బడి శిథిలం సమస్యలు పదిలం | this academic year some frobloms in government schools | Sakshi
Sakshi News home page

బడి శిథిలం సమస్యలు పదిలం

Published Fri, Jun 10 2016 2:33 AM | Last Updated on Tue, Oct 2 2018 7:58 PM

బడి శిథిలం సమస్యలు పదిలం - Sakshi

బడి శిథిలం సమస్యలు పదిలం

కొత్త విద్యాసంవత్సరంలోనూ మారని దుస్థితి
గదులు లేక చెట్ల కిందే తరగతులు

 భావి భారత పౌరులను తీర్చిదిద్దే బడులు.. సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. సర్కారు బడుల్లో సరైన వసతులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. నూతన విద్యాసంవత్సరం ప్రారంభమవుతున్న వేళ పాఠశాలలను ఓసారి పరిశీలిస్తే దయనీయంగా ఉన్నాయి.  కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి ఉన్న జిల్లా కేంద్రంలోనే.. ప్రభుత్వ బాలుర పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలు చాలాచోట్ల తరగతిగదులు శిథిలావస్థకు చేరుకున్నాయి.

అదనపు తరగతి గదులు లేక చెట్లకిందే తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 759 ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా మైదానాలు లేవు.  267 స్కూలు భవనాలు అసంపూర్తి దశలోనే ఉండగా, 167 స్కూళ్ల భవనాలు శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. 1,260 పాఠశాలల్లో నీటి సౌకర్యం సైతం లేదు. ప్రభుత్వం పాఠశాలల్లో మౌలికవసతుల కల్పనపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఉపాధ్యాయసంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. - సాక్షి, సంగారెడ్డి

కూలేందుకు సిద్ధంగా ఉన్న భవనాలు 167 క్రీడా మైదానాలు లేని పాఠశాలలు 759  అసంపూర్తి దశలో నిర్మాణాలు 267  నీటి సౌకర్యం లేని బడులు 1,260 

నారాయణఖేడ్‌లో సగంపైగా ఖాళీలు
నారాయణఖేడ్: మండలంలో 104 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. మన్సుర్‌పూర్ పాఠశాల గోడలకు పెద్ద పెద్ద రంధ్రాలు పడ్డాయి. 16 పాఠశాలలకు ఉపాధ్యాయులు లేరు. 56 పాఠశాలలకు తాగునీటి సదుపాయాలు లేవు. మనూరు మండలంలో 91 పాఠశాలకు 310 మంది ఉపాధ్యాయులు అవసరం ఉండగా 200 మంది పనిచేస్తున్నారు. కల్హేర్ మండలంలో 60, కంగ్టి మండలంలో 162 ఉపాధ్యాయు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కంగ్టి మండలంలో 49 పాఠశాలలకు అసలు ఉపాధ్యాయులే లేరు.

వర్షం పడితే ‘ఆందోలు’నే!
జోగిపేట: నియోజకవర్గం పరిధిలో చాలా పాఠశాలల్లో ఒక్కో గదిలో రెండు లేక మూడు తరగతులు నిర్వహిస్తున్నారు. మరికొన్నింట్లో వరండాల్లో బోధన కొనసాగిస్తున్నారు.  జోగిపేటలో ఒకే కాంపౌండ్‌లో ఐదు పాఠశాలలు నడుస్తున్నాయి. రాయికోడ్ మండలంలో 24 ప్రాథమిక, 18 ప్రాథమికోన్నత, 5 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఒకటి రెండు మినహా ఎక్కడా తాగునీటి వసతి లేదు. దాదాపు 80 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు సమాచారం. అల్లాదుర్గం మండలంలో ప్రాథమిక పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. గడిపెద్దాపూర్ జిల్లాపరిషత్ పాఠశాలను 50 ఏళ్ల క్రితం నిర్మించారు. పైరేకులు పగిలిపోవడంతో వర్షం వస్తే గదులన్నీ నీళ్లే!రేగోడ్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 156 మంది విద్యార్థులకు ఐదుగురు టీచర్లు మాత్రమే ఉన్నారు. 

దుబ్బాకలో ప్రహరీలు కరువు
దుబ్బాక: దుబ్బాక మండల పరిధి అనేక పాఠశాలలకు ప్రహరీలు కరువయ్యాయి. దౌల్తాబాద్ మండలంలో 60 ప్రభుత్వ పాఠశాలల్లో ఆరువేల మంది విద్యార్థులు చదువుతుండగా 282 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 60 పాఠశాలలకు 32 చోట్ల మాత్రమే ప్రహరీలున్నాయి. తాగునీటి సౌకర్యం 13 పాఠశాలలకు లేదు. బాలికలకు 48, బాలురకు 51 చోట్ల టాయ్‌లెట్‌లు ఉన్నా నీటి వసతి లేదు. 14 పాఠశాలలకు వంటగదులు లేవు. చేగుంట మండలంలో ప్రాథమిక పాఠశాలకు 42, ప్రాథకోన్నత పాఠశాలలకు 20, ఉన ్నత పాఠశాలలకు 22 అదనపు తరగతి గదుల అవసరం ఉంది.

 సిద్దిపేట.. శిథిలావస్థ
సిద్దిపేట జోన్: నియోజకవర్గంలోని అత్యధిక పాఠశాలలకు ప్రహరీలు, వంటగదులు, క్రీడామైదానాలు లేవు. కొన్ని స్కూళ్లకు నూతన భవనాలు నిర్మించినా వినియోగంలోకి తీసుకురాలేదు. సిద్దిపేట మండలంలో తడ్కపల్లి, మిట్టపల్లి, పుల్లూర్ జెడ్పీహెచ్‌ఎస్‌లు శిథిలస్థితికి చేరాయి. చిన్నగుండావెల్లి, ఎన్సాన్‌పల్లి, రావురూకుల గ్రామాల్లో వంటగదుల సమస్య ప్రధానంగా ఉంది. చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు, మందపల్లి ప్రభుత్వ పాఠశాలలు అధ్వానంగా మారాయి. పెద్దకోడూరు, రామంచ, చెర్లఅంకిరెడ్డిపల్లి, గోపులపూర్, రామునిపట్ల, అల్లీపూర్, మాచాపూర్‌లో ప్రహరీలు, వంటగదులు, మైదానాల సమస్యతో పాటు మంచినీటి ఇబ్బందులు ఉన్నాయి. నంగునూరు మండల పరిధిలో ఓబులాపూర్, నాగారాజుపల్లి పాఠశాలలు శిథిలస్థితికి చేరాయి.

 మెదక్‌లో నిద్రావస్థ
మెదక్: నియోజకవర్గంలో మొత్తం 304 పాఠశాలలుండగా సుమారు 50 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 43 పాఠశాలలు శిథిలావస్థకు చేరాయి. 182 స్కూళ్లలో ఒక్కో గతి గదుల్లో రెండు, మూడు తరగతులు కొనసాగుతున్నాయి. అదేవిధంగా సుమారు 200 పైచిలుకు పాఠశాలలకు తాగునీటి సౌకర్యం సరిగాలేదు. చిన్నశంకరంపేట జెడ్పీహెచ్‌ఎస్‌లో 600 మంది విద్యార్థులు ఉండగా కేవలం ఒక్క టాయిలెట్ మాత్రమే ఉంది. వీరిలో 300 పైగా బాలికలే ఉన్నారు. అంతేకాకుండా మండలంలోని మారుమూల ప్రాంతాల పాఠశాలల్లో ఉపాధ్యాయులు వంతులవారీగా విధులకు హాజరవుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.

గజ్వేల్‌లో ప్రమాదఘంటికలు
గజ్వేల్: 113 మంది చిన్నారులున్న మండలంలోని రిమ్మనగూడ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలమైంది. దీంతో పక్కనున్న రెండు గదుల్లో ఐదు తరగతులు నిర్వహిస్తున్నారు. మండలంలోని అనేక పాఠశాలలకు ప్రహరీలు, వంటగదులు లేవు. ములుగు మండలంలోని స్కూళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. జగదేవ్‌పూర్ మండలంలో 8 ఉన్నత పాఠశాలలకు వంటగదులు లేవు. ఏళ్ల కిందట నిర్మించిన కొండపాక బాలికల హైస్కూల్‌లో ఇంకా బోధన జరుగుతోంది. 

 సమస్యల సంగారెడ్డి 
సాక్షి, సంగారెడ్డి: నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలు సమస్యలకు నెలవుగా మారాయి. సంగారెడ్డితో పాటు సదాశివపేట, కొండాపూర్ మండలాల్లో వసతులు కరువయ్యాయి. విద్యార్థుల సంఖ్యను అనుగుణంగా తరగతి గదులు లేవు. క్రీడామైదానాలు కూడా లేవు. సంగారెడ్డి మండలంలో 65 ప్రాథమిక, 38 ప్రాథమికోన్నత, 16 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉండగా, వీటిలో కనీసం 50 శాతం కూడా వసతులు లేవు. కల్పగూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కేవలం రెండు గదులు మాత్రమే కూర్చోవడానికి వీలుగా ఉన్నాయి.  చింతల్‌పల్లి, ఇరిగిపల్లి ప్రాథమిక పాఠశాలల్లో పాత భవనాలు కూల్చి..

కొత్తవాటిని నిర్మించలేదు. అంగడిపేట, నాగాపూర్, మహ్మద్‌షాపూర్ తండా, ఫసల్‌వాది, కొత్లాపూర్, ఉత్తర్‌పల్లి తదితర గ్రామాల్లో తరగతి గదులన్నీ పురాతనమైపోయాయి. సదాశివపేట బాలుర ఉన్నత పాఠశాల కూలేందుకు సిద్ధంగా ఉంది. కొండాపూర్ మండల పరిధిలోని తేర్పోల్, మల్కాపూర్, కుతుబ్‌షాహీపేట్, కిష్టయ్యగూడెం, తొగర్‌పల్లి, అనంతసాగర్, గొల్లపల్లి, ఎదురుగూడెం, మారెపల్లి గ్రామాల్లో సరపడా గదులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుత్‌బ్‌షాహీపేట ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరింది. కొండాపూర్‌లో జూనియర్ కాలేజీ, పాఠశాలలు ఒకే భవనంలో కొనసాగుతుండటంతో బోధన అస్తవ్యస్తంగా మారింది.

పటాన్‌చెరులో అరకొర వసతులు
పటాన్‌చెరు: పారిశ్రామికవాడల్లో పాఠశాల భవనాలు మరమ్మతులకు నోచుకోవడం లేదు. ఎంపీ దత్తత తీసుకున్నలక్డారంలో ప్రాథమిక పాఠశాల శిథిలస్థితికి చేరింది. పటాన్‌చెరు మండల పరిధిలోని అనేక గ్రామాల్లోని పాఠశాలలకు నూతన భవనాల అవసరం ఉంది. పట్టణంలోని బాలిక జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలోని ఓ గదిలో రేకుల కుప్పలు పోశారు. ప్రాథమిక పాఠశాలలోనే డిగ్రీ తరగతులు నిర్వహిస్తున్నారు. జిన్నారం మండలంలో లక్ష్మాపూర్, దూబగుంట, వావిలాల, వీరారెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement