
మాంటిస్సోరీ కోటేశ్వరమ్మ
పురస్కారం
తొమ్మిది పదులు నిండిన పసిపాప... అందరినీ ఆప్యాయంగా నోరారా ‘పాపా’ అని పిలిచే మాతృమూర్తి డాక్టర్ వి. కోటేశ్వరమ్మ. స్త్రీవిద్య కోసం పాటు పడ్డారు. విజయవాడలో మాంటిస్సోరీ విద్యాసంస్థలను స్థాపించారు. అతి తక్కువ ఫీజులకే విద్య అందించారు. మగవారు మాత్రమే సంస్థలు నడపగలరు అనుకునే రోజుల్లో... స్త్రీశక్తిని నిరూపించారు. ఆమె అందించిన ఈ విశిష్ట సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. ఈ సందర్భంగా శ్రీమతి వి. కోటేశ్వరమ్మతో సాక్షి సంభాషించింది.
విద్యాసంస్థలు స్థాపించాలనే ఆలోచన ఎలా కలిగింది?
మా తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధ్యాయులే. మా అమ్మగారు కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే టీచర్‌గా పనిచేశారు. ఆమె నా రెండవ ఏటే మరణించారు. ఆవిడతో నాకు సాన్నిహిత్యం లేకపోయినా, నాన్నగారు ఆవిడ గురించి తరచు చెబుతుండటంతో, ఆవిడకి ఉన్న పేరుప్రఖ్యాతులు అర్థం చేసుకున్నాను. ఆవిడ పేరు నిలబెట్టి, ఆవిడ పట్ల నా గౌరవాన్ని ప్రదర్శించాలనుకున్నాను. అలా మొదటగా ప్లే స్కూల్ ప్రారంభించాను. మాంటిస్సోరీ విద్యావిధానంలో పాఠశాల ప్రారంభించాను. మా స్కూల్ పేరు మాంటిస్సోరీ చిల్డ్రన్స్ హైస్కూల్. ఆ తరువాత నేను స్థాపించిన అన్ని సంస్థలకు అదే పేరు పెట్టాను.
ఇన్ని విద్యాసంస్థలు స్థాపించడం వెనుక ప్రేరణ?
భావిభారత పౌరులంతా పైకి రావాలనే కోరిక నాకు బలంగా ఉండేది. ఆ కోరికతోనే ఇన్ని విద్యాసంస్థలు స్థాపించాను.
మీరు ఇంత డైనమిక్‌గా పెరగడానికి స్ఫూర్తి ఎవరిది?
ఏదో ఒకటి చేయాలనే కోరిక నా మనసులో బలంగా ఉండేది. ఏదైనా పనిచేస్తే, ఆ పని అందరికంటె బాగా చేయాలని, పైకి ఎదగాలనే పట్టుదల, దీక్ష నాలో చిన్నతనం నుంచే ఉండేవి. ఆ దీక్షతోనే అన్ని పనులూ చేశాను. టీచింగ్ మీద ఉండే ప్రేమ, ఫలితం చూడాలనే ఆతురత, ఎంత చేసినా ఇంకా చేయాలనే తపన. వీటి వల్లే నేను ఏదైనా సాధించలిగాను.
తక్కువ ఫీజులతో విద్యాసంస్థలు ఎలా నడపగలిగారు?
నేను ఒక ఇల్లాలిని. నా ఆలోచనలు కూడా ఇల్లాలి ఆలోచనలలాగే ఉండేవి. ఏ ఇంట్లో అయినా భార్య తన భర్త ఆదాయాన్ని ఆధారం చేసుకుని ఇంటిని ఏ విధంగా నడుపుతుందో, నేను కూడా అదేవిధంగా.. వచ్చిన ఆదాయంతో మా సంస్థలను ప్రణాళికా బద్ధంగా నడిపాను. బడిని కూడా ఒక ఇంటిలాగే నడిపాను. అంతేకాదు, నేను చదువుకునే రోజుల్లో స్కూలు ఫీజులు కట్టడానికి చాలా ఇబ్బందిపడ్డాను. ఏ విద్యార్థీ అటువంటి ఇబ్బంది పడకూడదనుకున్నాను. అందుకే తక్కువ ఫీజులకు ఉత్తమ విద్య అందించాను. మరో కారణం... మా టీచర్లకు ప్రభుత్వమే జీతాలిచ్చేది. అందువల్ల విద్యార్థుల నుంచి తక్కువ ఫీజులు తీసుకునేవాళ్లం.
మీ దగ్గర చదువుకున్న కొందరు ప్రముఖుల గురించి...
ప్రముఖ కార్డియాలజిస్టు డా.పి.రమేష్‌బాబు, ఫోర్స్బ్ జాబితాలో చోటు దక్కించుకున్న సిస్కో సిఈవో పద్మశ్రీ వారియర్ మా స్కూల్‌లో చదివినవారే. వీరు కొందరు మాత్రమే. ఇంకా చాలామంది అమెరికాలో సెటిల్ అయినవారు ఉన్నారు.
విద్యార్థుల అభివృద్ధి చూస్తే మీకు ఎలా ఉండేది?
ఒక విద్యార్థికి స్టేట్ ఫస్ట్ ర్యాంకు వస్తే, మిగిలిన విద్యార్థులకి కూడా రావాలని ఆశించేదాన్ని. ఒకరు ఉన్నతస్థాయిలోకి వస్తే, మిగిలినవారు కూడా వస్తే బాగుంటుందనిపించేది.
మిమ్మల్ని ప్రభావితం చేసినవారెవరు?
గుంటూరు ఏకెసి కళాశాల ప్రిన్సిపాల్‌గా డా. సైప్స్ పనిచేసేవారు. ఆ కళాశాలలో అమెరికన్ విద్యా విధానం అమలులో ఉండేది. అక్కడ చదువుకునే రోజుల్లోనే నేను కూడా ఆ విద్యా విధానంలో ఒక కళాశాల ప్రారంభించాలనే కోరిక బయలుదేరింది. నేను బి.ఎస్‌సి. చదివాను. ఆ తరవాత ఉద్యోగం చేస్తూ ఎంఏ తెలుగు ప్రయివేట్‌గా చదివాను. ఆ వెంటనే పి.హెచ్‌డి చేశాను. ఆ తరువాత నేను కలగన్న విద్యా సంస్థలను ప్రారంభించాను.
ప్రత్యేకంగా మహిళల కోసం మాంటిస్సోరీ మహిళా కళాశాల పేరుతో, విద్యాసంస్థ ఏర్పాటు చేశారు కదా!
స్త్రీ విద్యకై పాటుపడాలని, వారిని ఉత్తేజపరచాలనే ఉద్దేశంతోనే ప్రత్యేకంగా మహిళా కళాశాల ప్రారంభించాను. అక్కడితో ఆగకుండా మరిన్ని సంస్థలు పెట్టాలనే కోరిక పెరుగుతూ ఉండేది. మా కళాశాలలో కొన్ని వేల మంది ఆడపిల్లలు చదువుకున్నారు. స్త్రీవిద్య గురించి కొందరు ప్రముఖులు ఉత్తరాదిన చేస్తున్న సేవ గురించి చదివినప్పుడు, నేను కూడా ఎంతో కొంత స్త్రీల కోసం చేయాలనే బలమైన కోరిక నాలో కలిగింది. ఆడపిల్లలు బాగా వెనుకబడి ఉంటున్నారు.
పద్మశ్రీ అవార్డు అందుకోవడం గురించి...
అవార్డుల కోసం నేనెప్పుడూ ఆలోచించలేదు. అవార్డు వచ్చిందని పొంగిపోను. బెటర్ లేట్ దేన్ నెవర్.
విద్యా సేవ పెద్ద బాధ్యత. అంత పెద్ద బాధ్యతను ఒక్కరే ఎలా నిర్వర్తించారు?
మా వారు నన్ను బాగా ప్రోత్సహించారు. సహకరించారు. నా దగ్గర పనిచేసేవారంతా నాకు సహకరించారు. అది నా అదృష్టం.
రాజకీయాలలోకి రావాలనుకోలేదా?
చదువుకుంటున్న రోజుల్లో కాలేజీ యూనియన్‌లో పనిచేశాను. పెద్దయ్యాక రాజకీయాలలోకి రావాలని ఎన్నడూ అనుకోలేదు. మంచి టీచర్ అనిపించుకోవాలనుకున్నాను. సాధించాను. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నాను.
కాలేజ్ ఈజ్ మై హోమ్
ఏబిసిడీలతో మాంటిస్సోరీ విద్యాసంస్థలు ప్రారంభించాను. ఈ రోజు ఈ స్థాయికి వచ్చాను. కాలేజ్ ఈజ్ మై హోమ్. జీవితమంతా విద్యతోనే గడిపాను. ఇప్పుడు నా వయసు 92 సంవత్సరాలు. నెలరోజుల క్రితం వరకు నేను కాలేజీకి వెళ్తూనే ఉన్నాను. అంతకంటె ఏం కావాలి ఎవరికైనా.
వజ్రోత్సవ వీక్షణం
1955లో మాటిస్సోరీ మొదలైంది. వజ్రోత్సవాలు కూడా జరుపుకున్నందుకు సంతోషంగా ఉంది. చాలామంది వారి స్థాపించిన సంస్థ వజ్రోత్సవాలను కళ్లారా చూసుకోలేరు. నేను చూడగలిగాను, అది నా అదృష్టం. నేను ఏం సాధించాలనుకున్నానో అవన్నీ సాధించాను.
– సంభాషణ: డా. పురాణపండ వైజయంతి, సాక్షి, విజయవాడ