Koteswaramma
-
మాంటిస్సోరి కోటేశ్వరమ్మ కన్నుమూత
లబ్బీపేట (విజయవాడ తూర్పు): విజయవాడ మాంటిస్సోరి విద్యా సంస్థల వ్యవస్థాపకురాలు, అభ్యుదయవాది, స్త్రీ విద్య, మహిళా సాధికారతకు విశేష కృషి చేసిన డాక్టర్ వి.కోటేశ్వరమ్మ (94) ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. విజయవాడ సమీపంలోని గోశాలలో కోనేరు వెంకయ్య, మీనాక్షి దంపతులకు 1925, మార్చి 5న కోటేశ్వరమ్మ జన్మించారు. తెలుగు సాహిత్యంలో డాక్టరేట్ చేసి నెల్లూరు, విజయవాడల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. మహిళలు చదువుకుంటేనే పురుషులతో సమానంగా రాణిస్తారన్న నమ్మకంతో 1955లో చిల్డ్రన్స్ మాంటిస్సోరి స్కూల్‌ను స్థాపించారు. ఇంటింటికీ తిరిగి తల్లిదండ్రులను ఒప్పించి మరీ బాలికలను పాఠశాలలో చేర్పించేవారు. పది మందితో ప్రారంభమైన ఆ పాఠశాల క్రమంగా ప్రా«థమికోన్నత, ఇంటర్, డిగ్రీ, పీజీ కళాశాలలుగా ఎదిగింది. ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎడ్యుకేషన్, బయోటెక్నాలజీ, ఫిజియోథెరపీ వంటి కోర్సులూ ప్రారంభమయ్యాయి. ఆమె విద్యా సంస్థల్లో చదివిన లక్షలాది మంది మహిళలు దేశ, విదేశాల్లో ఉన్నత స్థితిలో ఉన్నారు. తన సేవలకు గుర్తింపుగా కోటేశ్వరమ్మ పలు అవార్డులు పొందారు. 1971లో బెస్ట్ టీచర్‌గా జాతీయ స్థాయి అవార్డు, 2017లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. మహిళా విద్యా సంస్థలను విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు 2015లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్ట్స్‌లో స్థానం పొందారు. కాగా.. కోటేశ్వరమ్మ భర్త వి.వి.కృష్ణారావు ఆంధ్రా లయోలా కళాశాల అధ్యాపకులుగా పనిచేశారు. ఆయన కొన్నేళ్ల కిందట మృతి చెందారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా పెద్ద కుమార్తె డాక్టర్ శశిబాల విజయవాడలోనే ప్రసూతి వైద్యురాలిగా పనిచేస్తున్నారు. చిన్న కుమార్తె షీలారంజని అమెరికాలో ఉంటున్నారు. ప్రస్తుతం మాంటిస్సోరి విద్యా సంస్థలను మనుమడు అవిరినేని రాజీవ్ నిర్వహిస్తున్నారు. -
ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక ఏర్పాట్లు
-
దుర్గగుడిలో టిక్కెట్ల ధర తగ్గింపు!
సాక్షి,విజయవాడ: పేద, మధ్య తరగతి వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న నిశ్చయ సీఎం వైఎస్ జగన్ స్ఫూర్తితో భక్తులకు ఉచిత సేవలు అందించాలని నిర్ణయించినట్లు దుర్గగుడి కార్యనిర్వహణాధికారి కోటేశ్వరమ్మ పేర్కొన్నారు. 29 లేదా 30వ తేదీలలో నిశ్చయ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్‌లతో పాటు గవర్నర్ నరసింహన్ అమ్మవారి దర్శనానికి వస్తారని తెలిపారు. దేవస్థానం ఈవో చాంబర్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో కోటేశ్వరమ్మ మాట్లాడుతూ సీఎంగా వైఎస్. జగన్ 30న ప్రమాణ స్వీకారం చేయనున్నారని, ఆ రోజు నుంచి అమ్మవారి సన్నిధిలో సెల్‌ఫోన్ కౌంటర్లో టికెట్‌ను రద్దు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు రూ.5 వసూలు చేస్తుండగా, ఇకపై సెల్‌ఫోన్‌ను ఉచితంగా భద్రపరుచుకోవచ్చని, దీనిని సేవా కార్యక్రమంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే దేవస్థానం చెప్పుల స్టాండ్, క్లోక్ రూమ్‌ల సేవలను ఉచితంగా అందిస్తుందన్నారు. దుర్గగుడిలో అంతరాలయ దర్శనానికి రూ.300 టిక్కెట్‌ను రూ.200కు తగ్గించాలని నిర్ణయించి, ఉన్నతాధికారుల అనుమతి కోసం పంపామన్నారు.అనుమతులు రాగానే రేట్లు తగ్గిస్తామన్నారు. రూ.18 కోట్ల డిపాజిట్లు గతంలో దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి రూ.140 కోట్ల మేర డిపాజిట్లు ఉండేవని, టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఆలయ విస్తరణ పనులు, స్థల సేకరణ నిమిత్తం ఆ డిపాజిట్లు తీసినట్లు పేర్కొన్నారు. గతేడాది సెప్టెంబర్‌లో ఈవోగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఏప్రిల్ నెలాఖరు వరకు రూ.18 కోట్లు దేవస్థానం తరఫున వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో జమ చేసినట్లు చెప్పారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పాలనాపరమైన అంశాల్లో... మీ జోక్యం అనవసరం!
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): దుర్గగుడి పాలకమండలి చైర్మన్ గౌరంగబాబు, ఆలయ ఈవో వి. కోటేశ్వరమ్మల మధ్య విభేదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దసరా ఉత్సవాలలో కళాకారులకు దేవస్థానం పంపిణీ చేసిన మెమెంటోల వ్యవహారంలో ఆలయ ఈవో పలువురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఛైర్మన్ గౌరంగబాబు ఉద్యోగులకు మద్దతుగా నిలిచారు. తాజాగా సోమవారం దేవస్థానానికి చెందిన మాడపాటి సత్రం బోర్డు మీటింగ్ హాల్లో నిర్వహించిన పాలక మండలి సమావేశంలో ఈ వ్యవహారం మరోమారు చర్చకు వచ్చినట్లు సమాచారం. ఉద్యోగుల వ్యవహారంపై పాలక మండలి సభ్యులు చర్చకు తీసుకురాగా సమావేశం ఒక్కసారిగా వేడెక్కింది. అయితే ఆలయ చైర్మన్‌పై ఈవో వి. కోటేశ్వరమ్మ విరుచుకు పడ్డారు. సస్పెండైన ఉద్యోగులను వెనక్కి తీసుకోవాలని లెటర్ ఇచ్చింది చైర్మన్, కాబట్టి చైర్మన్‌ను అడగండి అంటూ ఈవో ఆగ్రహం గా చెప్పడంతో పాలక మండలి సభ్యులం దరూ ఆవాక్కయ్యారు. ‘పాలనాపరమైన వ్యవహారంలో జ్యోకం చేసుకోవద్దని’ చెప్పడంతో చైర్మన్ అలిగి వెళ్లిపోయారు. తొలుత బోర్డు మీటింగ్‌లో పాల్గొన్న చైర్మన్ మీడియా సమావేశంలో పాల్గొనకుండానే వెళ్లిపోవడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
ముదురుతున్న వివాదం
సాక్షి, విజయవాడ: దసరా ఉత్సవాల్లో సాంస్కృతిక కళాకారులకు ఇచ్చే మెమెంటోల కొనుగోలులో అవినీతి వ్యవహారం దేవస్థానం కార్యనిర్వహణాధికారి(ఈవో)కి, సహాయ కార్యనిర్వహణాధికారి(ఏఈవో)కి మధ్య వివాదానికి దారితీసింది. ఏఈవో అచ్యుత రామయ్యను ఈవో వి.కోటేశ్వరమ్మ సస్పెండ్ చేయడమే కాకుండా ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిసెంబర్ నెలాఖరుకు రిటైరయ్యే అచ్యుతరామయ్య చివర రోజుల్లో సస్పెండ్‌కు గురి అవ్వడం జీర్ణించుకోలేకపోయారు. దీంతో ఆయన హైకోర్టుకు వెళ్లారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు దాఖలు... దుర్గగుడి ఈవో వి.కోటేశ్వరమ్మకు తనను సస్పెండ్ చేసే అధికారం లేదని, తాను ఏ తప్పు చేయలేదని ఏఈవో అచ్యుత రామయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెల 8వ తేదీన హైకోర్టులో కేసు వేశారు. తనను విధుల్లో కొనసాగించాలని కోరారు. ఆయన వేసిన పిటిషన్‌ను హైకోర్టు పెండింగ్‌లో పెట్టింది. దీనిపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని, ఈవో కోటేశ్వరమ్మను హైకోర్టు కోరినట్లు సమాచారం. సాగదీస్తారా? సమాధానమిస్తారా? ఏఈవో అచ్యుత రామయ్య వేసిన కేసుపై అధికారులు, ప్రభుత్వం వెంటనే స్పందించి సమాధానం ఇస్తారా? లేక కేసు సాగదీస్తారా? అని ఇంద్రకీలాద్రిపై చర్చ జరుగుతోంది. దుర్గగుడిలో కేసులు నమోదైతే దాన్ని సాధ్యమైనంత వరకు సాగదీసి చివరకు సమాధానం ఇస్తారు. ఇటీవల పాలక మండలి నుంచి సస్పెండైన కోడెల సూర్యకుమారి, హైకోర్టుకు వెళ్లారు. దీనిపై ఇప్పటి వరకు దేవస్థానం అధికారులు న్యాయస్థానానికి సరైన సమాచారం ఇవ్వలేదు. పోలీసుల విచారణ ప్రారంభం ఈఓ వి.కోటేశ్వరమ్మ ఇచ్చిన ఫిర్యాదు పై వన్‌టౌన్ పోలీసులు కేసు విచారణ ప్రారంభించారు. మెమెంటోలు కొనుగోలులో గోల్మాల్ వ్యవహారంతో పాటు ఈవోను ఏఈవో అచ్యుతరామయ్య బెదిరించడంపై పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా తొలుత మెమెంటోలు సరఫరా చేసిన అనూష హ్యండీ క్రాఫ్ట్ నిర్వాహకుడు రమేష్‌ను పిలిచి విచారించారు. ఎన్ని ఆర్డర్ ఇచ్చారు? ఎన్ని సరఫరా చేశారు? ఎంతకు బిల్లు తీసుకున్నారు? రమేష్‌తో ఈ వ్యవహారంలో ఎవరెవ్వరూ మాట్లాడారు తదితర సమాచారం పోలీసులు సేకరించారు. ఈ కేసులో మరొక ఆరుగురిని పోలీసులు విచారించే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. దేవాలయ ప్రతిష్టకు భంగం... దేవస్థానంలో ఈవో, ఏఈఓల మధ్య ఏర్పడిన వివాదం దేవాలయ ప్రతిష్ట దెబ్బతింటోంది. గతంలో దేవస్థానంలో చిన్నపిల్ల తప్పిపోయి దొరకడం, చీర మాయం కేసు, డార్మెటరీలలో సీసీ కెమెరాల వివాదాలు మరిచిపోక ముందే తాజాగా ఈవో, ఏఈవోల వివాదం తెరపైకి వచ్చింది. ఒకదాని తరువాత ఒకటి వివాదాలతో దేవాలయ ప్రతిష్ట దెబ్బతింటోదని భక్తులు వాపోతున్నారు. -
అమ్మదర్శనం.. గంటలోపే
దుర్గమ్మ శరన్నవరాత్రి మహోత్సవాలకు సర్వం సిద్ధమైంది. తొమ్మిది రోజులపాటు రోజుకొక అవతారంలో దర్శనమిచ్చే∙అమ్మను చూసి తరించడానికి రాష్ట్రం నలుమూలల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. అలా వచ్చే వారందరికీ సులభంగా అమ్మవారి దర్శనం పూర్తి చేసుకుని ఆనందంగా తిరిగి వెళ్లేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో దుర్గమ్మ సన్నిధిలో ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎ.కోటేశ్వరమ్మ ‘సాక్షి’కి వివరించారు. సాక్షి: దసరా ఉత్సవాల్లో అమ్మవారి దర్శన వేళలు ఏమిటి? ఈవో : మొదటి రోజు స్నపనాభిషేకం అనంతరం ఉదయం 9 గంటలకు భక్తుల దర్శనాలకు అనుమతిస్తాం. మిగిలిన రోజుల్లో తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనం ఉంటుంది. మూలా నక్షత్రం రోజున అర్థ్ధరాత్రి ఒంటి గంట నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనం చేసుకోవచ్చు. సాధారణ పర్వదినాల్లో గంటలోపు, మూల నక్షత్రం రోజున రెండు గంటల్లోనూ అమ్మవారి దర్శనం అయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. సాక్షి:ఈ ఏడాది భక్తుల రద్దీ ఏ విధంగా ఉంటుందని అంచనా? ఈవో : సుమారు 15 లక్షల మంది భక్తులు వస్తారని భావించి అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. మా అంచనాలకు మించే భక్తులు వచ్చే అవకాశం ఉంది. సాక్షి:దసరా వ్యయంలో పొదుపు చర్యలు పాటిస్తున్నారు? భక్తులకు ఇబ్బందులు రావా? ఈవో : గత ఏడాది రూ.15 కోట్లు ఖర్చు అయ్యిం ది. ఈ ఏడాది సుమారుగా రూ.8.3 కోట్లతో అంచనాలు తయారు చేశాం. మహా అయితే మరో 10 శాతం పెరగవచ్చు. అయితే భక్తులు సౌకర్యాల్లో గత ఏడాది కంటే ఏమాత్రం తగ్గవు. వారికి కావా ల్సిన సౌకర్యాలన్నీ కల్పిస్తాం. సాక్షి: భక్తులకు దర్శనం కోసం ఏ మార్గంలో వెళ్లాలి? ఈవో : భక్తుల్ని వినాయకుడు గుడి నుంచి రెండు క్యూలలో అనుమతిస్తాం. కొండపైన ఓం టర్నింగ్ నుంచి ఐదులైన్లు ఏర్పాటు చేస్తున్నాం. వినాయకుడు గుడి నుంచి క్యూలైన్లోకి వచ్చి దర్శనం అనంతరం మల్లికార్జున మహామండపం ద్వారా, శివా లయం వద్ద రాయబార మండపం మెట్లమార్గం ద్వారా క్రిందకు వెళ్లే ఏర్పాటు చేస్తున్నాం. సాక్షి: అమ్మవారి దర్శనం టిక్కెట్లు ఎంత? ఈవో : గత ఏడాది తరహాలోనే రేట్లు ఉన్నాయి. రేట్లు పెంచలేదు. అంతరాలయ దర్శనానికి రూ.300. ముఖమండప దర్శనానికి రూ.100 రేట్లు ఉంటాయి. ఇవే కాకుండా సర్వదర్శనం క్యూౖ లెన్లు ఉంటాయి. మూలనక్షత్రం రోజు విజయదశమి రోజున టిక్కెట్లు ఉండవు. అందరూ ఉచిత దర్శనమే చేసుకోవచ్చు. సాక్షి: ప్రత్యేక పూజల వివరాలు చెప్పగలరు? ఈవో : ప్రత్యేక కుంకుమార్చన మల్లికార్జున మహా మండపం 6వ అంతస్తులో జరుగుతాయి. రుసుం రూ.3,000. ఉదయం 7గంటల నుంచి 9 గంటల వరకు, 10 గంటల నుంచి 12 గంటల వరకు రెండు బ్యాచ్‌లు ఉంటాయి. విశేష చండీ హోమం రుసుము రూ.4000.ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. మూల నక్షత్రం రోజు రుసుము రూ.5000. మూడు బ్యాచ్‌లు ఉంటాయి. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు, 10 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల వరకు బ్యాచ్‌లు ఉంటాయి. సాక్షి: లడ్డూ, పులిహోర ప్రసాదాలు అందక చివర్లో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది అదే పరిస్థితి తప్పదా? ఈవో : ఈ ఏడాది 40 లక్షలు లడ్డూలు, 20 వేల కేజీల పులిహోర ప్రసాదాలు తయారు చేయిస్తున్నాం. భక్తులకు కావాల్సి న ప్రసాదాలు అందుబాటులో ఉంటాయి. ఇవి కాకుండా క్యూౖ లెన్లో వచ్చే భక్తులకు జల, క్షీర, కదంబ ప్రసాదాలను ఉచితంగా పంపిణీ చేయాలని భావిస్తున్నాం. ఇంద్రకీలాద్రి పై మూడు చోట్ల ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఉచి తంగా అప్పం ప్రసాదం పం పిణీ చేస్తాం. కనకదుర్గానగర్‌లో ప్రసాదాల కౌంటర్లు ఉంటాయి. సాక్షి: అన్నప్రసాదం ఎంతమందికి ఉంటుంది? ఈవో : అర్జున వీధిలోని అన్నప్రసాద భవనంలోనే అన్నదానం జరుగుతోంది. ప్రతిరోజు 20 వేల మందికి, మూల నక్షత్రం రోజు 40 వేల మందికి అన్నదానం జరుగుతుంది. ఎక్కువ మందికి భోజనాలు పెట్టేందుకు అవసరమైతే బఫే పద్ధతిని ప్రవేశపెడతాం. ఉచిత కదంబం ప్రసాదం ఉంటుంది. సాక్షి:భక్తులు రాత్రి పూట బస చేయాలంటే ఇబ్బందిగా ఉందా? ఈవో : కాటేజీలు లేకపోవడం ఇబ్బందే. అయితే మల్లికార్జున మహామండపంలో నిద్రించవచ్చు. కాగా పేద, మధ్య తరగతి భక్తుల కోసం సీవీ రెడ్డి చారిటీస్‌లో కాటేజ్‌లు ఉన్నాయి. వాటిని వినియోగించుకోవచ్చు. సాక్షి:అదనపు సిబ్బంది సేవలు వినియోగించుకుంటున్నారా? ఈవో : ఇతర దేవాలయాల నుంచి 167 మం ది సిబ్బంది ఇప్పటికే వచ్చారు. వీరు కాకుండా 4,600 మం ది పోలీసులు అందుబాటులో ఉంటారు. భక్తులకు తక్షణ సహాయం అందచేసేందుకు వెయ్యి మంది ఎన్సీసీ,, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను సిద్ధః చేశాం. అత్యవసర పరిస్థితుల్లో భక్తులు క్యూ మార్గం లోంచి బయటకు వచ్చేందుకు ప్రతి ఐదు మీట ర్లకు ఒక అత్యవసర ద్వారం ఏర్పాటు చేస్తున్నాం. «రథం సెంటర్, మున్సిపల్ ఆఫీసుల వద్ద చెప్పులను, సామాన్లును భద్రపరుచుకునే కౌంటర్లు ఏర్పాటు చేశాం. భక్తుల సౌకర్యార్ధం ఘాట్‌రోడ్డులోనూ, కనకదుర్గానగర్ తదితర 15 ప్రదేశాల్లో ప్రధమ చికిత్సా కేంద్రాలు, అంబులెన్స్‌లు ఏర్పాటు చేశాం. సాక్షి:భక్తులు తలనీలాలు ఎక్కడ సమర్పించుకోవాలి? ఈవో : సీతమ్మవారి పాదాలు వద్ద కేశఖండన శాల ఏర్పాటు చేస్తున్నాం. దేవస్థానానికి చెందిన 200 మంది నాయీ బ్రాహ్మణులు అందుబాటులో ఉంటారు. జల్లు స్నానాలు చేయవచ్చు. సీతమ్మవారి పాదాలు వద్ద 30, పద్మావతి ఘాట్ వద్ద 30, దోబిఘాట్ వద్ద 10 తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశాం. సాక్షి:నగరోత్సవం, తెప్పోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? ఈవో : దసరా ఉత్సవాల్లో ప్రతి రోజు సాయంత్రం 4 గంటలకు నగరోత్సవం శివాలయం మెట్ల మార్గం నుంచి ప్రారంభం అవుతుంది. ఈ నగరోత్సవం అర్జున వీధి, రథం సెంటర్, వినాయకుడు గుడి, మరలా రథం సెంటర్ టోల్గేట్ మార్గం ద్వారా కొండపైకి వెళ్తుంది. నగరోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా బ్రహ్మరథం, బేతాళనృత్యాలు, తాళభజన్లు, సంకీర్తణలు, కోలాట బృందాలు, నృత్య బృందాలు, వేద విద్యార్థులుతో పాటు అనేక బృందాలు పనిచేస్తాయి. చండీశ్వరుడు చిన్న పల్లకి, తిరుచ్చి, స్వామి వారు, అమ్మవారు పల్లకి, ఘాటాటోపం కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. విజయదశమి రోజు దుర్గాఘాట్‌లో దుర్గమల్లేశ్వరుల తెప్పోత్సవం అంగరంగవైభవంగా నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నాం. పున్నమి ఘాట్, దుర్గాఘాట్‌ల నుంచి భక్తులు అమ్మవారి నదీ విహారం తిలకించి పునీతులవ్వచ్చు. సాక్షి:పాలకమండలి సభ్యుల సేవలు ఏ విధంగా ఉంటాయి? ఈవో : ఉత్సవాల్లో పాలకమంది సభ్యులు, సిబ్బంది కలిసి మెలసి ముందుకు వెళ్తున్నారు. భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో వారి అమూల్యమైన సలహాలు ఇస్తున్నారు. పండుగ రోజుల్లో వారు భక్తులకు అందుబాటులోనే ఉంటారు. అందరి సహకారంతో... శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో నిర్వహించే దసరా మహోత్సవాలను అందరి సహాకారంతో విజయవంతంగా నిర్వహిస్తామని ఈవో వీ. కోటేశ్వరమ్మ అన్నారు. సోమవారం మహా మండపం ఆరో అంతస్తులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉత్సవాల ఏర్పాట్ల గురించి వివరించారు. దసరా ఉత్సవాల విజయవంతం చేయడంలో మీడియా సహకారం కూడా అవసరమని, గతంలో అనేక ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడంలో మీడియా సహకారం ఎంతో ఉందన్నారు. -
భక్తులకు మెరుగైన సేవలు
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమం) : దుర్గమ్మ దర్శనంలో భక్తులకు ఏ సమస్య వచ్చినా నేరుగా తనతో చెప్పవచ్చని ఈవో వి.కోటేశ్వరమ్మ చెప్పారు. మహా మండపం సమీపంలోని చాంబర్లో శుక్రవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. తొలుత అర్జున వీధి మీదుగా మహా మండపానికి చేరుకున్న ఆమెకు ఏఈవో అచ్యుతరామయ్య, పలువురు పాలక మండలి సభ్యులు స్వాగతం పలికారు. మెట్ల మార్గం ద్వారా నేరుగా మల్లేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకుని స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం దుర్గమ్మ ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకోగా, ఆలయ అర్చకులు, వేద పండితులు ఆశీర్వచనం అందచేశారు. పాలక మండలి సభ్యులు ఈవో కోటేశ్వరమ్మకు పుష్పగుచ్ఛాలు అందచేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఈవో విలేకర్లతో మాట్లాడుతూ భక్తులకు మంచి దర్శనం, మెరుగైన సేవలే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఆలయ అభివృద్ధికి పెద్ద పీట వేస్తానని తెలిపారు. అమ్మ దర్శనానికి వచ్చిన భక్తులందరూ దుర్గమ్మ బిడ్డలేనని పేర్కొన్నారు. భక్తులకు అమ్మవారి చక్కటి దర్శనంతో పాటు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానన్నారు. అర్చకులు , ఆలయ సిబ్బంది సమన్వయంతో పని చేస్తానని వెల్లడించారు. ఎటువంటి విభేదాలకు తావు ఇవ్వకుండా పని చేయడమే ప్రధాన కర్తవ్యమన్నారు. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ , వారి ఇచ్చే సూచనలు, సలహాలు పాటిస్తానని వివరించారు. ఇక దాతల సౌకర్యార్ధం టీటీడీ తరహాలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. భక్తుల మనోబావాలు దెబ్బతిసేలా కొంత మంది ఆలయ సిబ్బంది వ్యవహరిస్తున్నారని, దీని వల్ల తరుచూ అనేక గొడవలు జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని చెప్పారు. త్వరలోనే ఆలయ సిబ్బంది అందరితో ఓ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. భక్తుల పట్ల గౌరవంగా మెలగాల్సిన అవసరం అందరిపైన ఉందన్నారు. ఇక దేవస్థానంలో జరుగుతున్న వివాదాలను ఇకపై జరగకుండా ప్రతి చోటా చెక్ పాయింట్స్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వివిధ విభాగాల అధికారులు కోటేశ్వరమ్మను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ, పాలక మండలి సభ్యులు పెంచలయ్య, శంకరబాబు, పద్మశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
దుర్గగుడి ప్రతిష్ట పెంచడమే లక్ష్యం
దుర్గగుడి ప్రతిష్టను పెంచడమే లక్ష్యమని ఐఆర్ఎస్ అధికారి వీ కోటేశ్వరమ్మ అన్నారు. ఆలయ ఈఓగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్న ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. అవినీతిని అరికట్టేందుకు దృష్టి సారిస్తానన్నారు. తన పాలన పారదర్శకంగా ఉంటుందన్నారు. అన్ని విభాగాల సమాచారం వెబ్సైట్లో భక్తులకు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. సాక్షి,విజయవాడ: రాష్ట్రంలోని రెండవ అతి పెద్ద దేవాలయం దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి కార్యనిర్వహణాధికారి(ఈఓ)గా వరుసగా మూడోసారి మహిళా అధికారి శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇటీవల కొందరి చేష్టలు ఆలయ ప్రతిష్టను, భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే తొలి మహిళా అధికారి సూర్యకుమారి తాత్రింక పూజలపై విమర్శలు రావడంతో బదిలీ కాగా, పాలకమండలి సభ్యురాలు చీర మాయం చేసిన ఘటనలో సంబంధం లేకపోయినా రెండో మహిళా అధికారి ఎం.పద్మపై బదిలీ వేటు పడింది. ఈ నేపథ్యంలో మరో మహిళా అధికారి వి.కోటేశరమ్మ ఈఓగా బాధ్యతలు చేపడుతున్నారు. దుర్గగుడి ప్రతిష్టను కాపాడేందుకు, భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ఆమె తీసుకునే చర్యలను ‘సాక్షి’తో పంచుకున్నారు. సాక్షి: దుర్గగుడిలో అవినీతి వ్యవíస్థీ్థకృతమైపోయింది. దీన్ని ఏ విధంగా అరికడతారు? కోటేశ్వరమ్మ: కింది స్థాయి ఉద్యోగిపైనా నేను ప్రత్యేకంగా దృష్టి పెడతాను. అవినీతి జరిగేందుకు అవకాశాలు ఉన్న విభాగాల గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుని తగిన చర్యలు తీసుకుంటాను. పాలన పూర్తి పారదర్శకంగా ఉంటుంది. అన్ని విభాగాల సమాచారం వెబ్సైట్లో భక్తులకు అందుబాటులో ఉంచుతాం. సాక్షి:దుర్గగుడిలో కొంతమంది ఉద్యోగస్తులు దీర్ఘకాలంగా పాతుకుపోయారు. వారి వల్ల మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా? కోటేశ్వరమ్మ: పాలనా విధానంలో అందరిని కలుపుకుని వెళ్లేందుకు ప్రయత్నిస్తా. దేవాలయం ప్రతిష్ట పెంచడమే నా ప్రధాన ధ్యేయం. భక్తులకు మెరుగైన సేవలు అందించే విషయంలో రాజీ పడను. దీనికి అందరూ సహకరిస్తారని అనుకుంటున్నా. ఇబ్బంది కలిగించే వారిపై కఠినంగా ఉండటానికి వెనుకాడను. సాక్షి:దేవస్థానంలో జరిగే పొరపాట్లకు ఈఓనే బాధ్యత వహించాల్సి వస్తోంది. మీరు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటారు? కోటేశ్వరమ్మ: ఎక్కడ పొరపాట్లు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటాను. భక్తులకు మెరుగైన పాలన అందించేందుకు ప్రయత్నిస్తాను. సాక్షి: ఒకవైపు అభివృద్ధిపనులు జరుగుతున్నాయి. మరోకవైపు నిధులు కొరత వెంటాడుతోంది? ఎలా అధిగమిస్తారు? కోటేశ్వరమ్మ: దేవస్థానం అభివృద్ధిలో దాతల భాగస్వామ్యం తప్పకుండా తీసుకుంటాను. అలాగే దేవాదాయశాఖ ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ అభివృద్ధి పనులు వేగవంతంగా జరిగేందుకు ప్రయత్నిస్తాను. సాక్షి: భక్తుల కష్టాలు ఏ విధంగా తెలుసుకుంటారు? కోటేశ్వరమ్మ: గతంలో నవరాత్రులలో దుర్గగుడికి వచ్చాను. అప్పుడు భక్తులు పడే కష్టాలను ప్రత్యక్షంగా చూశా. భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు పడకుండా చూస్తా. సాక్షి: త్వరలో జరగబోయే దసరా ఉత్సవాలను ఏ విధంగా నిర్వహించాలని అనుకుంటున్నారు? కోటేశ్వరమ్మ: దసరా ఉత్సవాల నిర్వహణకు అందరి సహకారం అవసరం. గతంలో దేవాదాయశాఖలో పని చేసినందున ఆ అనుభవం కూడా ఉపయోగపడుతుందని భవిస్తున్నా. దసరా ఉత్సవాల్లో భక్తుల అవసరాలకే ప్రధాన ప్రాధాన్యం. సాక్షి:పరిపాలనా వ్యవహారాల్లో పాలకమండలి జోక్యం ఎక్కువగా వుంటోందని తెలుస్తోంది. కోటేశ్వరమ్మ: వారి గురించి ప్రభుత్వం చూసుకుంటుంది. ఇటీవలే పరిపాలన వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని పాలకమండలికి చెప్పినట్లు పత్రికల్లోనే చూశాను. సాక్షి: పాలకమండలి సభ్యుల వల్ల దేవస్థానం ప్రతిష్ట దెబ్బతింటోంది? దీన్ని ఏ విధంగా అడ్డుకుంటారు? కోటేశ్వరమ్మ: ప్రతిఒక్కరూ దేవస్థానం ప్రతిష్ట పెంచేందుకే కృషి చేయాలి. పాలకమండలి ఏ విధంగా ఉండాలనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. -
దుర్గగుడి ఈవోగా ఐఆర్ఎస్ అధికారిణి కోటేశ్వరమ్మ
-
రన్నింగ్ 70
‘అచీవ్మెంట్’ అనే మాట చాలా గొప్పది. అయితే అదెప్పుడో చాలా మామూలు మాట అయిపోయింది కోటేశ్వరమ్మ విషయంలో! ఎంత పెద్ద విజయం అయినా ఇప్పుడామెకు ఒక మైలురాయి. అంతే! ఇటీవల కూడా నాలుగు గోల్డ్‌మెడల్స్ గెలుచుకుని ఇండియా వచ్చిన ఈ డెబ్బైయ్ ఏళ్ల అథ్లెట్.. ఊపిరి ఉన్నంత వరకూ గ్రౌండ్ ఆడుతూ ఉండడమే తన కోరిక అని అంటున్నారు. ఏనుగుల కోటేశ్వరమ్మ వయసు 70. ఫిజికల్ డైరెక్టర్‌గా రిటైరయ్యి పన్నెండేళ్లవుతోంది. సాధారణంగా రిటైర్ అయిన వాళ్లను... ‘ఖాళీయే కదా! ఇప్పుడేం చేస్తున్నారు’ అని చాలా మామూలుగా అడిగేస్తుంటారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం, ఎదుటి వాళ్లు సమాధానపడేలా చెప్పడం కొంచెం కష్టమే. అయితే కోటేశ్వరమ్మకు మాత్రం చెప్పడానికి చాలా విజయాలున్నాయి. రిటైర్ అయిన తర్వాతనే ఆమె అంతర్జాతీయ స్థాయి అథ్లెట్ మీట్లలో పాల్గొన్నారు. సగౌరవంగా జాతీయ పతాకాన్ని భుజాల మీద కప్పుకుని, దేశానికి ప్రతినిధిగా వినమ్రంగా తలవంచి బంగారు పతకాలను ధరించారు. ఇటీవల సింగపూర్‌లో జరిగిన ‘సింగపూర్ అథ్లెటిక్స్ అండ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ 2018’ లో పాల్గొని నాలుగు బంగారు పతకాలతో ఇండియాకి వచ్చారు. 17 దేశాల క్రీడాకారులు పాల్గొన్న పోటీలలో నాలుగు మెడల్స్ (అన్నీ స్వర్ణాలే) సాధించిన ఏకైక క్రీడాకారిణి ఆమె. గత ఏడాది మలేసియా నుంచి రెండు స్వర్ణాలను తెచ్చారు. అంతకు ముందు శ్రీలంకలో మూడు స్వర్ణాలు ఆమె సొంతమయ్యాయి. ఆమె పాల్గొన్న తొలి ఇంటర్నేషనల్ అథ్లెట్ మీట్ 2014. అప్పుడామె రెండు కాంస్యాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. తన జీవితంలో అన్నీ బంగారు, వెండి పతకాలే. కాంస్యం అందుకున్న ఒకే ఒక్క సందర్భం జపాన్ చాంపియన్ షిప్‌లోనే అంటారామె. 66 ఏళ్ల వయసులో, తొలిసారి విదేశీ ప్రత్యర్థులతో పోటీపడడంలో కొంత తడబాటు తప్పలేదు. కానీ ఆమె మాత్రం ‘తన చిన్న ప్రపంచం’లో ఇంటర్నేషనల్ మీట్లో పాల్గొనడమే పెద్ద విజయం అంటారు. చిన్న ప్రపంచం వెనుక కోటేశ్వరమ్మ ‘తన చిన్న ప్రపంచం’ అన్న మాట వెనుక చాలా పెద్ద అర్థమే ఉంది. నెల్లూరు జిల్లా, కావలి పట్టణంలో పుట్టి పెరిగారామె. స్కూలు, కాలేజ్, ఉద్యోగం, ఇప్పుడు విశ్రాంత జీవనం కూడా కావలిలోనే. తండ్రి చిన్న ప్రభుత్వోద్యోగి, తల్లి గృహిణి. ఏడుగురు సంతానంలో చిన్నమ్మాయి. అక్కలు, అన్నలు ఒక్కరు కూడా క్రీడారంగంలో అడుగుపెట్టలేదు. కోటేశ్వరమ్మకు మాత్రం ఇల్లు, ఆట స్థలమే లోకం. ఐదవ తరగతిలో డిస్ట్రిక్ట్ చాంపియన్‌షిప్ అందుకోవడం నుంచి డిగ్రీ వరకు హైజంప్, లాంగ్ జంప్, రన్నింగ్ రేస్‌లలో వరుసగా మెడల్స్ అందుకున్నారు. షాట్ పుట్, డిస్కస్‌త్రో, జావలిన్ త్రోలతోపాటు వంద మీటర్లు, రెండు వందల మీటర్లు, నాలుగు వందల మీటర్లలో, జిల్లా, స్టేట్, నేషనల్స్‌లో ఆమె అందుకున్న మెడల్స్ వందకు పైగానే ఉంటాయి. అయినా తన ప్రపంచం చాలా చిన్నదనే అంటారామె. ‘‘ఒలింపిక్స్‌లో రాణించే నైపుణ్యం, ఫిట్నెస్ ఉండి కూడా ఎక్స్పోజర్ లేని కారణంగానే నా పరిధి కుదించుకుపోయింది. అప్పట్లో ఇప్పటిలా ఎలక్ట్రానిక్ మీడియా విస్తరించలేదు. పేపర్లలో ఒలింపిక్స్ గురించి చదివినా కూడా కోచింగ్ ఎక్కడ తీసుకోవాలో, ఎలా అప్లయ్ చేసుకోవాలో మార్గదర్శనం చేసే వాళ్లు లేరు. దాంతో నేషనల్స్ దగ్గరే ఆగిపోవాల్సి వచ్చింది. ఈ మాత్రమైనా సాధించగలిగానంటే... అది నేను చదువుకుని, ఉద్యోగం చేసిన విశ్వోదయ, జవహర్‌భారతి విద్యాసంస్థల స్థాపకులు డీఆర్ (దొడ్ల రామచంద్రరెడ్డి) గారి ప్రోత్సాహమే. నా భర్త కూడా స్పోర్ట్స్ పర్సన్ కావడం నాకు చాలా ఉపకరించింది’’అంటారామె. తొలి ఫోన్‌కాల్ కోటేశ్వరమ్మ భర్త జయచంద్ర రావు ఫుట్‌బాల్ ప్లేయర్. పిల్లలకు పదేళ్లు నిండినప్పటి నుంచి స్పోర్ట్స్ మీట్లకు అందరూ వెళ్లేవాళ్లు. మెడల్స్ సాధించడం ఎవరికైనా సంతోషమే. అయితే ఆ అచీవ్మెంట్లు ఆమెలోని క్రీడాకారిణికి పెద్దగా ఎగ్జయిట్‌మెంట్‌ని ఇచ్చేవి కావు కానీ ఆమెలోని తల్లిని బాగా సంతోషపెట్టేవి. ‘‘పిల్లలు నా మెడల్‌ను పట్టుకుని తాకి చూస్తూ మురిసిపోతుంటే ఎక్కడ లేని ఆనందం కలిగేది. ఆ స్ఫూర్తితోనే మా ఇద్దరమ్మాయిలు, అబ్బాయి ముగ్గురూ క్రీడాకారులయ్యారు. తల్లిగా నా పిల్లలను, నా 33 ఏళ్ల ఉద్యోగ జీవితంలో వేలాది మందిని క్రీడాకారులుగా తీర్చిదిద్దాను. వందల మంది స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు తెచ్చుకున్నారు. కొందరు పిల్లలు ఉద్యోగం వచ్చిన వెంటనే తొలి ఫోన్ నాకే చేస్తుంటారు. అలాంటప్పుడు ఎంత సంతోషం వేస్తుందో మాటల్లో చెప్పలేను’’ అంటూ కళ్లు తుడుచుకున్నారామె. పెన్షన్ డబ్బు దాచుకుని వేర్ దేర్ ఈజ్ ఏ విల్ దేరీజ్ ఏ వే... అనే నానుడి నిజమేననిపిస్తుంది కోటేశ్వరమ్మను చూస్తే. ఇంటర్నేషనల్స్‌లో ఆడాలనే సంకల్పంతో పెన్షన్ డబ్బు దాచుకున్నారామె. భర్త పోయి పాతికేళ్లయింది. అప్పటికి పిల్లలు పూర్తిగా స్థిరపడలేదు. కుటుంబ బాధ్యతను పూర్తిగా తానే మోయాల్సి వచ్చింది. అలాంటప్పుడు ఆర్థిక సర్దుబాట్లు తప్పవు. దాంతో ఇంటర్నేషనల్ అథ్లెట్ మీట్ కలను తనలోనే దాచుకోక తప్పలేదు. బాధ్యతలు తీరిపోయి, ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత దాచుకున్న డబ్బుతో నాలుగేళ్లుగా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్‌లో పాల్గొంటున్నారు, విజేతగా తిరిగొస్తున్నారు. ఎన్ని సాధించినా ఇది తీరే దాహం కాదంటారామె. ఇప్పటికింకా ఆసియా దాటి బయటకు వెళ్లలేదని, వరల్డ్ స్పోర్ట్స్‌లో విజేతగా మెడల్ అందుకోవడం తన లక్ష్యమంటున్నారు. ఊహ తెలిసిన తర్వాత పెళ్లయి, పిల్లలు పుట్టిన పదేళ్ల పాటు మాత్రమే ఆటలకు దూరంగా గడిపారామె. తన జీవితంలో వెనక్కి చూసుకుంటే ఇల్లు, గ్రౌండ్ తప్ప మరేమీ లేవంటూ... ఊపిరి ఉన్నంత వరకు ఆడుతూనే ఉండాలి, గ్రౌండ్‌లోనే శ్వాస వదలాలని తన కోరిక అంటున్నారు. ఉద్యోగం నుంచి రిటైర్ కావచ్చు, కానీ క్రీడాకారిణిగా రిటైర్ కావడమనే ఊహనే భరించలేకపోతున్నారు కోటేశ్వరమ్మ. ఆటల్లో దెబ్బ తగల్లేదు కానీ ఇన్నేళ్ల క్రీడా జీవితంలో ఒక్క దెబ్బ కూడా తగిలించుకోలేదామె. అయితే పక్కింటి బాదం చెట్టు కాయలను దొంగతనంగా కోసేటప్పుడు తగిలిన గాయం మచ్చ ఇప్పటికీ అలా ఉండిపోయింది. ‘కర్ర గుచ్చుకుపోయి, కండ ఊడి వచ్చేసింది. అయినా కట్టుకుని కూడా ఆ మర్నాడే ఆటలకు వెళ్లి పోయాను’ అని నవ్వుకుంటూ మోకాలికి కిందగా ఉన్న మచ్చను తడుముకున్నారు. ఆటలాడితే జీవితం అందంగా ఉంటుంది. నిజమే, కోటేశ్వరమ్మ ఫిట్నెస్ కోసం ఏ వ్యాయామమూ చేయరు. రోజూ ఇష్టమైనంత సేపు ఆడటమే ఆమె ఆరోగ్య రహస్యం. ‘ఉన్నది ఒక్కటే జీవితం. ఆడుతూ ఆహ్లాదంగా జీవిస్తేనే ఆనందం, ఆరోగ్యం’. అందుకు ఈ క్రీడాకారిణి జీవితమే నిదర్శనం. ఇప్పటికీ అద్భుతమే! రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి ప్రథమ పౌరుడిని కలవడం నా జీవితంలో అత్యంత అద్భుతంగా అనిపించే సంఘటన. ఇప్పుడు గుర్తు చేసుకున్నా కూడా ఒళ్లు రోమాంచితమవుతుంది. టెన్త్‌క్లాస్(1966)లో ఉన్నప్పుడు ఎన్íసీసీ క్యాడెట్‌గా రిపబ్లిక్ డే పెరేడ్లో పాల్గొన్నాను. ఆ తర్వాత రోజు పిల్లలందరినీ రాష్ట్రపతి భవన్‌కు తీసుకెళ్లారు. అప్పుడు మన రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌గారు. మాకు రోజ్ గార్డెన్ అంతా తిప్పి చూపించారు. అన్ని రకాల గులాబీ పూలను, అంత పెద్ద తోటను చూడటం మాకదే తొలిసారి. మా సంతోషం చూసి ఆయన పూలు కోయించి మాకందరికీ ఇచ్చారు. రాష్ట్రపతిని కలవడానికి వేసుకున్న మెరూన్ కలర్ బ్లేజర్ని ఇప్పటికీ దాచుకున్నాను. పెరేడ్ కోసం మా టీమ్ ఢిల్లీలో దిగిన రోజు మాత్రం అత్యంత విషాదకరం. ఢిల్లీ స్టేషన్లో రైలు దిగగానే మన దేశ రాజధాని నగరం ఇది అని పిల్లలంతా కేరింతల్లో ఉన్నాం. అప్పుడు తెలిసింది ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి మరణించారని. వివరాలు తెలిసే వయసు కాదు కానీ మనసంతా ఏదో తెలియని గుబులు ఆవరించిందప్పుడు. ప్రాక్టీస్‌లో మునిగిపోయాక ఇక ఆ సంగతి పూర్తిగా మర్చిపోయాం. ఆ ఢిల్లీ పర్యటన ముగించుకుని కావలికి రాగానే రైల్వే స్టేషన్లో ఘనస్వాగతం. జిల్లా నుంచి పెరేడ్‌కు వెళ్లింది నేను మాత్రమే. వీధివీధిలో షామియానాలు వేసి పట్టణం అంతా ఊరేగించారు నన్ను. చిన్నప్పుడు అంత పెద్ద సంతోషం అనుభవంలోకి రావడంతోనో ఏమో, నేను ఎన్ని మెడల్స్ సాధించినా సరే, ఒక్కొక్క మైలురాయిని దాటుతున్నట్లు ఉంటోంది తప్ప గొప్ప అచీవ్మెంట్ అని మనసు పొంగిపోవడం లేదు. బహుశా ఆసియా దాటి ప్రపంచ స్థాయిలో మెడల్ సాధించినప్పుడు నా మనసు నిండుతుందేమో. – ఏనుగుల కోటేశ్వరమ్మ, వెటరన్ అథ్లెట్ -
మాంటిస్సోరీ కోటేశ్వరమ్మ
పురస్కారం తొమ్మిది పదులు నిండిన పసిపాప... అందరినీ ఆప్యాయంగా నోరారా ‘పాపా’ అని పిలిచే మాతృమూర్తి డాక్టర్ వి. కోటేశ్వరమ్మ. స్త్రీవిద్య కోసం పాటు పడ్డారు. విజయవాడలో మాంటిస్సోరీ విద్యాసంస్థలను స్థాపించారు. అతి తక్కువ ఫీజులకే విద్య అందించారు. మగవారు మాత్రమే సంస్థలు నడపగలరు అనుకునే రోజుల్లో... స్త్రీశక్తిని నిరూపించారు. ఆమె అందించిన ఈ విశిష్ట సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. ఈ సందర్భంగా శ్రీమతి వి. కోటేశ్వరమ్మతో సాక్షి సంభాషించింది. విద్యాసంస్థలు స్థాపించాలనే ఆలోచన ఎలా కలిగింది? మా తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధ్యాయులే. మా అమ్మగారు కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే టీచర్‌గా పనిచేశారు. ఆమె నా రెండవ ఏటే మరణించారు. ఆవిడతో నాకు సాన్నిహిత్యం లేకపోయినా, నాన్నగారు ఆవిడ గురించి తరచు చెబుతుండటంతో, ఆవిడకి ఉన్న పేరుప్రఖ్యాతులు అర్థం చేసుకున్నాను. ఆవిడ పేరు నిలబెట్టి, ఆవిడ పట్ల నా గౌరవాన్ని ప్రదర్శించాలనుకున్నాను. అలా మొదటగా ప్లే స్కూల్ ప్రారంభించాను. మాంటిస్సోరీ విద్యావిధానంలో పాఠశాల ప్రారంభించాను. మా స్కూల్ పేరు మాంటిస్సోరీ చిల్డ్రన్స్ హైస్కూల్. ఆ తరువాత నేను స్థాపించిన అన్ని సంస్థలకు అదే పేరు పెట్టాను. ఇన్ని విద్యాసంస్థలు స్థాపించడం వెనుక ప్రేరణ? భావిభారత పౌరులంతా పైకి రావాలనే కోరిక నాకు బలంగా ఉండేది. ఆ కోరికతోనే ఇన్ని విద్యాసంస్థలు స్థాపించాను. మీరు ఇంత డైనమిక్‌గా పెరగడానికి స్ఫూర్తి ఎవరిది? ఏదో ఒకటి చేయాలనే కోరిక నా మనసులో బలంగా ఉండేది. ఏదైనా పనిచేస్తే, ఆ పని అందరికంటె బాగా చేయాలని, పైకి ఎదగాలనే పట్టుదల, దీక్ష నాలో చిన్నతనం నుంచే ఉండేవి. ఆ దీక్షతోనే అన్ని పనులూ చేశాను. టీచింగ్ మీద ఉండే ప్రేమ, ఫలితం చూడాలనే ఆతురత, ఎంత చేసినా ఇంకా చేయాలనే తపన. వీటి వల్లే నేను ఏదైనా సాధించలిగాను. తక్కువ ఫీజులతో విద్యాసంస్థలు ఎలా నడపగలిగారు? నేను ఒక ఇల్లాలిని. నా ఆలోచనలు కూడా ఇల్లాలి ఆలోచనలలాగే ఉండేవి. ఏ ఇంట్లో అయినా భార్య తన భర్త ఆదాయాన్ని ఆధారం చేసుకుని ఇంటిని ఏ విధంగా నడుపుతుందో, నేను కూడా అదేవిధంగా.. వచ్చిన ఆదాయంతో మా సంస్థలను ప్రణాళికా బద్ధంగా నడిపాను. బడిని కూడా ఒక ఇంటిలాగే నడిపాను. అంతేకాదు, నేను చదువుకునే రోజుల్లో స్కూలు ఫీజులు కట్టడానికి చాలా ఇబ్బందిపడ్డాను. ఏ విద్యార్థీ అటువంటి ఇబ్బంది పడకూడదనుకున్నాను. అందుకే తక్కువ ఫీజులకు ఉత్తమ విద్య అందించాను. మరో కారణం... మా టీచర్లకు ప్రభుత్వమే జీతాలిచ్చేది. అందువల్ల విద్యార్థుల నుంచి తక్కువ ఫీజులు తీసుకునేవాళ్లం. మీ దగ్గర చదువుకున్న కొందరు ప్రముఖుల గురించి... ప్రముఖ కార్డియాలజిస్టు డా.పి.రమేష్‌బాబు, ఫోర్స్బ్ జాబితాలో చోటు దక్కించుకున్న సిస్కో సిఈవో పద్మశ్రీ వారియర్ మా స్కూల్లో చదివినవారే. వీరు కొందరు మాత్రమే. ఇంకా చాలామంది అమెరికాలో సెటిల్ అయినవారు ఉన్నారు. విద్యార్థుల అభివృద్ధి చూస్తే మీకు ఎలా ఉండేది? ఒక విద్యార్థికి స్టేట్ ఫస్ట్ ర్యాంకు వస్తే, మిగిలిన విద్యార్థులకి కూడా రావాలని ఆశించేదాన్ని. ఒకరు ఉన్నతస్థాయిలోకి వస్తే, మిగిలినవారు కూడా వస్తే బాగుంటుందనిపించేది. మిమ్మల్ని ప్రభావితం చేసినవారెవరు? గుంటూరు ఏకెసి కళాశాల ప్రిన్సిపాల్‌గా డా. సైప్స్ పనిచేసేవారు. ఆ కళాశాలలో అమెరికన్ విద్యా విధానం అమలులో ఉండేది. అక్కడ చదువుకునే రోజుల్లోనే నేను కూడా ఆ విద్యా విధానంలో ఒక కళాశాల ప్రారంభించాలనే కోరిక బయలుదేరింది. నేను బి.ఎస్సి. చదివాను. ఆ తరవాత ఉద్యోగం చేస్తూ ఎంఏ తెలుగు ప్రయివేట్‌గా చదివాను. ఆ వెంటనే పి.హెచ్డి చేశాను. ఆ తరువాత నేను కలగన్న విద్యా సంస్థలను ప్రారంభించాను. ప్రత్యేకంగా మహిళల కోసం మాంటిస్సోరీ మహిళా కళాశాల పేరుతో, విద్యాసంస్థ ఏర్పాటు చేశారు కదా! స్త్రీ విద్యకై పాటుపడాలని, వారిని ఉత్తేజపరచాలనే ఉద్దేశంతోనే ప్రత్యేకంగా మహిళా కళాశాల ప్రారంభించాను. అక్కడితో ఆగకుండా మరిన్ని సంస్థలు పెట్టాలనే కోరిక పెరుగుతూ ఉండేది. మా కళాశాలలో కొన్ని వేల మంది ఆడపిల్లలు చదువుకున్నారు. స్త్రీవిద్య గురించి కొందరు ప్రముఖులు ఉత్తరాదిన చేస్తున్న సేవ గురించి చదివినప్పుడు, నేను కూడా ఎంతో కొంత స్త్రీల కోసం చేయాలనే బలమైన కోరిక నాలో కలిగింది. ఆడపిల్లలు బాగా వెనుకబడి ఉంటున్నారు. పద్మశ్రీ అవార్డు అందుకోవడం గురించి... అవార్డుల కోసం నేనెప్పుడూ ఆలోచించలేదు. అవార్డు వచ్చిందని పొంగిపోను. బెటర్ లేట్ దేన్ నెవర్. విద్యా సేవ పెద్ద బాధ్యత. అంత పెద్ద బాధ్యతను ఒక్కరే ఎలా నిర్వర్తించారు? మా వారు నన్ను బాగా ప్రోత్సహించారు. సహకరించారు. నా దగ్గర పనిచేసేవారంతా నాకు సహకరించారు. అది నా అదృష్టం. రాజకీయాలలోకి రావాలనుకోలేదా? చదువుకుంటున్న రోజుల్లో కాలేజీ యూనియన్‌లో పనిచేశాను. పెద్దయ్యాక రాజకీయాలలోకి రావాలని ఎన్నడూ అనుకోలేదు. మంచి టీచర్ అనిపించుకోవాలనుకున్నాను. సాధించాను. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నాను. కాలేజ్ ఈజ్ మై హోమ్ ఏబిసిడీలతో మాంటిస్సోరీ విద్యాసంస్థలు ప్రారంభించాను. ఈ రోజు ఈ స్థాయికి వచ్చాను. కాలేజ్ ఈజ్ మై హోమ్. జీవితమంతా విద్యతోనే గడిపాను. ఇప్పుడు నా వయసు 92 సంవత్సరాలు. నెలరోజుల క్రితం వరకు నేను కాలేజీకి వెళ్తూనే ఉన్నాను. అంతకంటె ఏం కావాలి ఎవరికైనా. వజ్రోత్సవ వీక్షణం 1955లో మాటిస్సోరీ మొదలైంది. వజ్రోత్సవాలు కూడా జరుపుకున్నందుకు సంతోషంగా ఉంది. చాలామంది వారి స్థాపించిన సంస్థ వజ్రోత్సవాలను కళ్లారా చూసుకోలేరు. నేను చూడగలిగాను, అది నా అదృష్టం. నేను ఏం సాధించాలనుకున్నానో అవన్నీ సాధించాను. – సంభాషణ: డా. పురాణపండ వైజయంతి, సాక్షి, విజయవాడ -
అమ్మోరుతల్లి@కోటేశ్వరమ్మ
-
ఫలించిన అమ్మ కష్టం
కాలం పెట్టే పరీక్షలను ఎదురొడ్డుతూ ఆ తల్లి నిత్యం శనక్కాయల బొచ్చ నెత్తిన మోస్తూ బతుకు బండిని నెట్టుకొస్తోంది. వివరాలివి.. నరసరావుపేట పట్టణంలోని పెదచెరువులో నివాసముంటున్న పల్లపు కోటేశ్వరరావు, కోటేశ్వరమ్మ దంపతులకు ముగ్గురు సంతానం ఉన్నారు. కుటుంబ భారాన్ని నెత్తిన వేసుకున్న కోటేశ్వరమ్మ శనక్కాయలు అమ్ముతోంది. వారి ఇద్దరు కుమారులు ఆదిశేషు, గోపిలు మతిస్ధిమితం లేకుండా జన్మించారు. దీంతో ఆమెకు మరిన్ని కష్టాలు నెత్తినపడ్డాయి. కోటేశ్వరమ్మ తల్లి అంజమ్మ 20 ఏళ్లుగా స్థానిక కోర్టు, తహశీల్దార్, ఆర్డీవో కార్యాలయ ప్రాంగణాల్లో శనక్కాయలు అమ్ముతూ జీవనం సాగించేది. ఆమె తదనంతరం అదే వృత్తిని కొనసాగిస్తున్న కోటేశ్వరమ్మ తనలాగా తన కుమార్తె, కొడుకులు కష్టాలు పాలు కాకుండా ఉండాలని భావించింది. కూడబెట్టిన డబ్బులతో కుమార్తె అనూషను ఎంబీఏ చదివించింది. తమ కోసం తల్లి పడుతున్న కష్టాలను దగ్గరగా చూసిన అనూష ఎలాగైనా ఉన్నతస్థాయి ఉద్యోగం సాధించి కుటుంబానికి అండగా నిలవాలని భావించింది. దీంతో ఈ ఏడాది రెండుసార్లు కానిస్టేబుల్ సెలక్షన్స్‌కు వెళ్లింది. మొదటిసారి అపజయం ఎదురైనా రెండోసారి పట్టుదలతో విజయం సాధించింది. గత ఏడాది మే 19న కానిస్టేబుల్‌గా ఎన్నికైంది. కుమార్తెకు ఉద్యోగం రావడంతో తాను పడిన కష్టానికి ప్రతిఫలం దక్కిందని కోటేశ్వరమ్మ భావిస్తోంది. తన కుటుంబాన్ని ఆదుకునేందుకు మతిస్ధిమిత్తం లేని ఇద్దరు కుమారులను చూసుకునేందుకు అనూష అండగా నిలుస్తుందని ఆశిస్తోంది. మహానేత ైవె ఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా ఎంబీఏ వరకు చదువుకున్నానని అనూష చెప్పింది. ఈ ఉద్యోగంతో సంతృప్తి పడకుండా రానున్న రోజుల్లో ఎస్ఐగా సెలక్ట్ అవుతానని ఆశాభావం వ్యక్తం చేసింది. సమాజంలో మహిళలు పడుతున్న ఇబ్బందుల పరిష్కరించే దిశగా ముందుకె ళతానని చెప్పింది.