
సాక్షి,విజయవాడ: పేద, మధ్య తరగతి వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న నిశ్చయ సీఎం వైఎస్ జగన్ స్ఫూర్తితో భక్తులకు ఉచిత సేవలు అందించాలని నిర్ణయించినట్లు దుర్గగుడి కార్యనిర్వహణాధికారి కోటేశ్వరమ్మ పేర్కొన్నారు. 29 లేదా 30వ తేదీలలో నిశ్చయ సీఎం వైఎస్ జగన్‌మోహనరెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్‌లతో పాటు గవర్నర్ నరసింహన్ అమ్మవారి దర్శనానికి వస్తారని తెలిపారు. దేవస్థానం ఈవో చాంబర్‌లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో కోటేశ్వరమ్మ మాట్లాడుతూ సీఎంగా వైఎస్. జగన్ 30న ప్రమాణ స్వీకారం చేయనున్నారని, ఆ రోజు నుంచి అమ్మవారి సన్నిధిలో సెల్‌ఫోన్ కౌంటర్‌లో టికెట్‌ను రద్దు చేస్తున్నామన్నారు.
ఇప్పటి వరకు రూ.5 వసూలు చేస్తుండగా, ఇకపై సెల్‌ఫోన్‌ను ఉచితంగా భద్రపరుచుకోవచ్చని, దీనిని సేవా కార్యక్రమంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే దేవస్థానం చెప్పుల స్టాండ్, క్లోక్ రూమ్‌ల సేవలను ఉచితంగా అందిస్తుందన్నారు. దుర్గగుడిలో అంతరాలయ దర్శనానికి రూ.300 టిక్కెట్‌ను రూ.200కు తగ్గించాలని నిర్ణయించి, ఉన్నతాధికారుల అనుమతి కోసం పంపామన్నారు.అనుమతులు రాగానే రేట్లు తగ్గిస్తామన్నారు.
రూ.18 కోట్ల డిపాజిట్లు
గతంలో దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి రూ.140 కోట్ల మేర డిపాజిట్లు ఉండేవని, టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఆలయ విస్తరణ పనులు, స్థల సేకరణ నిమిత్తం ఆ డిపాజిట్లు తీసినట్లు పేర్కొన్నారు. గతేడాది సెప్టెంబర్‌లో ఈవోగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఏప్రిల్ నెలాఖరు వరకు రూ.18 కోట్లు దేవస్థానం తరఫున వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో జమ చేసినట్లు చెప్పారు.