ఆమె ఫేస్బుక్ పేజీ.. మొత్తం లైంగిక వేధింపులే!
న్యూఢిల్లీ : హార్వే వెయిన్‌స్టెన్ ఉదంతం తర్వత మొదలైన ‘మీటూ’ యాష్ ట్యాగ్ ఎలా ట్రెండ్అయ్యిందో తెలిసిందే. ఈ సందర్భంగా తమకూ ఎదురైన వేధింపులను పలువురు సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే దీని ఆధారంగా ఓ యువతి చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది. వివిధ యూనివర్సిటీలకు చెందిన అధ్యాపకుల బాగోతాలు వెలుగులోకి వస్తున్నాయి.
డేవిస్ పట్టణంలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో న్యాయ విద్య చదువుతున్న 24 ఏళ్ల రాయా సర్కార్(భారత సంతతికి చెందిన యువతి) తన ఫేస్బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. విశ్వవిద్యాలయంలో వేధించే అధ్యాపకుల పేర్లను ప్రస్తావిస్తూ తన ఫేస్ బుక్ పేజీల్లో పేర్లను తెలపాలంటూ ఆమె కోరింది. దీంతో, తమను వేధించిన అధ్యాపకుల పేర్లను కొందరు విద్యార్థులు ఇచ్చారు. ఆ పేర్లన్నింటినీ ఆమె తన ఫేస్ బుక్ పేజీలో విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 30 విశ్వవిద్యాలయాలకు చెందిన అధ్యాపకుల పేర్లు ఇందులో ఉన్నాయి.
ఇక్కడో విశేషం ఏమిటంటే, ఇండియాకు చెందిన 61 ప్రొఫెసర్ల పేర్లు ఇందులో ఉండటం. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన అధ్యాపకులే ఈ జాబితాలో ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా జాదవ్‌పూర్ యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ, జేఎన్‌యూ, కోల్‌కతాలో సెయింట్ జేవియర్ కాలేజీ అధ్యాపకులు కూడా ఉన్నారు. అయితే ఆమె ఇలా జాబితాను వెల్లడించడంపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంతమంది ఆమె చేసిన పనిని మెచ్చుకుంటుండగా, మరికొంతమంది మాత్రం ఇలా విచారణ లేకుండా అధ్యాపకుల పేర్లను వెల్లడించడం సబబు కాదని ఆరోపిస్తున్నారు. ఆయా పేర్లలో ఒకరిద్దరు నేరం రుజువైన వారు ఉన్నారన్నది వాస్తవమే అయినా.. మిగతా వాళ్లు అమాయకులై ఉండొచ్చన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ మంది ఆమె పోస్టును రిపోర్ట్ చేయడంతో ఫేస్బుక్ రాయా సర్కార్ అకౌంట్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే మళ్లీ కాసేపటికే అది పునరుద్ధరణ అయినట్లు రాయా మరో పోస్ట్ ద్వారా తెలిపింది.