మగాళ్లమైతే బాగుండేది..
బీజింగ్: చైనాలో మహిళా ప్రొఫెసర్లు తాము ఎదుర్కొంటున్న లింగవివక్షపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే తాము మగాళ్లుగా పుడితే తమ అకడమిక్ కెరీర్ చాలా బాగుండేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీజింగ్ యూనివర్సిటీకి చెందిన లైఫ్ సైన్సెస్ విభాగం.. చైనాలోని ప్రొఫెసర్లలో లింగవివక్షతపై చేపట్టిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
వివిధ యూనివర్సిటీల్లో పనిచేస్తున్న 1600 మంది ప్రొఫెసర్ల అభిప్రాయాలను సేకరించగా.. వారిలో మహిళా ప్రొఫెసర్లు తాము ఎదుర్కొంటున్న లింగవివక్ష పట్ల తీవ్ర నిరాశలో ఉన్నట్లు వెల్లడైంది. పురుష ప్రొఫెసర్లతో పోలిస్తే మహిళా ప్రొఫెసర్ల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉందని 67 శాతం మంది అంగీకరించారు. అయితే సర్వేలో పాల్గొన్న పురుష ప్రొఫెసర్లలో కూడా 33 శాతం మంది ఒకవేళ మహిళలమై ఉంటే తమ అకడమిక్ కెరీర్ తక్కువ స్థాయిలో ఉండేదనే అభిప్రాయం వ్యక్తం చేయడం అక్కడున్న లింగవివక్షతకు అద్దం పడుతోంది.