జిల్లాలోని ప్రయివేటు పాఠశాలల యాజమాన్యం అడ్డదారుల్లో పిల్లల్ని తమ కళాశాలలు, పాఠశాలల్లో చేర్పించుకునేందుకు సిద్ధమైంది. అందుకు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, బాగా చదువుకున్న కుర్రోళ్లను పావుగా ఉంచుకుంటోంది. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది భారీగా హాజరు శాతం పడిపోయే అవకాశాలు ఉన్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. ఇదే జరిగితే మరిన్ని పాఠశాలలు మూతపడడం ఖాయం. దీన్ని నివారించాల్సిన విద్యాశాఖ పట్టీపట్టనట్టు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.
సాక్షి, చిత్తూరు : జిల్లాలో విద్యావ్యాపారం జోరందుకుంది. ప్రయివే టు విద్యాసంస్థలు కమీషన్ ఏజెంట్లను పెట్టుకొని విద్యార్థులను చేర్చుకుంటున్నారు. ఇది ప్రభుత్వ పాఠశాలలకు గండికొట్టే విధంగాఉందని పలువురుఆందోళన చెందుతున్నారు.
అసలు ఎలా జరుగుతోందంటే..
ప్రైవేటు విద్యాసంస్థలు ఒక్కో విద్యార్థికి ఒక్కో రేటు లెక్కన కమీషన్ ఇస్తామని ఆశచూపుతున్నాయి. పదో తరగతి అయితే రూ.500-1000, ఇంటర్ విద్యార్థికి రూ.3వేలు, ఇంజినీరింగ్ విద్యార్థికి రూ.5 వేలకు తగ్గకుండా కమీషన్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఏజెంట్లుగా అధిక శాతం మంది ప్రభుత్వ ఉపాధ్యాయుల్నే ఎంచుకుంటున్నారు. కొందరు ఉపాధ్యాయులు కమీషన్లకు కక్కుర్తి పడి ప్రయివేటు పాఠశాలల్లో విద్యార్థుల్ని చేర్పిస్తుండడం గమనార్హం.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి అధికంగా ఉన్నట్టు సమాచారం. పిల్లలకు చదువుచెప్పిన అయ్యోర్లు చెప్పారుకదాని విద్యార్థుల తల్లిదండ్రులు వారు సూచించిన విద్యాసంస్థల్లో చేర్చేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని కొన్ని పాఠశాలలు మూతపడే స్థాయికి దిగజారే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది.
ఫీజులమోత
విద్యార్థులను చేర్చుకొనే సమయంలో ఫీజులు తగ్గిస్తామంటూ మాయమాటలు చెబుతున్న విద్యాసంస్థలు తీరా ఏరుదాటాక తెప్ప తగలేసే విధంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా రకరకాల ఫీజులతో హడలెత్తిస్తున్నాయి. తొలుత చెప్పిన ఫీజుతో పనిలేకుండా అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. సమయానికి డబ్బులు చెల్లించకపోతే విద్యార్థులను అందరిలో నిల్చోబెట్టడం, ఎప్పుడుపడితే అప్పుడు ఫీజులు తెమ్మంటూ విద్యార్థులను ఇళ్లకు పంపడం లాంటి చర్యలు పెచ్చుమీరుతున్నాయి. ఫలితంగా విద్యార్థులు మానసికంగా కుంగిపోతున్నారని కొందరు తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు ప్రమాదం ముంచుకురాకముందే విద్యాశాఖ మేల్కొనాల్సి ఉంది.
ఎడ్యు‘కేట్లు’
Published Fri, Jun 12 2015 3:53 AM | Last Updated on Sun, Sep 3 2017 3:35 AM
Advertisement
Advertisement