చదువులకూ ‘చంద్ర’ గ్రహణం! | Students In Trouble Due To Negligence Of TDP Chandrababu Alliance Govt, More Details | Sakshi
Sakshi News home page

చదువులకూ ‘చంద్ర’ గ్రహణం!

Published Sun, Aug 4 2024 4:55 AM | Last Updated on Sun, Aug 4 2024 7:15 PM

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం బృందావనంలో  ఒక్క టీచర్‌ కూడా లేని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం బృందావనంలో ఒక్క టీచర్‌ కూడా లేని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల

కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థులకు ఇక్కట్లు

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం బృందావనంలో ఒక్క టీచర్‌ కూడా లేని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల 

2 నెలలవుతున్నా పూర్తి స్థాయిలో అందని స్టూడెంట్‌ కిట్లు 

60 శాతం విద్యార్థులకు కూడా చేరని యూనిఫారాలు 

కొలతల తేడాతో మూలకు చేరిన బూట్లు 

ప్రతిరోజు ఒక స్కూలు నుంచి మరో స్కూలుకు ‘సర్దుబాటు’ 

ఏజెన్సీల మార్పుతో గందరగోళం.. రుచి మారిన మధ్యాహ్న భోజనం.. అన్ని స్కూళ్లలోనూ టీచర్ల కొరత

టోఫెల్‌ ఎత్తివేత.. అమ్మ ఒడికి ఎగనామం

గత ప్రభుత్వంలో స్కూల్‌ తెరిచిన తొలి రోజే విద్యా కానుక 

వివక్ష లేకుండా విద్యార్థులందరికీ కిట్ల పంపిణీ..

బడికి పిల్లలను పంపే తల్లులకు అమ్మ ఒడి ద్వారా ఏటా రూ.15 వేల సాయం

రాష్ట్రంలో ప్రభుత్వ బడుల్లో చదువులు గాడి తప్పాయా? విద్యార్థులందరికీ యూనిఫాం అందలేదా?కొంత మందికే బూట్లు ఇచ్చారా? టీచర్ల కొరత వేధిస్తోందా? మధ్యాహ్నం పిల్లలకు రుచీపచీ లేని భోజనం పెడుతున్నారా? ఇదివరకటి మెనూ అమలు కావడం లేదా? వంట వాళ్లను ఇష్టానుసారం మార్చేస్తున్నారా? టోఫెల్‌కు మంగళం పాడారా? ఇంగ్లిష్‌ మీడియంను చిన్నచూపు చూస్తున్నారా? స్టూడెంట్‌ కిట్లను కూటమి నేతలు పంపిణీ చేస్తున్నారా?.... ఈ ప్రశ్నలన్నింటికీ ప్రతి జిల్లాలో,ప్రతి ఊళ్లో, ప్రతి ఒక్కరూ ‘అవును’ అని సమాధానమిస్తున్నారు. ఇన్నాళ్లూ బంగారంలా చక్కగా సాగిపోతున్న చదువులకు గ్రహణం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సాక్షి, అమరావతి/ సాక్షి నెట్‌వర్క్‌: రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపు రెండు నెలలు సమీపిస్తున్నా ఇప్పటికీ ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫారం, బ్యాగులు అందలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేదింటి పిల్లలకు బడి తెరిచిన మొదటి రోజే అందాల్సిన స్టూడెంట్‌ కిట్లు ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో అందించండంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది. గత విద్యా సంవత్సరం వరకు వేడుకగా సాగిన చదువులను నిస్తేజంగా మార్చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 60 శాతం మంది విద్యార్థులకు యూనిఫారం అందనే లేదు. చాలా జిల్లాలకు బ్యాగులు చేరలేదు. పుస్తకాలు సైతం అందరికీ పంపిణీ చేయలేదు. 

ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు ప్రతిరోజు పుస్తకాలు, బ్యాగులు, ఇతర విద్యా సమగ్రిని ’సర్దుబాటు’ చేసుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. స్కూళ్లకు చేరిన వస్తువులను సైతం స్థానిక కూటమి నేతల చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేస్తున్నారు. ‘ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ కార్యకర్తలకు ప్రాధాన్యం ఉంటుంది. అన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలు వారి చేతుల మీదుగానే జరుగుతాయి. 

ఇది మీకు నేను ఇస్తున్న వాగ్దానం’ అని ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన నేపథ్యంలో పుస్తకాల పంపిణీలో కూడా ‘తమ్ముళ్లు’ భాగస్వాములవుతున్నారు. పంపిణీ ఆలస్యం అవడానికి ఇది కూడా ఓ కారణం. రెండు నెలలుగా విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ ప్రహసనంగా సాగుతోంది. ఈ నెలాఖరున ఫార్మాటివ్‌ అసెస్‌మెంట్‌–1 పరీక్షలు ఉన్న నేపథ్యంలో విద్యార్థులు పుస్తకాల కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది.   

35.60 లక్షల కిట్లకు ఆర్డర్‌.. అందినవి అంతంతే.. 
ప్రస్తుత (2024–25) విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం గతేడాది సెపె్టంబర్‌లో విద్యా కానుక కిట్ల సరఫరాకు విద్యా శాఖ ఆర్డర్‌ పెట్టింది. హైస్కూల్‌ విద్యార్థులకు అన్ని సబ్జెక్టుల పాఠ్య పుస్తకాలు, నోట్‌ బుక్స్, టోఫెల్‌ వర్క్‌ బుక్, ఫ్యూచర్‌ స్కిల్స్‌ సబ్జెక్ట్‌ పుస్తకంతో పాటు 3 జతల యూనిఫాం క్లాత్, స్కూల్‌ బ్యాగ్, బెల్ట్, ఆక్స్‌ఫర్డ్‌ నిఘంటువు.. 1–5 తరగతుల విద్యార్థులకు వర్క్‌ బుక్స్, పిక్టోరియల్‌ డిక్షనరీ అందించాలి. గత నాలుగేళ్లుగా ఇదే ప్రక్రియ కొనసాగింది. 

ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 35.60 లక్షల స్టూడెంట్‌ కిట్ల సరఫరాకు సమగ్ర శిక్షణ ఆదేశాలు జారీ చేసింది. అన్ని వస్తువులను మే చివరి నాటికి మండల స్టాక్‌ పాయింట్లకు చేర్చి, అక్కడి నుంచి జూన్‌ మొదటి వారంలో ఆయా స్కూళ్లకు తరలించి కిట్‌గా రూపొందించాలి. బడులు తెరిచిన మొదటి రోజే 9 వస్తువులతో కూడిన కిట్‌ను విద్యార్థులకు నేరుగా స్కూల్లోనే అందించాలి. ఇందులో ఎలాంటి రాజకీయ జోక్యం ఉండకూడదు. 

కొత్తగా చేరే విద్యార్థులకు మండల స్టాక్‌ పాయింట్‌ నుంచి ఎప్పటికప్పుడు తెప్పించి ఇవ్వాలి. కానీ ఈ ఏడాది అందుకు భిన్నంగా జరుగుతోంది. గత విద్యా సంవత్సరంలో మిగిలిన 90 వేల కిట్లు మాత్రమే నూరు శాతం  పంపిణీ చేశారు. ఆపై కంపెనీల నుంచి వస్తున్న వస్తువులను స్కూళ్లకు ఇంకా పంపిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు విద్యా కానుక కిట్‌లో అందించే 9 వస్తువుల్లో ఏ ఒక్కటీ స్కూల్‌కు సరిపడినన్ని ఇవ్వకపోవడం గమనార్హం. 

 

జగన్‌ సర్కారులో ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యం  
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని గత ప్రభుత్వం ప్రభుత్వ విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. సర్కారు బడిలో చదువుతున్న విద్యార్థులున్న తల్లిదండ్రులకు ఎలాంటి ఆర్ధిక భారం ఉండకూడదన్న లక్ష్యంతో ‘జగనన్న విద్యా కానుక’ (జేవీకే)ను 2020–21 విద్యా సంవత్సరం నుంచి తీసుకొచ్చింది. ఈ విద్యార్థులు కార్పొరేట్‌ స్కూల్‌ విద్యార్థులకు సమానంగా ఆత్వవిశ్వాసంతో బడికి వెళ్లాలని రూ.2,900 విలువైన కిట్‌లో నాణ్యమైన స్కూలు బ్యాగు, టెక్స్స్ట బుక్స్, నోటు పుస్తకాలు, జత బూట్లు, రెండు జతల సాక్సులు, వర్క్‌బుక్స్‌ (ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు), ఇంగ్లిష్‌–తెలుగు ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ(హైస్కూల్‌), పిక్టోరియల్‌ డిక్షనరీ, మూడు జతల యూనిఫారం క్లాత్, బెల్టు, టై అందించింది. 

వస్తువుల నాణ్యతను పరిశీలించేందుకు భారత ప్రభుత్వం మద్దతుతో లాభాపేక్ష లేకుండా నడుస్తున్న ‘క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా’ సంస్థకు అప్పగించింది.  2024–25 విద్యా సంవత్సరానికి రూ.1,042.51 కోట్లతో విద్యా కానుక కిట్ల సరఫరాకు గత సెపె్టంబర్‌ నెలలోనే ఆదేశాలు జారీ చేసింది. 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు మొదటి సెమిస్టర్‌లో బోధించే 3.12 కోట్ల పాఠ్యపుస్తకాలతో పాటు ఈ విద్యా సంవత్సరం అదనంగా టోఫెల్‌ వర్క్‌బుక్, ఫ్యూచర్‌ స్కిల్స్‌ సబ్జెక్ట్‌ పుస్తకం కూడా అందించాలి. కానీ 80 శాతం పుస్తకాలను సరఫరా చేసి, మిగిలిన వస్తువులను అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది.   

‘సర్దుబాటు’తో నెట్టుకొస్తున్న వైనం  
గతంలో విద్యా కానుక కిట్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడంతో వస్తువుల సరఫరాదారు నుంచి పాఠశాలకు చేరే దాకా ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉండేది. ఈ ఏడాది ప్రభుత్వ నిర్లక్ష్యంతో అంతా తారుమారైంది. విద్యార్థులకు ఒక వస్తువు ఇస్తే మరో వస్తువు అందే పరిస్థితి లేదు. యూనిఫారాలు ఇప్పటికీ బడులకు చేరలేదు. వస్తువుల కొరత కారణంగా ప్రతి మండలంలో ఏరోజుకారోజు వస్తువులను ఒక స్కూల్‌ నుంచి మరో స్కూల్‌కు సర్దుబాటు చేస్తున్నారు. 

ముఖ్యంగా పుస్తకాల విషయంలో ప్రతిరోజు విద్యార్థుల చేరికను బట్టి స్టాక్‌ ఉంచుకుని మిగిలిన వాటిని ఉన్నతాధికారులు సూచించిన స్కూలుకు తరలిస్తున్నారు. ఇక్కడి బడిలో విద్యార్థులు చేరితే, ఆ మేరకు వస్తువులను ఇంకో స్కూల్‌ నుంచి తరలిస్తున్నారు. ఇదిలా ఉంటే అందిన వస్తువులను సైతం విద్యార్థులకు వెంటనే అందించకుండా బడుల్లో స్టాక్‌ పెట్టి, స్థానిక కూటమి నాయకులు వస్తేనే వారి చేతుల మీదుగా పంపిణీ చేస్తున్నారు. 

నాయకులు రానిచోట వస్తువుల పంపిణీ నిలిపేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు సైతం చేష్టలుడిగి చూస్తున్నారు. దీంతో జూన్‌ 13న స్కూళ్లు తెరిచిన నాటి నుంచి ఆగస్టు వచ్చినా పంపిణీ ప్రక్రియ ప్రహసనంగా కొనసాగుతోంది.

టోఫెల్‌కు రాం రాం.. 
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పిల్లల్లో ఇంగ్లిష్‌ ప్రావీణ్యం పెంపొందించాలనే లక్ష్యంతో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఎంతో చొరవ తీసుకుని టోఫెల్‌ క్లాసులు ప్రవేశపెట్టింది. ఇందుకోసం ప్రత్యేక పీరియడ్‌ కూడా కేటాయించింది. 3–5 తరగతుల పిల్లల కోసం టోఫెల్‌ ప్రైమరీ, 6–9 తరగతుల వారి కోసం టోఫెల్‌ జూనియర్‌ క్లాసులు నిర్వహించి మార్చిలో పరీక్షలు కూడా జరిపింది. తాజాగా కూటమి ప్రభుత్వం ఆ పరీక్ష ఫలితాలు ప్రకటించకపోగా, ఏకంగా టోఫెల్‌కే తిలోదకాలు ఇచ్చింది. 

పేదలకు ఇంగ్లిష్‌ మీడియమే ఎక్కువ.. అనుకుంటుంటే ఆ భాషపై మరింత పట్టు సాధించేలా టోఫెల్‌ అవసరమే లేదని ప్రభుత్వ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారని స్పష్టమవుతోంది. దీనికి తోడు అమ్మ ఒడి (తల్లికి వందనం) పథకం అమలు చేస్తారో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు మార్గదర్శకాలు కూడా విడుదల కాక పోవడం చూస్తుంటే ఈ పథకానికీ ఈ ఏడాది మంగళం పాడినట్లేనని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ ఏటా రూ.15 వేల చొప్పున ఇస్తామని చంద్రబాబు సహా కూటమి నేతలు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. తీరా గద్దె నెక్కాక ఈ పథకం అమలు గురించి మాట్లాడటమే మానేయడం గమనార్హం. గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పిల్లలను బడికి పంపే తల్లులకు అమ్మ ఒడి పథకం కింద ఏటా రూ.15 వేలు సాయం అందించింది.

జిల్లాల్లో ఇదీ పరిస్థితి
అనంతపురం జిల్లాలో 450కి పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నాయి. జిల్లాలోని ఏ ఒక్క స్కూల్‌కూ యూనిఫాం క్లాత్‌ చేరలేదు. కొన్ని స్కూళ్లకు బూట్లు, మరి కొన్ని స్కూళ్లకు డిక్షనరీలు అందలేదు. జిల్లాలో 677 మధ్యాహ్న భోజన ఏజెన్సీల నిర్వాహకులను మార్చారు. ఆహారంలో నాణ్యత లోపించింది.  

⇒ శ్రీసత్యసాయి జిల్లాలో 345 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాకు మంజూరైన విద్యా కానుక కిట్లు 1,38,634 పంపిణీ చేసినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ, పలు చోట్ల విద్యార్థులకు కొన్ని వస్తువులు అందలేదు. కిట్లు పక్కదారి పట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. 1,438 మధ్యాహ్న భోజన ఏజెన్సీల నిర్వాహకులను మార్చివేశారు. చాలాచోట్ల భోజనం నాణ్యతగా ఉండడం లేదు. కొన్ని చోట్ల కోడిగుడ్లను స్వాహా చేస్తున్నారు. 

⇒ ఉమ్మడి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం బృందావనంలోని ప్రాథమిక పాఠశాలలో ఒక్క ఉపాధ్యాయుడు కూడా లేరు. ఇటీలవల ఆళ్లగడ్డ పట్టణంలోని పాఠశాలలో పని చేస్తున్న ఓ ఉపాధ్యాయున్ని తాత్కాలికంగా డిప్యుటేషన్‌పై పంపారు. జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్న భోజనం సరిగా అమలు కావడం లేదు. వంట ఏజెన్సీలు మార్చాలని టీడీపీ నేతలు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. 1,07,225 మంది విద్యార్థులకు యూనిఫామ్స్‌ ఇవ్వాల్సి ఉంది. 2,600 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.     

⇒ చిత్తూరు జిల్లాలో అన్ని పాఠశాలల్లో గోరుముద్ద పేరు తొలగించి, ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం’ అని బోర్డు రాయిస్తున్నారు. కొద్ది రోజులుగా దాదాపు 10 వేల మంది విద్యార్థులు ఇంటి నుంచి భోజనం తెచ్చుకుంటున్నారు. 909 టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నా­యి. ఆక్స్‌ఫోర్డ్‌ డిక్షనరీ ఇంకా అందలేదు. తిరుపతి జిల్లాలో దాదాపు 4 వేల జతల బూట్ల కొలతల్లో తేడా రావడంతో పంపిణీ చేయలేదు.  

⇒ వైఎస్సార్‌ జిల్లాలో మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపించింది. దీంతో చాలా మంది విద్యార్థులు తినేందుకు ఆసక్తి చూపడం లేదు. మండల స్థాయికి కిట్లు అందినా, పూర్తి స్థాయిలో పంపిణీ కాలేదు.   

⇒ ప్రకాశం జిల్లాలో చాలా ప్రాంతాల్లోని స్కూళ్లలో మధ్యాహ్న భోజనం సరిగా ఉండటం లేదు. బియ్యంలో నాణ్యత లేదు. స్టాండర్డ్‌ మెనూ ఉండటం లేదు. కోడిగుడ్ల సైజు తగ్గింది. వందల సంఖ్యలో ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి. కంభం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వాటర్‌ ప్లాంట్‌ పని చేయడం లేదు. దీంతో విద్యార్థులకు బోరు నీరే దిక్కయింది. ఇంకా 20 శాతం మంది విద్యార్థులకు విద్యా కానుక కిట్‌ పంపిణీ చేయాల్సి ఉంది.   

⇒ ఉమ్మడి కృష్ణా జిల్లాలో 1,208 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలో వివిధ విద్యా సంస్థల్లో 140 మంది సబ్జెక్టు టీచర్ల కొరత ఉంది.  
⇒ అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలో నాలుగు ప్రాథమిక పాఠశాలలు ఈ ఏడాది మూతపడ్డాయి. ఆంగ్ల మాధ్యమాన్ని కొనసాగిస్తారో లేదోనన్న అనుమానంతో తమ పిల్లలను ప్రైవేట్‌ పాఠశాలల్లో చేర్చించామని తల్లిదండ్రులు చెబుతున్నారు. బేతపూడి ఎంపీపీ స్కూల్, సీతంపేట ఎంపీపీ స్కూల్, కె.ఎం పాలెం పంచాయితీలో గల ఎండపల్లిపాలెం ఎంపీపీ స్కూల్, మారేపల్లి పంచాయితీ శివరామచేనులపాలెంలో ఎంపీపీ స్కూళ్ల విద్యార్థులు ప్రైవేట్‌ పాఠశాలల్లో చేరారు.   

⇒ ఏలూరు జిల్లాలో 1035 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి. విద్యా కానుక కిట్లు వైఎస్సార్‌సీపీ హయాంలో సిద్ధం చేసినవే పంపిణీ చేశారు.  పశి్చమగోదావరి జిల్లాలో వందకు పైగా ఉపాధ్యాయ పోస్టుల  ఖాళీలు ఉన్నాయి. మధ్యాహ్న భోజనం బాగోలేదని పిల్లలు చెబుతున్నారు.  పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఇదే పరిస్థితి. కిట్లు పూర్తి స్థాయిలో పంపిణీ కాలేదు. కోనసీమ జిల్లాలో 464 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది.  

ఐఆర్‌ వెంటనే ప్రకటించాలి
ఏపీ జేఏసీ అమరావతి
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే ఐఆర్‌ ప్రకటించాలని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు 
బొప్పరాజు, కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తక్షణమే 12వ పీఆర్సీ కమిషన్‌ను నియమించాలన్నారు. విజయవాడలోని రెవెన్యూ భవన్‌లో శనివారం నిర్వహించిన ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వీరు పాల్గొన్నారు. 12వ పీఆర్సీ కమిషనర్‌ రాజీనామా చేసినందున వెంటనే కొత్త కమిషనర్‌ను నియమించాలన్నారు. మహిళా ఉద్యోగులపై లైంగిక, ఇతర వేధింపులపై ఫిర్యాదుల కోసం ప్రతి కలెక్టరేట్‌లో 
‘షీ బాక్స్‌’లు ఏర్పాటు చేయాలని కోరారు. మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం కల్పించిన పిల్లల సంరక్షణ సెలవుల అమలుపై ఆర్థిక శాఖ నుంచి ఉత్తర్వులివ్వాలని పేర్కొన్నారు.  
    – సాక్షి, అమరావతి

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఏదీ?
ఏబీవీపీ  

పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కల్పిస్తూ ప్రత్యేకంగా జీవో తెస్తానని యువగళం పాదయాత్రలో నారా లోకేశ్‌ ఇచ్చిన హమీ మేరకు జీవో మంజూరు చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.యచంద్ర డిమాండ్‌ చేశారు. జీవో–77 రద్దు చేసేంత వరకు పీజీ కౌన్సెలింగ్‌ ప్రక్రియను నిలిపివేయాలని ఏబీవీపీ నాయకులు ఏపీ ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌ రామ్మోహనరావును మంగళగిరిలోని ఆయన కార్యాలయంలో శనివారం కలిసి వినతిపత్రమిచ్చారు. జీవో 77ను రద్దు చేసి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కల్పిస్తూ మరో జీవో విడుదల చేసిన తర్వాతే పీజీ సెట్‌ కౌన్సెలింగ్‌ చేపట్టాలన్నారు. ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెంకట గోపి మాట్లాడుతూ జీవో–77 రద్దు చేయని పక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి పిలుపునిస్తుందన్నారు.  
– మొగల్రాజపురం (విజయవాడ తూర్పు)

సర్కారు వారూ..సమస్యలివిగో..!
ఉద్యోగ భద్రత కల్పించాలి
‘ఔట్‌ సోర్సింగ్‌’ ఉద్యోగులు
రాష్ట్రంలో ఆరోగ్య (ఎన్టీఆర్‌ వైద్య సేవ) పథకం కింద సేవలందిస్తున్న వైద్య మిత్రలకు ఉద్యోగ భద్రత కల్పించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఏపీ వైద్య సేవ దళిత, గిరిజన కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమాఖ్య ప్రతినిధులు కోరారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం పల్లాను కలిసిన ప్రతినిధులు గత 17 ఏళ్లుగా పనిచేస్తున్నామని, తమకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. అదే విధంగా సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు, ఉద్యోగ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాలని కోరారు. పల్లాను కలిసి వారిలో సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు మాచర్ల బుజ్జి, ప్రధాన కార్యదర్శి ప్రత్యూష ఉన్నారు.     
 – సాక్షి, అమరావతి

ఈహెచ్‌ఎస్‌ పరిధి పెంచాలి
ఏపీ ఉపాధ్యాయ సంఘం
ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఉచిత వైద్య సదుపాయాలతో పాటు ఈహెచ్‌ఎస్‌ అమల్లో తలెత్తుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘం (ఆపస్‌) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాలాజీ, సత్యనారాయణ, సంఘం నేతలు శనివారం ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్‌ యాదవ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీం (ఈహెచ్‌ఎస్‌) పథకంలో కొన్ని ఆస్పత్రులు నగదు రహిత వైద్యసేవలు అందించడం లేదని, ఈ మేరకు మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ సౌకర్యాన్ని కల్పించాలని మంత్రిని కోరారు. అలాగే రీయింబర్స్‌మెంట్‌ సీలింగ్‌ను రూ.5లక్షలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు.     
 – సాక్షి, అమరావతి

పదోన్నతులు ఇవ్వాలి
టీఎన్‌యూఎస్‌
డీఈవో పూల్‌లో ఉన్న భాషా పండితులకు పదోన్నతి కల్పించాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం (టీఎన్‌యూఎస్‌) ప్రభుత్వానికి  విజ్ఞప్తి చేసింది. స్కూల్‌ అసిస్టెంట్‌ లాంగ్వేజెస్‌కు భాషా పండితులు మాత్రమే అర్హులుగా కాగా, 2019లో లాంగ్వేజ్‌ పండిట్ల పోస్టులను అప్‌గ్రేడ్‌ చేసి సెకండ్‌ గ్రేడ్‌ టీచర్లు కూడా అర్హులుగా పరిగణించడంతో దాదాపు 1,100 మంది భాషా పండితులకు డీఈవో పూల్‌లో చోటు దక్కలేదని సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంగా ఐదేళ్లుగా ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు మన్నం శ్రీనివాస్, శ్రీరామిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాఠశాల విద్య డైరెక్టర్‌ విజయరామరాజుకు శనివారం విజ్ఞప్తి చేశారు.  
    –  సాక్షి, అమరావతి

సబ్సిడీ సరిచేయాలి
గొర్రెలు, మేకల పెంపకందార్లు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకల షెడ్ల నిర్మాణానికి సబ్సిడీ అందించడంలో ఉన్న వ్యత్యాసాన్ని సరిచేసి అందరికీ సమన్యాయం చేయాలని మంత్రి అచ్చెన్నాయుడికి ఆంధ్రప్రదేశ్‌ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం విజ్ఞప్తి చేసింది. విజయవాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయనను కలిసి సంఘం నేతలు వినతిపత్రమిచ్చారు. 

ప్రభు­త్వం గేదెలు, ఆవుల షెడ్ల నిర్మాణానికి 90­శాతం, గొర్రెలు, మేకల షెడ్ల నిర్మాణానికి 70శాతం సబ్సిడీని ప్రకటించిందని, అలా కాకుండా అన్నింటికి 90శాతం సబ్సిడీ ఇవ్వాలని కోరారు. వర్షాకాలం సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా అంటువ్యాధులు ప్రబలి గొర్రెలు మేకలు మృత్యువాత పడుతున్నాయని, వాటిని కాపాడుకునేందుకు అవసరమైన టీకాలు, డీ వారి్మంగ్‌ మందులు ఉచితంగా అందించాలన్నారు.    
 – సాక్షి, అమరావతి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement