
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమం) : దుర్గమ్మ దర్శనంలో భక్తులకు ఏ సమస్య వచ్చినా నేరుగా తనతో చెప్పవచ్చని ఈవో వి.కోటేశ్వరమ్మ చెప్పారు. మహా మండపం సమీపంలోని చాంబర్‌లో శుక్రవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. తొలుత అర్జున వీధి మీదుగా మహా మండపానికి చేరుకున్న ఆమెకు ఏఈవో అచ్యుతరామయ్య, పలువురు పాలక మండలి సభ్యులు స్వాగతం పలికారు. మెట్ల మార్గం ద్వారా నేరుగా మల్లేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకుని స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం దుర్గమ్మ ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకోగా, ఆలయ అర్చకులు, వేద పండితులు ఆశీర్వచనం అందచేశారు.
పాలక మండలి సభ్యులు ఈవో కోటేశ్వరమ్మకు పుష్పగుచ్ఛాలు అందచేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఈవో విలేకర్లతో మాట్లాడుతూ భక్తులకు మంచి దర్శనం, మెరుగైన సేవలే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఆలయ అభివృద్ధికి పెద్ద పీట వేస్తానని తెలిపారు. అమ్మ దర్శనానికి వచ్చిన భక్తులందరూ దుర్గమ్మ బిడ్డలేనని పేర్కొన్నారు. భక్తులకు అమ్మవారి చక్కటి దర్శనంతో పాటు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానన్నారు. అర్చకులు , ఆలయ సిబ్బంది సమన్వయంతో పని చేస్తానని వెల్లడించారు. ఎటువంటి విభేదాలకు తావు ఇవ్వకుండా పని చేయడమే ప్రధాన కర్తవ్యమన్నారు. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ , వారి ఇచ్చే సూచనలు, సలహాలు పాటిస్తానని వివరించారు. ఇక దాతల సౌకర్యార్ధం టీటీడీ తరహాలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తామన్నారు.
భక్తుల మనోబావాలు దెబ్బతిసేలా కొంత మంది ఆలయ సిబ్బంది వ్యవహరిస్తున్నారని, దీని వల్ల తరుచూ అనేక గొడవలు జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని చెప్పారు. త్వరలోనే ఆలయ సిబ్బంది అందరితో ఓ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. భక్తుల పట్ల గౌరవంగా మెలగాల్సిన అవసరం అందరిపైన ఉందన్నారు. ఇక దేవస్థానంలో జరుగుతున్న వివాదాలను ఇకపై జరగకుండా ప్రతి చోటా చెక్ పాయింట్స్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వివిధ విభాగాల అధికారులు కోటేశ్వరమ్మను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ, పాలక మండలి సభ్యులు పెంచలయ్య, శంకరబాబు, పద్మశేఖర్ తదితరులు పాల్గొన్నారు.