పాఠశాలలకు నిధులేవి?
‘‘చాక్‌పీసులు, డస్టర్లు కొనలేకపోతున్నాం. పిల్లలకు అవసరమైన చార్టులు,పుస్తకాలు తెద్దామంటే డబ్బులు లేవు. సమావేశాలకు వచ్చే టీచర్లకు టీ, స్నాక్స్ ఇవ్వలేక పోతున్నాం. మొత్తంగా పాఠశాలల నిర్వహణ ఇబ్బందిగా మారిందని ప్రధానోపాధ్యాయులు వాపోతున్నారు. పాఠశాలలకు రావాల్సిన గ్రాంట్లను ప్రభుత్వం ఈసారి ఇంతవరకు విడుదల చేయకపోవడమే ఇందుకు కారణం.విద్యాసంవత్సరం ప్రారంభమై మూడు నెలలు కావస్తోంది. అయినా గ్రాంట్లు విడుదల కాలే. మరి సర్కారు దయ తలుస్తుందో లేదో వేచిచూడాల్సిందే.
- జిల్లాకు రావాల్సినవి రూ.3.05 కోట్లు
- చాక్‌పీసులు కొనడమూ కష్టమే!
- నిర్వహణ కష్టంగా మారిందంటున్న ప్రధానోపాధ్యాయులు
మోర్తాడ్: పాఠశాలల నిర్వహణకు కేటాయించాల్సిన గ్రాంటు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తోంది. డబ్బులు రాక నిర్వహణ భారం మోయడం కష్టంగా మారిందని హెచ్‌ఎంలు వాపోతున్నా రు. విద్యా సంవత్సరం ఆరంభంలోనే పాఠశాలలకు నిధులను ప్రభుత్వం మంజూరు చేసేది. కాని ఈసారి ఎందుకో ఇంత వరకు నిధులు విడుదల చేయలేదు.
ఒక్కో పాఠశాలకు
ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.10 వేల చొప్పున ప్రభుత్వం కేటాయించేది. ఉన్నత పాఠశాలలకు గ్రాంటుతో పాటు మెయింటెనెన్స్ కింద అదనంగా రూ. ఏడు వేలను కేటాయించేవారు. దీంతో పాటు కాంప్లెక్స్ పాఠశాలలుగా ఉన్న ఉన్నత పాఠశాలలకు రూ. 20 వేలను కేటాయించేవారు.
జిల్లాలో
జిల్లాలో 1,573 ప్రాథమిక పాఠశాలలుగా ఉన్నాయి. రూ.10 వేల చొప్పున గ్రాంటు కింద రూ.1.57 కోట్లు రావాల్సి ఉంది. 265 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటికి రూ.10 వేల చొప్పున రూ. 26.50 లక్షలను కేటాయించాల్సి ఉంది. 461 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు, రూ. 17 వేల చొప్పున రూ. 78.37 లక్షలు రావాల్సి ఉంది. 461 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలలో 218 పాఠశాలలను కాంప్లెక్స్ పాఠశాలలుగా ఎంపిక చేశారు. కాంప్లెక్స్ పాఠశాలలకు రూ. 20 వేల అదనపు గ్రాంటు రావాలి. రూ. 43.60 లక్షల గ్రాంటును కాంప్లెక్స్ పాఠశాలలకు కేటాయించాల్సి ఉంది. జిల్లావ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు మొత్తంగా రూ. 3.05 కోట్ల గ్రాంటును ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. ఇంత వరకు నయాపైసా కేటాయించలేదు.
ఇబ్బందులేంటీ
ప్రభుత్వం నిధులను కేటాయించకపోవడంతో పాఠశాలల నిర్వహణ ఇబ్బందికరంగా మారిందని హెచ్‌ఎంలు చెబుతున్నారు. చాక్‌పీస్‌లు, డస్టర్‌లు, విద్యార్థులకు అవసరమైన చార్ట్‌లు, విజ్ఞానం అందించే పుస్తకాలు, ఇతరత్రా సామగ్రి కొనుగోలు చేయలేక పోతున్నామని తెలిపారు. కాంప్లెక్స్ పాఠశాలల పరిధిలోని ఉపాధ్యాయులకు ప్రతినెలా కాంప్లెక్స్ పాఠశాలలోనే సమావేశాలు నిర్వహిస్తారు. సమావేశానికి హాజరైన ఉపాధ్యాయులకు టీ, స్నాక్స్‌ను అందించాలన్నా ఇబ్బందికరంగా ఉందని కాంప్లెక్స్ పాఠశాలల హెచ్‌ఎంలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి గ్రాంటును మంజూరు చేయాలని పలువురు కోరుతున్నారు.