్కల్లో మాత్రం తమ పాఠశాలల్లో అన్ని రకాల సదుపాయాలు పక్కాగా ఉన్న ట్లు ప్రైవేటు యాజమాన్యాలు చూపిస్తున్నాయి. పెద్దగా సదుపాయాలు లేకపోయినా ఉన్నాయంటూ రాష్ట్రంలో చాలా వరకు ప్రైవేటు పాఠశాలలు తప్పుడు లెక్కలే ఇస్తున్నా విద్యా శాఖ ఏం చేయలేకపోతోంది. విచిత్రంగా కొన్ని పాఠశాలలు మాత్రం విద్యుత్‌ సదుపాయం, తాగునీటి సదుపాయం లేవని లెక్కలు ఇవ్వడం గమనార్హం. పాఠశాల విద్యా డైరెక్టరేట్‌ నుంచి పాఠశాలల సమగ్ర వివరాలను సేకరించే సమయంలో క్షేత్ర స్థాయిలోని పాఠశాలలు ఇచ్చే లెక్కలను మాత్రమే తీసుకుంటున్నందున నిజంగా ఆ సదుపాయాలు ఆయా పాఠశాలల్లో ఉన్నాయా.. లేదా.. అని తనిఖీ చేసే పరిస్థితి లేకపోవడంతో విద్యా శాఖ ఏమీ చేయలేకపోతోంది. దీంతో యాజమాన్యాలు ఇచ్చిన తప్పుడు లెక్కలనే నమోదు చేసుకోవాల్సి వస్తోంది. 

ఆటల్లో ముందుండాలి కదా..! 
ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఇస్తున్న లెక్కల ప్రకారం రాష్ట్రంలోని అత్యధిక ప్రైవేటు పాఠశాలల్లో ఆట స్థలాలు ఉన్నపుడు స్కూల్‌ గేమ్స్‌ పోటీల్లో ప్రైవేటు స్కూల్‌ విద్యార్థులు ఎక్కువ మంది ముందుండాలి. వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. ప్రైవేటు పాఠశాలల నుంచి పోటీల్లో పాల్గొనే విద్యార్థుల సంఖ్య స్వల్పంగానే ఉంటోందని స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ అధికారులే చెబుతున్నారు. అలాంటప్పుడు ప్రైవే టు పాఠశాలల విద్యార్థులంతా ఆటలు ఎక్కడ అడుతున్నారో.. శారీరక వ్యాయామం ఎక్కడ జరుగుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. 

వారంలో  ఆరు పీరియడ్‌ల అమలేదీ?
విద్యా శాఖ అకడమిక్‌ కేలండర్‌ ప్రకారం ప్రతి పాఠశాలలో అన్ని తరగతి విద్యార్థులకు వారంలో ఆరు పీరియడ్‌లు ఆటల కోసమే కేటాయించాలని స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ కార్యదర్శి రామిరెడ్డి పేర్కొన్నారు. అందులో రెండు పీరియడ్‌లు ఆటలు ఆడుకునేందుకు, మరో 2 పీరియడ్‌లు ఆయా ఆటలు, వాటి నియమ నిబంధనల గురించి నేర్చుకోవడం, మరొకటి మాస్‌ పీరియడ్‌గా యోగా, జంపింగ్, రన్నింగ్‌ వంటిని నేర్పించాలి. ఇంకొక పీరియడ్‌ మాత్రం ప్లే ఆల్‌. అంటే ఆయా పాఠశాలల్లోని విద్యార్థులంతా ఆ పీరియడ్‌లో ఆటలు ఆడుకోవాల్సిందే. కానీ ఇవేవీ పెద్దగా అమలుకు నోచుకోవట్లేదని విద్యా శాఖ వర్గాలే చెబుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసేలా చర్యలు చేపడుతున్నా ప్రైవేటు స్కూళ్లలో సాధ్యం కావట్లేదని అధికారులే వాపోతున్నారు.

మార్కుల వేటలో.. 
ప్రైవేటు స్కూళ్లు అంటే బాగా చదివిస్తారనే అపోహ తల్లిదండ్రుల్లో ఉంది. యాజమాన్యాలు కూడా అదే బాటన కొనసాగుతున్నాయి. విద్యార్థులతో పాఠాలు బట్టీ పట్టించడం, మార్కులు తెప్పించడం, నాలుగు ఇంగ్లిష్‌ మాటలు మాట్లాడేలా చేయ డం తప్ప మరేమీ లేదన్నది అనేక సర్వేల్లో తేలింది. చదువడం, రాయడం రాని వారు కూడా అధికంగానే ఉన్నట్లు నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే వెల్లడించింది. అయినా తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ ప్రైవేటు స్కూళ్లకే పిల్లలను పంపిస్తూ బట్టీ చదువులకు అలవాటు చేస్తున్నారు. కొంత మంది తల్లిదండ్రులు మాత్రం తమ వ్యక్తిగత శ్రద్ధతో ప్రైవేటు కోచ్‌ల వద్ద పిల్లలకు క్రికెట్, వాలీబాల్, బాస్కెట్‌ బాల్, టెన్నిస్‌ వంటి శిక్షణ ఇప్పిస్తున్నారు. వారు మాత్రమే పోటీలకు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement